Begin typing your search above and press return to search.

ఐఏఎస్ అయ్యి తప్పు చేశావ్ భయ్యా.. "సగం జీతం చాలు" అన్న ఐఏఎస్ లేఖ వైరల్

మనం సాధార‌ణంగా ఉద్యోగాల్లో ఏం చూస్తాం? "తక్కువ పని.. ఎక్కువ జీతం.. సాధ్యమైతే అస్సలు పని లేకుండా నెలనెలా అకౌంట్‌లో పడే ఫుల్ జీతం" సగటు ఉద్యోగి కలలు కనే డ్రీమ్ జాబ్ అంటే ఇదే కదా.. కానీ ఉత్తర్‌ప్రదేశ్ లోని ఒక ఐఏఎస్ అధికారికి మాత్రం ఈ 'సుఖం' అస్సలు నచ్చడం లేదట.

By:  A.N.Kumar   |   21 July 2026 11:40 AM IST
ఐఏఎస్ అయ్యి తప్పు చేశావ్ భయ్యా.. సగం జీతం చాలు అన్న ఐఏఎస్ లేఖ వైరల్
X

మనం సాధార‌ణంగా ఉద్యోగాల్లో ఏం చూస్తాం? "తక్కువ పని.. ఎక్కువ జీతం.. సాధ్యమైతే అస్సలు పని లేకుండా నెలనెలా అకౌంట్‌లో పడే ఫుల్ జీతం" సగటు ఉద్యోగి కలలు కనే డ్రీమ్ జాబ్ అంటే ఇదే కదా.. కానీ ఉత్తర్‌ప్రదేశ్ లోని ఒక ఐఏఎస్ అధికారికి మాత్రం ఈ 'సుఖం' అస్సలు నచ్చడం లేదట. "పని తక్కువగా ఉంది, నాకు సగం జీతమే ఇవ్వండి సామీ" అంటూ లక్నో పెద్దలకు దండం పెడుతూ ఐదు పేజీల సంచలన లేఖ రాశారు.

2023 బ్యాచ్‌కు చెందిన రింకూ సింగ్ రాహీ ప్రస్తుతం జలౌన్‌లో ఎస్‌డీఎం జ్యుడీషియల్‌ గా పనిచేస్తున్నారు. రోజూ హాయిగా నాలుగు గంటలు కాలక్షేపం చేసి.. మిగతా టైమ్‌లో ఛాయ్ తాగుతూ ఫుల్ జీతం తీసుకోవడం ఆయన మనస్సాక్షికి నచ్చలేదట. అందుకే "నా సామర్థ్యానికి తగ్గ పని ఇవ్వండి.. లేదంటే నన్ను వేరే జిల్లాకో, పక్క రాష్ట్రానికో పంపేయండి. అంతవరకు నాకు పూర్తి జీతం ఇచ్చి నన్ను నేరస్థుడిని చేయకండి.. సగం కోసేయండి" అని సీఎస్ గారికి మొరపెట్టుకున్నారు.

రాజకీయ నాయకుల "అతిప్రేమ".. కలెక్టర్ గారి "సలహాలు"

అయితే కథ ఇక్కడితో ఆగితే దాన్ని యూపీ రాజకీయం అని ఎందుకంటారు? రాహీ గారు తన లేఖలో అసలు బాంబు పేల్చారు. అక్కడ రాజకీయ జోక్యం ఏ స్థాయిలో ఉందో పూసగుచ్చినట్లు రాసుకొచ్చారు. జలౌన్‌లో పనిచేస్తున్నప్పుడు అక్రమ భూకబ్జాలు, ఆక్రమణలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతే.. "బాస్.. అవన్నీ మనోళ్లవే.. కాస్త చూసీచూడనట్లు ఉండకూడదూ?" అని కలెక్టర్ గారు సున్నితంగా హితవు పలికారట. ఆ సమయంలో పక్కనే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారట..

అంతేకాదు రాష్ట్ర మంత్రిగారికి సంబంధించిన ఆక్రమణల పురాణంపై నిష్పాక్షిక విచారణ జరగకుండా పెద్ద పెద్ద శక్తులే రక్షణగా నిలిచాయని ఆరోపించారు. ఒక కోల్డ్ స్టోరేజీలో ఫైర్ సేఫ్టీ లేదని, పత్రాలు సరిగా లేవని నివేదిక అడిగేసరికి.. అధికారులు ఈయన ఉత్సాహాన్ని తట్టుకోలేక కమిటీ నివేదిక కూడా రాకముందే "షాంటింగ్" పోస్ట్ అయిన ఎస్‌డీఎం జ్యుడీషియల్ గా బదిలీ పడేసి హమ్మయ్య అనుకున్నారట..

'జనతా దర్శన్' కాదు.. అది 'ఫోటో దర్శన్'

ప్రజల సమస్యలు తీర్చడానికి పెట్టే 'జనతా దర్శన్' పై కూడా ఆయన సెటైర్లు పేల్చారు. అది సమస్యల పరిష్కారానికి కాదు.. కేవలం పేపర్‌పై సంఖ్యలు చూపించుకోవడానికి, ఫోటోలకే పరిమితమవుతోందని కుండబద్దలు కొట్టారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం మాని.. తాత్కాలిక మసిపూసి మారేడు కాయ చేయడమే పరిపాలనగా మారిందని వాపోయారు.

మొత్తానికి "పని లేకుండా జీతం వస్తే పండగ చేసుకునే" రోజుల్లో "పని లేకపోతే జీతం వద్దనే" ఈ విచిత్ర ఐఏఎస్ అధికారి వ్యవహారం ఇప్పుడు లక్నో పరిపాలనా వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారింది. మరి రాహీ గారి నిజాయితీకి మెచ్చి పనిచేసే పోస్టింగ్ ఇస్తారో లేక "ఎక్కువ మాట్లాడుతున్నావ్" అని జీతంతో పాటు ఉద్యోగానికి కూడా ఎసరు పెడతారో వేచి చూడాల్సిందే..