70 కోట్ల విలువైన నకిలీ రూ.20 కాయిన్‌లు తయారు చేసిన కేటుగాళ్లు!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠా రూ.70 కోట్ల విలువైన నకిలీ రూ.20 నాణేలు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హరియాణాలో స్క్రూడ్రైవర్ తయారీ పరిశ్రమ ముసుగులో ఈ దందా నిర్వహించారు. యంత్రాలను యూపీకి తరలించే ప్రయత్నంలో సహరన్‌పూర్ పోలీసులు ముఠాను అరెస్ట్ చేశారు. ఆరు భారీ యంత్రాలను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
By: Sivaji Kontham | 9 Nov 2026 8:00 PM ISTఇది షాక్‌లకే షాకిచ్చే వార్త! నిన్నటి వరకూ నకిలీ కరెన్సీ పట్టివేత వంటి వార్తలు విన్నాం. ఇప్పుడు నకిలీ కాయిన్ల మాఫియా పట్టివేత! వంటి వార్తలు వినాల్సిన టైమ్ వచ్చింది. ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఒక ముఠా ఏకంగా 70 కోట్ల విలువైన రూ.20 కాయిన్లను తయారు చేసి డ్రమటిగ్గా పోలీసులకు చిక్కడం సంచలనంగా మారింది.
స్క్రూ డ్రైవర్ల తయారీ పరిశ్రమ పేరుతో యంత్రాలను కొనుగోలు చేసి సెటప్ చేసిన ఐదుగురు సభ్యుల గ్యాంగ్ ఇంత పెద్ద దందాకు తెర తీయడం భారతదేశ నేర చరిత్రలోనే కొత్తది. హరియానాలోని సోనిపట్ జిల్లాలో కొన్ని నెలల పాటు ఈ దందా నడిపించారు. బయటి ప్రపంచాన్ని స్క్రూ డ్రైవర్ల తయారీ పరిశ్రమ పేరుతో నమ్మించి, లోన 20 రూపాయల కాయిన్లు తయారు చేయడం ప్రారంభించారని తెలిసింది.
అయితే ఐదుగురు సభ్యులున్న ఈ గ్యాంగ్ లో ఒక వ్యక్తి దిల్లీలో పోలీసులకు కొన్ని ఇతర కారణాల వల్ల పట్టుబడ్డాడు. ఆ తర్వాత తాము కూడా దొరికిపోతామనే భయంతో యంత్రాలను హరియాణా నుంచి ఉత్తరప్రదేశ్ కి తరలించేందుకు ప్రయత్నించగా, సహరం పూర్ పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసారు. తీగ లాగితే ఇప్పుడు డొంకంతా కదిలింది. అసలు విషయం విన్న వెంటనే పోలీసులు అవాక్కయ్యారు.
అరెస్టయిన వారిలో 62 ఏళ్ల ఉప్‌కార్ లూథ్రా అలియాస్ అభయ్ ప్రతాప్ సింగ్ కీలక సూత్రధారి. అతడు గతంలో గోల్డ్ స్మిత్ (భంగారు ఆభరణాల తయారీదారు)గా పని చేసిన అనుభవంతో నాణేలను సులువుగా తయారు చేయగలిగాడు. అతడికి తిహార్ జైలులో పరిచయమైన హిమాన్షు అనే కేటుగాడు కూడా సహకరించారు. ముజఫర్‌నగర్ నివాసి కుల్ దీప్.. బిహార్ లోని మధుబని నివాసి అయిన సంతోష్ చౌరాసియా అలియాస్ జనార్దన్ కూడా ఈ ముఠాలో చేరారు. యూపీలోని సంత్ రవిదాస్ నగర్ నివాసి అయిన అనురాగ్ పాల్ అలియాస్ లంకేష్ కూడా వీళ్ల దందాలో చేరాడు. ఇక్కడ దిగ్భ్రాంతికర విషయం ఏమంటే వీరంతా జైళ్లలోనే స్నేహితులు అయ్యారట.
500 చదరపు అడుగుల స్థలంలో స్క్రూడ్రైవర్ల పరిశ్రమ పేరుతో మిషన్లు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకోవడంతో భోగోతం అంతా బయటపడింది. అప్పటికే ఆరు భారీ యంత్రాలను వాహనాల్లో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
