Begin typing your search above and press return to search.

మరో మిత్ర పక్షంతో కాంగ్రెస్ పేచీ...ఇలాగైతే ఎలా ?

ఆ గెలుపు ఆశలు అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింతగా పెరిగిపోతున్నాయి. అందుకే 150 అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ కోరుతోంది అని వార్తలు వస్తున్నాయి.

By:  Satya P   |   4 Oct 2026 3:00 PM IST
మరో మిత్ర పక్షంతో కాంగ్రెస్ పేచీ...ఇలాగైతే ఎలా ?
X

కాంగ్రెస్ ఒకనాటి బలమైన జాతీయ పార్టీ. ఈ మాట కరెక్ట్ గానే రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఇంకాస్తా ముందుకు వెళ్ళి గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని కూడా అంటారు. అంటే వెనకటి వైభవం అన్న మాట. వర్తమానంలో కాంగ్రెస్ ఏదీ ఎక్కడా అంటే తక్కువే మరి. ఈ రోజున కాంగ్రెస్ దేశంలో నాలుగు రాష్ట్రాలలో సొంతంగా అధికారంలో ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే బీజేపీ ఉత్తరాది పార్టీగా ముద్ర పడితే కాంగ్రెస్ దక్షిణాది పార్టీగా మారిపోయింది. ఆ పార్టీ అధికారం అంతా సౌత్ లోనే ఉంది. అయితే పోయిన చోటనే వెతుక్కోవాలి. అందుకే నాలుగు దశాబ్దాల క్రితం నాటి రాజకీయ వైభవాన్ని కాంగ్రెస్ యూపీలో కోరుకుంటోంది. 2024లో మిత్ర పక్షం సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆరు ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ గెలుపు ఆశలు అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింతగా పెరిగిపోతున్నాయి. అందుకే 150 అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ కోరుతోంది అని వార్తలు వస్తున్నాయి.

రెండంటే రెండే :

ఇక 2022 లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి రెండంటే రెండు సీట్లు మాత్రమే లభించాయి. ఆ సీట్లనే కొలమానంగా తీసుకుని ఎస్పీ 2027 ఎన్నికలలో సీట్ల సర్దుబాటులో కేటాయింపులు చేస్తామని అంటోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మొత్తం 400 పై దాటి ఉన్న యూపీ అసెంబ్లీలో మూడవ వంతు అంటే 150 దాకా సీట్లు ఇవ్వాలని డిమాండ్ పెడుతోంది. తమకు మద్దతు బాగా జనంలో పెరిగిందని కూడా చెప్పుకుంటోంది. దాని మీద ఎస్పీ ఎంపీ శివ్‌పాల్‌ సింగ్‌ అయితే కాంగ్రెస్ మీద తాజాగా సెటైర్లు వేశారు. అసలు కాంగ్రెస్ కి 50 సీట్లు ఇవ్వడమే ఎక్కువ అంటూ ఆయన చేసిన హాట్ కామెంట్స్ కాంగ్రెస్ నేతలలో మంట పుట్టిస్తున్నాయి. యూపీలో కాంగ్రెస్ కి బలం ఎక్కడని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎస్పీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కే లాభం అని కూడా ఆయన అంటున్నారు.

పట్టుదలగానే :

అయితే ఎస్పీ తమను తక్కువగా చూస్తోంది అని యూపీ కాంగ్రెస్ నేతలు గుర్రు మీద ఉన్నారు. యూపీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ అయితే సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడుతూ నిజానికి 403 సీట్లు ఉన్న యూపీలో సగం సీట్లు తమకు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. అయినా సరే తాము తగ్గి 150కి పరిమితం అయ్యామని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీట్లను తగ్గించుకునేది లేదని కూడా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే పొత్తుల విషయంలో కాంగ్రెస్ వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ముందుకు రాకపోతే మాత్రం పొత్తుల ఉద్దేశ్యాలు దెబ్బ తింటాయని ఎస్పీ అంటోంది. ఇక అక్టోబర్ లోనే సీట్ల సర్దుబాటు మీద రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతాయని అంటున్నారు.

డుమ్మా కొట్టిన ఎస్పీ :

యూపీలో కాంగ్రెస్ సీట్ల పేచీతో మిత్ర పక్షం ఎస్పీ గుస్సా అవుతోంది అని అంటున్నారు. అందుకే తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరు కాలేదని తమ పార్టీ నేతలను పంపించారని గుర్తు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ఆచీ తూచీ వ్యవహరించకపోవడం వల్లనే మిత్రులు దూరం అవుతున్నారని ఢిల్లీ ఎన్నికలు ఆప్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇపుడు యూపీలో కూడా కాంగ్రెస్ అలిగితే పొత్తు దెబ్బ తింటే ఎస్పీకి పోయిన దాని కంటే కాంగ్రెస్ కే నష్టం అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ వెర్షన్ వేరే విధంగా ఉంది. తాము జాతీయ పార్టీగా బలంగా ఉన్నామని యూపీలో పుంజుకున్నామని చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కనీసం 150 ఎంపీ సీట్లు తెచ్చుకోకపోతే ప్రధాని పీఠం కాంగ్రెస్ కి దక్కదని అంటున్నారు. అందుకే యూపీలో తన బలం పెంచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది అని అంటున్నారు.