Begin typing your search above and press return to search.

యోగి హ్యాట్రిక్ సీఎం అవుతారా? 2027లో ‘బుల్డోజర్ బాబా’కు అసలు పరీక్ష ఇదే!

గత అనుభవాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించని రాజకీయ షాక్‌ను ఇచ్చాయి.

By:  A.N.Kumar   |   28 Sept 2026 11:31 PM IST
యోగి హ్యాట్రిక్ సీఎం అవుతారా? 2027లో ‘బుల్డోజర్ బాబా’కు అసలు పరీక్ష ఇదే!
X

దేశంలోనే అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలున్న డిసైడర్ ఫ్యాక్టర్ లాంటి ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు ఎప్పుడూ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తాయి.. కానీ రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలు మాత్రం మునుపెన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా మారనున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకొని చారిత్రాత్మక హ్యాట్రిక్‌ సాధించాలని మహత్తర లక్ష్యంతో ముందుకుసాగుతోంది. 2017లో ఊహించని భారీ మెజారిటీతో పీఠమెక్కిన యోగి.. 2022లోనూ తన సమర్థ నాయకత్వంతో కాషాయ జెండాను ఎగురవేశారు. అయితే 2027 సమరం మాత్రం కేవలం ఎన్నికల పోరు మాత్రమే కాదు.. యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత ప్రజాదరణకు.. యూపీలో బీజేపీ సంస్థాగత బలానికి తీవ్రమైన అగ్నిపరీక్షగా మారనుంది.

గత అనుభవాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించని రాజకీయ షాక్‌ను ఇచ్చాయి. అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ.. కాంగ్రెస్‌తో కలసి సాధించిన బలమైన ప్రదర్శన అధికార పక్షాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ సరళి రాబోయే అసెంబ్లీ పోరులోనూ పునరావృతమవుతుందా లేక 2027 నాటికి బీజేపీ తన పట్టును తిరిగి సాధించుకుంటుందా అనేది ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. యోగికి 'బుల్డోజర్‌ బాబా'గా ఉన్న కఠినమైన పాలకుడి ఇమేజ్, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు బీజేపీకి ప్రధాన ప్రచార ఆయుధాలుగా మారనున్నాయి. కానీ కేవలం ఈ ఇమేజ్ మాత్రమే ప్రతికూలతలను దాటుకుని గెలుపుతీరాలకు చేరుస్తుందా అనేది వేచి చూడాలి.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ఎల్లప్పుడూ శాసించేది సంక్లిష్టమైన కుల సమీకరణాలే. యోగి ప్రభుత్వం తన వైపు ఉన్న అగ్రవర్ణాలు, ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) బలమైన సామాజిక కూటమిని కాపాడుకోవాలని చూస్తుంటే అఖిలేష్ యాదవ్ తన 'పీడీఏ' (పిచ్‌డా, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహంతో దళితులు ,ఇతర బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ ఓట్లను ఎంతవరకు సాధిస్తుందనేది కూడా అత్యంత కీలకం కానుంది. బిఎస్పీ బలహీనపడితే ఆ దళిత ఓటు బ్యాంక్ ఎటువైపు మళ్లుతుందనే దానిపైనే ఎస్పీ, బీజేపీల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. దీనికి తోడు ఎస్పీ-కాంగ్రెస్ కూటమి మధ్య సజావుగా సాగే సీట్ల పంపిణీ, బూత్ స్థాయి సమన్వయం బీజేపీకి గట్టి సవాలు విసరగలవు.

యోగి ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం ఉన్నప్పటికీ.. స్థానిక ఎమ్మెల్యేల పనితీరు మాత్రం వేరే అంశం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, స్థానిక సమస్యలు, అభ్యర్థుల ఎంపికలో తప్పిదాలు బీజేపీకి నష్టం కలిగించే అవకాశం ఉంది. అందుకే యోగి ఇమేజ్‌తో పాటు నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక కీలకం కానుంది. ఇక బీజేపీ ఆర్ఎస్ఎస్ సమన్వయం, బూత్‌ స్థాయి సంస్థాగత బలం, ఓటర్లను పోలింగ్‌ కేంద్రాల వరకు తీసుకురావడం వంటి అంశాలు కూడా హ్యాట్రిక్‌ ప్రయత్నంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

కేవలం కుల సమీకరణాలు, విపక్షాల కూటమి మాత్రమే కాకుండా స్థానిక ప్రజా సమస్యలు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. నిరుద్యోగం, ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై యువత స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. అదే సమయంలో సంక్షేమ పథకాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, సురక్షితమైన వాతావరణం పొందుతున్న మహిళా ఓటర్లు యోగి ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా మారే అవకాశముంది. వీటితో పాటు నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను అధిగమించడం.. వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేయడం బీజేపీ ముందున్న అతిపెద్ద సవాలు. లోక్‌సభ ఎన్నికల హెచ్చరికను అర్థం చేసుకుని.. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో బూత్ స్థాయి యంత్రాంగాన్ని పటిష్టం చేసుకుంటేనే యోగి ఆదిత్యనాథ్ మూడోసారి లక్నో పీఠాన్ని అధిరోహించి కొత్త చరిత్ర సృష్టించగలరు.

2022తో పోలిస్తే బీజేపీకి 2024 ఫలితాల రూపంలో కొత్త సవాలు ఎదురైంది. అదే సమయంలో యోగి వ్యక్తిగత ఇమేజ్‌, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సంస్థాగత బలం బీజేపీకి అనుకూల అంశాలుగా ఉన్నాయి. అందుకే 2027లో యోగి హ్యాట్రిక్‌ను నిర్ణయించేది ఒక్క ‘బుల్డోజర్‌ ఇమేజ్‌’ కాదు. యోగి ప్రజాదరణతో పాటు కుల సమీకరణాలు, స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, యువత–మహిళల ఓటు, ప్రతిపక్ష ఐక్యత, 2024 తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు.. ఈ ఐదు అంశాలే అసలు కీలకంగా మారనున్నాయి. ప్రతిపక్షాలు ఈ అంశాలను సమర్థంగా కలుపుకోగలిగితే పోటీ మరింత హోరాహోరీగా మారవచ్చు. బీజేపీ తన సంస్థాగత బలంతో పాటు 2024లో వచ్చిన సందేశాన్ని ఎంతవరకు అర్థం చేసుకుని వ్యూహాన్ని మార్చుకుంటుందన్నదే యోగి హ్యాట్రిక్‌కు అసలు పరీక్ష.