రాహుల్‌పై జీవిత కాల నిషేధం.. తీర్మానం ఆమోదిస్తే!
భారత పార్లమెంటులో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు తీర్మానాలు వచ్చాయి. ఇవి కూడా ప్రత్యక్షం గా ఎన్నికైన ఇద్దరు కీలక నాయకులపై లోక్‌సభలో ప్రవేశ పెట్టిన తీర్మానాలు.
By: Garuda Media | 18 Feb 2026 5:35 PM ISTభారత పార్లమెంటులో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు తీర్మానాలు వచ్చాయి. ఇవి కూడా ప్రత్యక్షం గా ఎన్నికైన ఇద్దరు కీలక నాయకులపై లోక్‌సభలో ప్రవేశ పెట్టిన తీర్మానాలు. అంతేకాదు.. వీటి పై చర్చించేందుకు.. సభ్యుల ఆమోదం పొందేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ పొందిన తీర్మానాలు. ప్రస్తుతం ఈ రెండు తీర్మానాల వ్యవహారం .. జాతీయస్థాయిలో రాజకీయాలను కుదిపేస్తోంది. వచ్చే నెల 9వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ రెండు తీర్మానాలు కీలకంగా మారానున్నాయి.
1) దేశ పార్లమెంటు చరిత్రలో తొలిసారి.. లోక్‌సభ స్పీకర్‌ను పదవీచ్యుతుడిని చేసే అవిశ్వాస తీర్మానం. దీనిని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యులు తాజా సమావేశాల్లోనే ప్రవేశ పెట్టారు. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. 1) లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని మాట్లాకుం డా చేస్తున్నారని.. ఆయన నోరు నొక్కుతున్నారన్నది కారణం. 2) ఇటీవల రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చివరగా ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో ప్రసంగించాల్సి ఉంది.
కానీ, ఆయన చివరి మూడు రోజులు సభకు రాలేదు. ఆఖరు రోజు రాజ్యసభలో తన ప్రసంగాన్ని వినిపించా రు. అయితే.. లోక్‌సభకు ప్రధాని ఎందుకు రాలేదన్న ప్రశ్నకు.. స్పీకర్ ఓంబిర్లా చేసిన వ్యాఖ్యలు మంట లు రగిలించాయి. ``ప్రధానికి ప్రాణ హాని ఉంది. ఆయనపై మహిళా ఎంపీలు దాడి చేస్తారని మాకు సందేహంగా ఉంది. అందుకే.. ప్రధాని లోక్‌సభకు రారు`` అని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మహిళా ఎంపీలు స్పీకర్ తీరుపై విరుచుకుపడ్డారు. ఆయన సభాపతి స్థానానికి అనర్హులని.. ఆయనను ఆ పదవి నుంచి దింపేయాలని డిమాండ్ చేస్తూ.. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.
2) ఇక రెండో తీర్మానం.. రాహుల్‌గాంధీపైనే కావడం గమనార్హం. జాతీయ భద్రతకు రాహుల్ ప్రమాదకర వ్యక్తిగా మారారని.. విదేశాల దగ్గర భారత్ పరువు తీస్తున్నారని.. ఆరోపిస్తూ.. బీజేపీ సభ్యుడు రుషికాంత్ దూబే.. రాహుల్.. సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు.. ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ.. ఓ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీనికి 50 మంది బీజేపీ సభ్యులు మద్దతు పలికారు. దీంతో ఈ తీర్మానాలు కూడా.. వచ్చే నెల 9 నుంచి తిరిగి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో చర్చకు రానున్నాయి.
ఈ రెండు తీర్మానాల్లో స్పీకర్ కు ఎన్డీయే సభ్యుల మద్దతు ఉంటుంది.. కాబట్టి ఆయన పదవి పోదు. కానీ, ఆయన వ్యవహార శైలిపై మాత్రం ఉభయ సభల్లో ప్రతిపక్షాలు చర్చించేందుకు.. ఎండగట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇలా జరగడం దేశ చరిత్రలోనే తొలిసారి. ఇక, రాహుల్ పై ప్రవేశ పెట్టిన తీర్మానం కనుక ఆమోదం పొందితే.. ఇక, పార్లమెంటుకు ఆయన పోటీ చేసే అవకాశాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ఈ రెండు తీర్మానాలు ఇప్పుడు జాతీయస్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
