యూకే ముక్కలు కాక తప్పదా ?!
1535 - 1542 హెన్రీ VIII కాలంలో వేల్స్ చట్టాల(Laws in Wales Acts) ద్వారా వేల్స్ ఇంగ్లండ్ లో విలీనం అయింది.
By: Tupaki Political Desk | 14 Sept 2026 9:11 AM ISTచారిత్రక యూనియన్ల ఫలితంగా ఏర్పడిన యునైటెడ్ కింగ్ డమ్ త్వరలో విచ్చిన్న కానుందా ? శతాబ్దాల నేపథ్యంలో గల యూకే త్వరలో ముక్కలు కాక తప్పదా ? అంటే జరుగుతున్న పరిణామాలు, చర్చలు మాత్రం తీవ్రంగానే ఉన్నాయి. తమకు స్వాతంత్య్రం కావాలని దాని పరిధిలోని స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ లలో స్వాతంత్య్ర ఉద్యమాలు బలపడుతుండడం దీనికి సంకేతంగా కనిపిస్తున్నది.
1535 - 1542 హెన్రీ VIII కాలంలో వేల్స్ చట్టాల(Laws in Wales Acts) ద్వారా వేల్స్ ఇంగ్లండ్ లో విలీనం అయింది. 1603లో క్రౌన్ యూనియన్, 1707లో యూనియన్ చట్టాల ద్వారా గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. అయితే స్కాట్లాండ్ తన స్వంత న్యాయవ్యవస్థను అలాగే ఉంచుకుంది. 1801లో యూనియన్ చట్టాల ఆధారంగా యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ఏర్పడింది.
1921 - 22లో దక్షిణ ఐర్లాండ్ స్వాతంత్య్రం పొంది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అయింది. ఉత్తర ఐర్లాండ్ లోని ఆరు కౌంటీలు యూకేలోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు కార్డిఫ్ లో స్కాంట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ నాయకులు సమావేశమై స్వీయనిర్ణయ హక్కులు, రిఫరెండమ్ ల కోసం మెమోరాండంపై సంతకాలు చేయనుండడం ఆసక్తికరంగా మారింది.
బ్రెక్సిట్ ప్రజాభిప్రాయ సేకరణలో స్కాంట్లాండ్, నార్తర్న్ ఐలాండ్ ప్రజలు యూరోపియన్ యూనియన్ లోనే ఉండాలని ఓటు వేసినా బయటకు రావాల్సి వచ్చింది. ఇంగ్లండ్, వేల్స్ లలో అధికశాతం విడిపోవాలి అని ఓటు వేసినా అందులోనే ఉండాల్సి వచ్చింది. విడివిడి దేశాలుగా కాకుండా యూకే వ్యాప్తంగా జరిగిన ఓటింగ్ ఒకే యూనిట్ గా పరిగణించడం ఈ పరిణామాలకు దారి తీసింది.
స్కాంట్లాండ్ లో 62 శాతం మంది, నార్తర్న్ ఐర్లాండ్ లో 55.8 శాతం మంది కలిసి ఉండాలి అని, ఇంగ్లాండ్ లో 53.4 శాతం మంది, వేల్స్ లో 52.5 శాతం మంది విడిపోవాలని ఓటు వేశారు. స్కాంట్లాండ్ ప్రజలు తాము ఇష్టపడకున్నా బలవంతంగా యూరోపియన్ యూనియన్ నుండి బయటకు తీసుకువచ్చారని భావిస్తున్నారు.
2026లో స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్, వేల్స్ మూడు ప్రాంతాల్లోనూ నేషనలిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. స్కాటిష్, వెల్ష్, ఐరిష్ గుర్తింపు బలంగా ఉంది. అయితే లండన్ కేంద్రీకృత పాలనపై అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న సమావేశం కీలకంగా మారింది. అయితే మొత్తం పరిణామాలను గమనిస్తే ఇప్పట్లో విభజన అనేది అంత తేలిక అయితే కాదు అని తెలుస్తుంది.
