Begin typing your search above and press return to search.

ఒక్కసారిగా కాక్ పిట్ బద్ధలు కొట్టి లోనికి.. అసలు ఏంటా వస్తువు..?

కాక్‌పిట్‌లో ఆ వస్తువు వేగంగా దూసుకువచ్చింది. పైలట్‌ చేతికి గాయమై రక్తం కారడం మాత్రమే కాకుండా, విండ్‌షీల్డ్‌ చుట్టూ కాలిన గుర్తులు కనిపించాయి.

By:  Tupaki Political Desk   |   20 Oct 2025 6:00 PM IST
ఒక్కసారిగా కాక్ పిట్ బద్ధలు కొట్టి లోనికి.. అసలు ఏంటా వస్తువు..?
X

‘తెలిసింది గోరంత.. తెలియంది కొండంత’ బాబాలో రజిని చెప్పిన డైలాగ్. ఇది అక్షరం.. అక్షరం సత్యమే. మానవ మేథస్సు పెరిగినా.. ఎన్ని కనుగొన్నా.. ఇంకా అంతుపట్టినివి ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాయి. 36 వేల అడుగుల ఎత్తులో విమానంలోకి దూసుకువచ్చిన వస్తువుపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అసలు ఏంటా వస్తువు? ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.

డెన్వర్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్తున్న విమానంలో..

డెన్వర్‌ నుంచి లాస్‌ ఏంజెల్స్‌ వెళ్తున్న యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ 1093, 36 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుండగా ఒక్కసారిగా ఆకాశంలోనుంచి ఓ అదృశ్య వస్తువు దూసుకొచ్చి విమానం విండ్‌షీల్డ్‌ను పగులగొట్టి కాక్‌పిట్‌లోకి చొరబడింది. ఆ క్షణంలో ప్రయాణికులు ఊహించని భయంతో వణికిపోయారు. ఆకాశం మధ్యలో సురక్షితంగా ఉన్నామనే భ్రమ వారిలో ఒక్కసారిగా చెదిరిపోయింది.

పైలట్ ను సైతం గాయపరిచి..

కాక్‌పిట్‌లో ఆ వస్తువు వేగంగా దూసుకువచ్చింది. పైలట్‌ చేతికి గాయమై రక్తం కారడం మాత్రమే కాకుండా, విండ్‌షీల్డ్‌ చుట్టూ కాలిన గుర్తులు కనిపించాయి. కాక్‌పిట్‌లో గాజు ముక్కలు చెల్లాచెదురై, పరికరాలు క్షణకాలం పనిచేయకుండా పోయాయి. పైలట్‌ విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్‌ చేయగలిగాడు. 134 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. కానీ ఈ ఘటన తర్వాత అమెరికన్‌ విమానయాన రంగం, భద్రతా వ్యవస్థలు కొత్త ఆందోళనలో పడ్డాయి.

హాలీవుడ్ సినిమా తరహాలో ఘటన..

ఈ ఘటన హాలీవుడ్‌ సినిమా తరహాలో ఉన్నా, ఇది వాస్తవం. అంతర్జాతీయ విమానయాన చరిత్రలో ఇంత ఎత్తులో ఇలాంటి ఢీ దాదాపు అసాధారణం. పక్షులు ఆ ఎత్తులో ఎగరలేవు, వడగళ్లు అక్కడ ఉండవు. అయితే ఆ అదృశ్య వస్తువు ఏంటి? ఇదే ఇప్పుడు అమెరికన్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA), నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (NTSB)కు పెద్ద ప్రశ్నగా మారింది.

దర్యాప్తు చేస్తున్న సంస్థలు..

ఈ ఘటనపై NTSB, FAA సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. విండ్‌షీల్డ్‌ తగిలిన భాగాన్ని ల్యాబ్ కు పంపించారు. ఇది పక్షి ఢీకొనడం కాదని, ఆ ఎత్తులో వడగళ్లు సైతం పడవని అధికారులు స్పష్టం చేశారు. ఒక శ్రేణి నిపుణులు దీన్ని ‘హై ఆల్టిట్యూడ్‌ అనామలస్‌ ఆబ్జెక్ట్‌’గా పరిగణిస్తున్నారు. అంటే ఇది ఒక అంతరిక్ష శిథిలం (space debris) కావచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు, రాకెట్‌ ముక్కలు వాతావరణంలోకి చేరుతాయి. అవి చాలా వేగంతో కిందికి పడిపోతే, చిన్న భాగం కూడా అధిక శక్తి కలిగి ఉంటుంది.

FAA అంచనా ప్రకారం, వాణిజ్య విమానానికి అంతరిక్ష శిథిలం తగిలే అవకాశం ‘ఒకటిన్నర ట్రిలియన్‌లో ఒకసారి’ మాత్రమే. కానీ ఈ ఘటన ఆ అరుదైన ప్రమాదానికి సజీవ ఉదాహరణ. మరో కోణం నుంచి నిపుణులు ఇది మెటాలిక్‌ డెబ్రిస్‌ లేదా ఎలక్ట్రానిక్‌ ఫ్లేర్‌ అవశేషం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత నిశితంగా పరిశీలిస్తున్న యూఎస్ ఎయిర్ వేస్..

ఇక ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా గగనతలంలో ‘గుర్తు తెలియని ఎయిర్ వస్తువులు’ గుర్తించబడ్డాయి. కెనడా, అలాస్కా ప్రాంతాల్లో తాత్కాలిక రాడార్‌ జోక్యాలు నమోదవడం, కొన్ని UFO లాంటి వీడియోలు బయటపడడం ఇవన్నీ ఈ ఘటన చుట్టూ ఆసక్తిని మరింత పెంచాయి. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ మాత్రం ఇంకా అధికారిక వివరణ ఇవ్వలేదు. అయితే కంపెనీ వర్గాలు ‘పైలట్‌ గాయాలు స్వల్పం, ప్రయాణికుల భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదు’ అని ప్రకటించాయి. ఇది ఇలా ఉండగా.. ఈ ఘటన తర్వాత బోయింగ్‌ కంపెనీ తమ 737 MAX 8 మోడల్‌పై అదనపు భద్రతా పరిశీలనలు చేపట్టింది. విండ్‌షీల్డ్‌ రెసిస్టెన్స్‌, కాక్‌పిట్‌ ప్రెషర్‌ బ్యాలెన్స్‌ వ్యవస్థలపై కొత్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

అంతరిక్ష శిథిలాలేనా..?

అంతరిక్ష శిథిలాలు, మెటాలిక్‌ డెబ్రిస్‌, వాతావరణ మినరల్‌ ఫ్లాష్‌ ఈ మూడు అంశాల్లో ఏదైనా ప్రమాదానికి కారణం కావొచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. మనం ఎగురుతున్న ఆకాశం పూర్తిగా మన నియంత్రణలో లేదు. మనకు కనిపించని, అర్థం కాని శక్తులు ఇంకా గగనతలంలో ఉన్నాయి అని తెలుస్తుంది.