‘స్థానిక’ సిత్రాలు.. సర్పంచ్ బరిలో అన్నాచెల్లెళ్లు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచి ఎన్నికల్లో ఒకే తల్లి రక్తం పుంచుకు పుట్టిన అన్నాచెల్లెళ్లు ఎన్నికల బరిలోకి దిగటమే కాదు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు.
By: Garuda Media | 4 Dec 2025 12:00 PM ISTతెలంగాణలో జరుగుతున్న స్థానిక ఎన్నికలకు సంబంధించిన సిత్రాలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఇందులో కొన్ని ఉదంతా ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షించేలా చేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి రెండు ఉదంతాల్ని చూస్తే.. ఎన్నికలా మజాకానా అనుకోకుండా ఉండలేం. జగిత్యాల జిల్లా పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో అన్నాచెల్లెళ్లు బరిలోకి దిగిన వైనం అందరిని ఆకర్షించటమే కాదు.. పాడు రాజకీయం అనుకోకుండా ఉండేలం. ఇదిలా ఉంటే.. మరోవైపు యూత్ అందునా ఉన్నత చదువుల్ని అభ్యసించిన వారు.. చదువుకుంటున్న వారు ఎన్నికల బరిలో నిలిచేందుకు పెద్దగా ఆసక్తిని చూపటం లేదన్న మాటకు భిన్నంగా వనపర్తి జిల్లాకి చెందిన ఒక వైద్య విద్యార్థిని బరిలోకి నిలవటం ఆసక్తికరంగా మారింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచి ఎన్నికల్లో ఒకే తల్లి రక్తం పుంచుకు పుట్టిన అన్నాచెల్లెళ్లు ఎన్నికల బరిలోకి దిగటమే కాదు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. సర్పంచి పదవిని ఎస్సీ జనరల్ కు కేటాయించారు. దీంతో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
మిగిలిన ముగ్గురు బరిలో మిగిలిన విషయాన్ని అధికారులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు అన్నాచెల్లెళ్లు బరిలో ఉన్నారు. వీరిలో తెడ్డు శివకుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిస్తే.. బీఆర్ఎస్ మద్దతుతో రౌట్ల స్రవంతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరి.. ఓటర్లు ఎవరికి సర్పంచి పీఠాన్ని కట్టబెడతారో చూడాలి.
ఇదిలా ఉంటే.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల పరిధిలోని ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామపంచాయితీ సర్పంచి స్థానికి వైద్య విద్యార్థిని నిఖిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ బీమ్యానాయక్ వైద్య విద్యార్థిని నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తించారు. దీంతో.. ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. నిఖిత ప్రస్తుతం నాగర్ కర్నూల్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. నిఖిత తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి రాజేంద్రప్రసాద్ డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తుంటే.. తల్లి చిలకమ్మ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.
