ప్రజల్ని ఇబ్బంది పెట్టే రూల్ వద్దేవద్దు...: ఇండిగోపై ప్రధాని ఫస్ట్ రియాక్షన్
ఇపుడు దేశంలో అందరినోటా హాట్ టాపిక్ ఏంటి అంటే ఇండిగో...ఇండిగో. ఈ ఇండిగో విమానాల అర్ధాంతర రద్దు వల్ల దేశంలో గగన రవాణా వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లిపోయింది.
By: Tupaki Political Desk | 9 Dec 2025 12:57 PM ISTఇపుడు దేశంలో అందరినోటా హాట్ టాపిక్ ఏంటి అంటే ఇండిగో...ఇండిగో. ఈ ఇండిగో విమానాల అర్ధాంతర రద్దు వల్ల దేశంలో గగన రవాణా వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఒకపక్క పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు వేడివేడిగా సాగుతుంటే సరిగ్గా ఇదే సమయంలో ఇండిగో సంక్షోభం తలెత్తడంతో ప్రతిపక్షాలు అగ్గిమీద గుగ్గిలం అయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి దిగిపోవాల్సిందిగా డిమాండ్లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఈ సమస్యపై స్పందించారు. ఎన్డీయే పక్ష సమావేశంలో ప్రధాని నిబంధనలు వ్యవస్థను సరిగా గాడిలో పెట్టడానికే గానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదని అన్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాలకు గురయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సూట్ కేసులు మాయమై పోయాయి. ప్రయాణికులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో వారి కష్టాలు అంతాఇంతా కాదు. చివరికి ఓ తండ్రి తన కూతురు నెలసరి శానిటరీ ప్యాడ్ కోసం హెల్ప్ డెస్క్ ను అర్థించడం దేశాన్నే కలచివేసింది. దేశంలోనే అతిపెద్ద విమాన సంస్థ ఇండిగో వందల్లో ఫ్లైట్లను చెప్పాపెట్టకుండా రద్దు చేసేసింది. ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విమానం టికెట్ కొన్న ప్రతి ఒక్కరూ ఇండిగోనూ...కేంద్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ ఈ ఇక్కట్లు ఇప్పట్లో తొలిగేలాలేవు. ఫిబ్రవరి దాకా ఈ పరిస్థితులు చక్కబడవని అంటున్నారు.
ఇంతకూ ఇండిగో ఇలా తయారవడానికి కారణం ఏంటని చర్చ కూడా మరోవైపు మొదలైంది. ఇది సృష్టించిన సంక్షోభమేనని ప్రభుత్వం తన నిబంధనలు వెనక్కి తీసుకునేలా ఇండిగో సంస్థ పన్నిన పన్నాగమని కొందరి వాదన. ప్రజల్ని ఇబ్బందుల్లో నెడితే తప్పకుండా ప్రభుత్వం దిగివస్తుందనే ఈ చర్యలకు పూనుకున్నారని వారంటున్నారు. కేంద్రం కొత్తగా విధించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ ఫేజ్ 2 నిబంధన వల్లే ఇండిగో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీని ప్రకారం పైలట్లకు తగినంత విశ్రాంతి కచ్చితంగా కల్పించాలి. అలా కల్పించాలంటే అదనపు సిబ్బంది ఉండాలి. ఈ విషయంగా ఇండిగో చేతులెత్తేసి ఇలా సంక్షోభంలోకి నెట్టేసిందిన విమర్శలు మిన్నంటుతున్నాయి.
ఇదేదో కొంపమీదికొస్తోందని గ్రహించిన కేంద్రం ఇండిగో సంక్షోభాన్ని సీరియస్ గా తీసుకుంది. దీనిపై విచారణ కమిటీని వేసింది. ఇదే సమయంలో ఈ అవాంతరాలకు ఈ అయిదు కారణాలంటూ ఇండిగో తన వంతు వాదనను ముందు పెట్టింది. సాంకేతిక లోపాలు, షెడ్యూళ్ళ మార్పు, ప్రతికూల వాతావరణం, విమానాలకు పెరిగిన రద్దీ వీటితోపాటు కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ ఫేజ్ 2 నిబంధన, రోస్టరింగ్ నియామకాలు కూడా ప్రధాన కారణమని తెలిపింది. అయితే కేంద్రం ఇప్పటికే ఈ నిబంధనను పక్కన పెట్టింది. కాగా ఒకవైపు ప్రతిపక్షం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రమ్మోహన్ నాయుడిని విమర్శిస్తుంటే...ప్రధాని మాత్రం శభాష్ రామ్మోహన్ అని ప్రశంసించడం...సంక్షోభ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అనడం కొసమెరుపు.
