ఆదివారం బడ్జెట్...బోలెడు స్పెషల్స్
ఇక ఈ ఏడాది మధ్యలో దేశంలోని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరీలలో ఎన్నికలు జరగనున్నాయి.
By: Satya P | 6 Jan 2026 10:15 PM ISTకేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ని ప్రవేశ పెట్టడానికి ముహూర్తం ఖరారు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. సంప్రదాయం ప్రకారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇక ఫిబ్రవరి 1న ఆదివారం పడింది. అయినా కూడా బడ్జెట్ షెడ్యూల్ ని అనుసరించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. నిజానికి బడ్జెట్ ఎపుడూ ఆదివారం ప్రవేశపెట్టలేదు, అయితే 2017 లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ప్రారంభించి ఒక అనవాయితీగా చేశారు దాంతో ఆ రోజు సెలవు అయినా పాత సంప్రదాయం ప్రకారం బడ్జెట్ ని కేంద్ర మంత్రి దేశం ముందుంచనున్నారు.
ఆ రాష్ట్రాలకు వరాలు :
ఇక ఈ ఏడాది మధ్యలో దేశంలోని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరీలలో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో కేంద్ర బడ్జెట్ లో ఆయా రాష్ట్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రాష్ట్రాలలో విజయం బీజేపీకి ముఖ్యం. పశ్చిమ బెంగాల్ అసోం లలో సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. అలాగే తమిళనాడులోనూ ఎన్డీయేకు అధికారం దక్కాలని చూస్తోంది. దాంతో ఈ రాష్ట్రాలకు బడ్జెట్ లో పెద్ద పీట వేయడం గ్యారంటీ అని అంటున్నారు. ఈ రాష్ట్రాలలో ఓటర్లను ఆకట్టుకునే ఎన్నీ కార్యక్రమాలు ఈ బడ్జెట్ లో ఉండబోతున్నాయి అని అంటున్నారు.
మౌలిక సదుపాయాల కోసం :
అంతే కాకుండా ఈసారి కేంద్ర బడ్జెట్ లో దేశంలోని మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయడానికి చూస్తారని అంటున్నారు. ఈ రంగంలో కనుక అభివృద్ధి జరిగితే అది ఆర్థిక అభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది అని అంటున్నారు. అందుకే కేంద్రం ఫోకస్ పెట్టే కీలక రంగంగా మౌలిక సదుపాయాలు ఉండనున్నాయని అంటున్నారు.
కీలక బిల్లులు రెడీ :
ఇక ఈ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగనున్నాయి. దాంతో పాటుగా కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. వన్ నేషన్ వన్ ఎలెక్షన్ అన్న బిల్లుకి ఈ సమావేశాలలో ఒక కదలిక వస్తుందని భావిస్తున్నారు. ఇది బీజేపీ డ్రీం అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్నది బీజేపీ అజెండాలో ఎప్పటి నుంచో ఉంది. దానిని చట్టంగా మార్చి దేశంలో లోక్ సభ అసెంబ్లీలకు ఒకేమారు ఎన్నికలు నిర్వహించేలా చూస్తారు అని అంటున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎవరైనా నెల రోజులకు తక్కువ కాకుండా జైలులో ఉంటే కనుక వారి పదవి ఆటోమేటిక్ గా రద్దు అయ్యే బిల్లుని కూడా ఈసారి పార్లమెంట్ ముందుకు తేవాలని చూస్తున్నారు. విత్తన బిల్లు కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్ ఉంది.
