Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాపై నియంత్రణ.. కొరివితో తల గోక్కున్నట్లేనా?

వివిధ రంగాల నిపుణుల హెచ్చరికలతో ప్రపంచంలోని కొన్ని దేశాలు సోషల్ మీడియాపై విధించిన నియంత్రణ అమలు ఎలా ఉందన్న దానిపై ఒక రిపోర్టు వెలుగు చూసింది.

By:  Garuda Media   |   27 Jun 2026 1:41 PM IST
సోషల్ మీడియాపై నియంత్రణ.. కొరివితో తల గోక్కున్నట్లేనా?
X

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలంటే వంద అడ్డంకులు.. అదే ఊరించే జంక్ తినేందుకు అడ్డదారులు సైతం వెతికేయటం కనిపిస్తుంది. జాతి.. మతం.. దేశంతో సంబంధం లేకుండా ఇలాంటివి అన్నిచోట్ల కనిపిస్తుంటాయి. సోషల్ మీడియా అనే జంక్ ను వాడేందుకు చూపించే మోజు అంతా ఇంతా కాదు. వివిధ రంగాల నిపుణుల హెచ్చరికలతో ప్రపంచంలోని కొన్ని దేశాలు సోషల్ మీడియాపై విధించిన నియంత్రణ అమలు ఎలా ఉందన్న దానిపై ఒక రిపోర్టు వెలుగు చూసింది. అందులో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

సోషల్ మీడియా వేదికల్ని పూర్తిగా బ్యాన్ చేసిన దేశాల్ని పక్కన పెడితే.. నియంత్రణ విధించిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా.. యునైటెడ్ కింగ్ డమ్.. ఇండోనేషియా.. మలేషియా.. ఫ్రాన్స్.. గ్రీస్.. స్పెయిన్ లాంటి దేశాల్లో 15-16 ఏళ్ల వారికి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను వినియోగించేందుకు అనుమతి లేదు. ఇందుకు సంబంధించి కొన్ని దేశాలు కఠిన నిబంధనల్ని అమలు చేస్తుంటే.. మరికొన్ని దేశాల్లో జరిమానాలు భారీగా విధిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ ఉన్న దేశాల్లోని స్థితిగతులు.. ప్రజల తీరు.. వారు వ్యవహరిస్తున్న తీరును తెలియజేసేలా కొన్ని అధ్యయనాలు చేపట్టారు. తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.

రిపోర్టులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ.. వీటి వాడకంపై విధించిన పరిమితులు.. వాటిని పట్టించుకోకుండా చట్టాన్ని గౌరవించకుండా వ్యవహరించే తీరు ఇలాంటి వాళ్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న విషయం వెల్లడైంది. సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు.. కొన్ని కఠిన నిబంధనలు ఉన్నప్పటికి.. గుట్టుచప్పుడు కాకుండా.. తప్పుడు మార్గాల్లో పయనిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్న విషయాన్ని గుర్తించారు. తాజా నివేదిక వెల్లడించిన షాకింగ్ నిజాల్ని చూస్తే..

పదహారేళ్లలోపువారికి సోషల్ మీడియా వినియోగంపై కఠిన ఆంక్షలతో పాటు.. చట్టపరమైన చర్యల్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేస్తున్నా.. గుట్టుచప్పుడు కాకుండా దొంగ పద్దతుల్లో సోషల్ మీడియా అకౌంట్లను యాక్టివ్ చేసుకోవటం గమనార్హం. ఈ కారణంగా ఆస్ట్రేలియా ఆన్ లైన్ భద్రతా నియంత్రణ సంస్థ దర్యాప్తును చేపట్టింది. ఈ సందర్భంగా సదరు సంస్థలు నిబంధనల్ని పక్కాగా పాటించటం లేదని.. నిబంధనల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా వెల్లడించింది.

ఒక అంచనా ప్రకారం లక్షలాది ఖాతాల్ని తొలగించినా.. కొత్త మార్గాల ద్వారా సదరు ఫ్లాట్ ఫాం వద్దకు వెళుతున్న వారి సంఖ్య ఎక్కువనే మాట వినిపిస్తోంది. ఇదే విషయాన్ని తాజా రిపోర్టు స్పష్టం చేస్తోంది. ఆస్ట్రేలియాలో ఆంక్షలు అమల్లోకి వచ్చిన మూడు నెలల తర్వాత కూడా 12-16 ఏళ్ల మద్య వయసున్న 85 శాతం మంది చిన్నారులు సోషల్ మీడియాను ఏదో విధంగా ఫాలో అవుతున్నట్లుగా గుర్తించారు.

సోషల్ మీడియా మీద బ్యాన్.. ఆంక్షలుఉన్న దేశాల్లోని పిల్లలు ఉచిత వీపీఎన్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని.. తమ లొకేషన్ ను వేరే దేశానికి అంటే ఆంక్షలు లేని దేశానికి మార్చేస్తున్నారు. దీంతో వారిపై స్థానిక ప్రభుత్వాల నిఘా.. ఐటీ చట్టాలు పని చేయని విధంగా వారు వ్యవహరిస్తున్నారు. మొత్తంగా అడ్డదారుల్లోకి వెళుతూ.. ప్రభుత్వాల అడ్డగింపును సులువుగా బైపాస్ చేస్తున్నట్లుగా చెప్పాలి. ఇలాంటి వేళ.. నిషేధాలు.. నియంత్రణ లాంటి ఆంక్షల కంటే కూడా.. ఐటీ కంపెనీల మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. సోషల్ మీడియాసంస్థలను నియంత్రించే ప్రభుత్వాలు తాము కొరివితో తల గోక్కున్నట్లుగా పరిస్థితులు ఉంటున్నాయన్న విషయాన్ని గుర్తించి.. మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.