Begin typing your search above and press return to search.

ఉండవల్లి ఇంటికి వైసీపీ నేతల క్యూ...మ్యాటరేంటి ?

ఇక ఉండవల్లి వైఎస్సార్ కి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు. మేధ సంపత్తి కలిగిన నేతగా ఆయనకు అన్ని విధాలుగా సహకరించేవారు.

By:  Satya P   |   20 Aug 2025 11:06 PM IST
ఉండవల్లి ఇంటికి వైసీపీ నేతల క్యూ...మ్యాటరేంటి ?
X

ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ పేరు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి పెద్దగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కాంగ్రెస్ వాదిగా ఉంటూ వచ్చారు. రెండు సార్లు రాజమండ్రి నుంచి ఎంపీగా వరసగా గెలిచారు. వైఎస్సార్ కి అనుంగు సహచరుడిగా మంచి గుర్తింపు పొందారు. చివరి దాకా ఆయనతోనే ఉన్నారు. ఇక ఉమ్మడి ఏపీని మనసారా కోరుకున్నారు. దాని కోసం అలుపెరగని పోరాటం చేశారు. విభజనని వ్యతిరేకిస్తూ దశాబ్దాలుగా తాను పనిచేసిన కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇక గత పదకొండేళ్ళుగా ఆయన రాజకీయాలకు దూరం పాటిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుడిగానే జనం ముందుకు మీడియా ద్వారా వస్తున్నారు.

వైసీపీ నేతల జాతర :

గత నెల రోజులకు పైగా రాజమండ్రి జైలులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. దాంతో ఆయనను పరామర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ నేతలు రాజమండ్రి వస్తున్నారు. అలా వచ్చిన నాయకులు అంతా మాజీ ఎంపీ ఉండవల్లి ఇంటికి క్యూ కడుతున్నారు. దాంతో ఉండవల్లి నివాసం వైసీపీ నేతల రాకతో జాతరగా మారుతోంది. తాజాగా చూస్తే వైసీపీ ఫైర్ బ్రాండ్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనంతపురం వైసీపీ ఇంచార్జి అనంత వెంకట రామిరెడ్డి, కడప జిల్లాకు చెందిన సుగవాసి సుబ్రమణ్యం, రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ తో కలసి ఉండవల్లి ఇంటికి వెళ్ళారు. వీరంతా సుదీర్ఘంగా ఉండవల్లితో చర్చించారు.

వైసీపీలోకి రావాలంటూ :

ఇక ఉండవల్లి వైఎస్సార్ కి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు. మేధ సంపత్తి కలిగిన నేతగా ఆయనకు అన్ని విధాలుగా సహకరించేవారు. అదే సహకారం జగన్ కి అందుతుంది అనుకున్నా ఉండవల్లి మాత్రం రాజకీయాలకే నో చెప్పేశారు ఇపుడు ఆయన ఏడు పదుల వయసు దాటి ఉన్నారు. దాంతో తమకు ప్రత్యక్ష రాజకీయాలు పడవు ఈ వయసులో చేయలేను అంటూ ఒక దండం పెట్టేశారు. గతంలో కూడా ఆయన వైసీపీలో చేరుతారు అన్న చర్చ వచ్చింది. ఇక తాజా భేటీలో కూడా పలువురు సీమ నేతలు ఆయన రావాలని కోరారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

ఉండవల్లి లాంటి వారు కావాలి :

ఉండవల్లి ఏ పాయింట్ మీద మాట్లాడినా ఏపీ మొత్తం ఆయన ప్రసంగాన్ని వింటుంది. పక్కా లాజిక్ తో ఆయన మాట్లాడుతారు. ఆయన ఆధారసహితంగా మాట్లాడి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక జగన్ సీఎం గా ఉండగానే సంక్షేమ పధకాలు భేష్ అని అంటూనే అభివృద్ధి విషయంలో ఉండవల్లి విమర్శలు బలంగా చేసేవారు. అలాగే చంద్రబాబుని అరెస్టు చేసినపుడే జగన్ పెద్ద తప్పు చేశారు ఇది బాబుకు పొలిటికల్ గా టర్నింగ్ పాయింట్ అని కూడా గట్టిగా చెప్పారు. అయితే వైసీపీకి ఉండవల్లి లాంటి వారు కావాలని అంటున్నారు. అందుకే ఆయన వద్ద ఈ ప్రస్తావన తెచ్చారు అని చెబుతున్నారు.

సలహాలు సూచనలు కోసం :

ఒకవేళ ఉండవల్లి వైసీపీలోకి చేరకపోయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన సలహా సూచనలు అయినా ఇస్తే వైసీపీకి ఈ క్లిష్ట సమయంలో ఎంతో ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఆ విధంగా చేయడానికి ఉండవల్లి అంగీకరిస్తారా అన్నది ఒక చర్చ అయితే జగన్ ఉండవల్లి విషయంలో ఏమి అనుకుంటున్నారు. ఆయన సలహా సూచనలు తీసుకుంటారా అన్నది మరో చర్చ. మొత్తం మీద చూస్తే రాజమండ్రికి వచ్చే వైసీపీ నేతలు మిధున్ రెడ్డితో ములాఖత్ తో పాటు ఉండవల్లితోనూ భేటీలు వేయడమే అసలైన రాజకీయం అని అంటున్నారు. చూడాలి మరి ఈ పరిణామాలు ఏ విధంగా దారి తీస్తాయో.