రాజకీయాలకు అందుకే దూరం అన్న ఉండవల్లి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ నేత నుంచి రాజకీయ విశ్లేషకుడిగా మారారు. అది తనకు రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో మాత్రమే అని ఆయన చెబుతున్నారు.
By: Satya P | 7 Jan 2026 7:35 AM ISTమాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ నేత నుంచి రాజకీయ విశ్లేషకుడిగా మారారు. అది తనకు రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో మాత్రమే అని ఆయన చెబుతున్నారు. అంతే కాదు తాను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేది లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ 2004లో తొలిసారి ఎంపీ అయ్యారు, రాజమండ్రి నుంచి కాంగ్రెస్ తరఫున మంచి మెజారిటీతో ఆయన గెలిచారు. 2009లో ఆయన మరోసారి కూడా అదే సీటు నుంచి గెలిచి వచ్చారు. అయితే 2014లో ఉమ్మడి ఏపీ రెండుగా విభజించడంతో తీవ్ర మనస్తాపానికి గురి అయి ఆయన రాజకీయాలకు దూరం పాటించారు. నాటి నుంచి అదే మాట మీద ఆయన నిలబడ్డారు. ఆయనకు కాంగ్రెస్ వైసీపీల నుంచి ఆహ్వానాలు వచ్చాయని అంటారు. అలాగే ఇతర పార్టీలూ పిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉండవల్లి మాత్రం అందరికీ నో చెబుతూనే ఉన్నారు.
కాఫీ విత్ ఉండవల్లి :
ఇదిలా ఉంటే కొత్త ఏడాది విశాఖలో తాజాగా ఉండవల్లి పర్యటించారు. కాఫీ విత్ ఉండవల్లి అని స్థానిక నాయకులు ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఉండవల్లి తన మనసులో భావాలను పంచుకున్నారు. తాను గత పన్నెండేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగా వివరించారు. తాను వర్తమాన రాజకీయాలకు అసలు సరిపోను అని అన్నారు. తన గురించి తెలుసు కాబట్ట్రే నో పాలిటిక్స్ అని దూరం పాటిస్తున్నాను అని అసలు విషయం చెప్పారు.
దిగ్గజాలతో అనుబంధం :
తనకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి దిగ్గజ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. పీవీ రాజకీయ చాతుర్యం ఎన్న తగినది అన్నారు. అలాగే విశాఖ రాజకీయ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఎందరికో రాజకీయ బిక్ష పెట్టారు అని ఢిల్లీలో ఆయన నిరంతరం అందరికీ అందుబాటులో ఉండేవారు అన్నారు.
హిందూత్వం మతం కాదు :
హిందూత్వం అన్నది మతం కాదని ఉండవల్లి చెప్పారు. అది సనాతన ధర్మం అన్నారు, పైగా అది ఎప్పటికీ నిత్య నూతనమని కూడా ఉండవల్లి చెప్పుకొచ్చారు. భగవద్గీతలో అనేక ప్రశ్నకకు జవాబులు లభిస్తాయని ఉండవల్లి అన్నారు. మొత్తానికి చూస్తే ఉండవల్లి అనేక విషయాల మీద తన భావాలను పంచుకున్నారు
