Begin typing your search above and press return to search.

25 కేజీల రైఫిల్, 13000 అడుగుల దూరం... కాల్చి చంపడంలో వరల్డ్ రికార్డ్!

ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   18 Aug 2025 9:04 AM IST
25 కేజీల రైఫిల్,  13000 అడుగుల దూరం... కాల్చి చంపడంలో వరల్డ్  రికార్డ్!
X

ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఆపుతానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సమయంలో ఇటీవల రష్యా అధ్యక్షుడితో అలస్కా వేదికగా భేటీ అయ్యి చర్చించారు. సరిగ్గా ఆ భేటీకి ఒకరోజు ముందు ఉక్రెయిన్ సైనికుడు ఒకరు రష్యా సైనికులను చంపిన విషయంలో వరల్డ్ రికార్డ్ సృష్టించడం గమనార్హం.

అవును... ఉక్రెయిన్‌ స్నైపర్‌ యూనిట్‌ సైనికుడు ఒకరు ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టిన విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు కీవ్‌ పోస్ట్‌ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా సదరు సైనికుడు 13,000 అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్న రష్యా సైనికులను కాల్చి చంపినట్లు పేర్కొంది. ఇంత దూరం నుంచి సక్సెస్ ఫుల్ గా షూట్ చేయడం ప్రపంచ రికార్డు అని తెలిపింది.

ఎలిగేటర్‌ 14.5 ఎంఎం రైఫిల్‌ (బరువు 25 కిలోగ్రాములు) వాడిన సదరు స్నైపర్‌ యూనిట్‌ సైనికుడు.. ఇటీవల మాస్కో దాడులు విపరీతంగా పెంచినట్లు చెబుతోన్న పొక్రొవొస్క్‌ ప్రాంతంలోని ఇద్దరు రష్యన్‌ సైనికులను నేల కూల్చినట్లు సదరు పత్రిక పేర్కొంది. దీనికోసం అతడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్‌ సాయం తీసుకొన్నాడని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన మిలటరీ జర్నలిస్టు యూరి బుట్సోవ్... ఉక్రెయిన్ స్నైపర్ సైనికుడు ఒకరు ఆగస్టు 14వ తేదీన ఈ ఘనత సాధించాడని వెల్లడించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... పుతిన్‌ - ట్రంప్‌ అలాస్కాలో భేటీ కావడానికి ఒక్క రోజు ముందు ఉక్రెయిన్ సైనికుడు ఈ రికార్డు నెలకొల్పడం.

కాగా... గతంలో అత్యధిక దూరంలో లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు కూడా ఉక్రెయిన్‌ స్నైపర్‌ పేరిటే ఉండటం గమనార్హం. అతడు 12,400 అడుగుల దూరంలోని రష్యా సైనికుడిని హతమార్చాడు. ఇప్పుడు ఆ రికార్డ్ చెరిపేసి 13,000 అడుగుల దూరంలో ఉన్న సైనికులను కాల్చి చంపాడు మరో ఉక్రెయిన్ సైనికుడు. మరోవైపు సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ట్రంప్ భేటీ కానున్న సంగతి తెలిసిందే.