ఉక్రెయిన్ ను చావుదెబ్బ తీసిన రష్యా.. వీడియో
ఒడెస్సా ప్రాంతంలోని డనుబె నదిలో మోహరించి ఉన్న ఈ నిఘా నౌకపై రష్యా ఈ దాడిని జరిపింది.
By: A.N.Kumar | 29 Aug 2025 1:00 PM ISTరష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక ఘటన చోటు చేసుకుంది. రష్యా ప్రత్యేక సముద్ర డ్రోన్‌తో చేసిన దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన అతిపెద్ద నౌక సింఫెరోపోల్ పూర్తిగా ధ్వంసమై సముద్రంలో మునిగిపోయింది. ఈ దాడితో ఉక్రెయిన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఒడెస్సా ప్రాంతంలోని డనుబె నదిలో మోహరించి ఉన్న ఈ నిఘా నౌకపై రష్యా ఈ దాడిని జరిపింది. డ్రోన్ల దాడి తీవ్రతకు నౌక తట్టుకోలేక నీటిలో మునిగిపోయిందని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఒక సిబ్బంది మరణించగా, పలువురు గాయపడ్డారు. గల్లంతైన నావికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కూడా వెల్లడించారు.
-ఉక్రెయిన్‌కు అతిపెద్ద నష్టం
2019లో ప్రారంభించి.. 2021లో ఉక్రెయిన్ నౌకాదళంలో చేర్చిన ఈ సింఫెరోపోల్ నౌక.. 2014 తర్వాత కీవ్ మోహరించిన అతిపెద్ద యుద్ధనౌకగా గుర్తింపు పొందింది. ఈ దాడి ఉక్రెయిన్ సైనిక శక్తికి తీవ్ర ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు.
-మాస్కో వరుస దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే బుధవారం రాత్రి కీవ్‌తో సహా పలు నగరాలపై రష్యా భారీ దాడికి పాల్పడింది. మొత్తం 598 డ్రోన్లు, 31 క్షిపణులను ప్రయోగించగా, ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ వాటిలో కొన్నింటిని మాత్రమే అడ్డుకోగలిగింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఈ తరహా భీకర దాడులు యుద్ధం మరింత కాలం కొనసాగుతుందనే సంకేతాలను ఇస్తున్నాయి.
