Begin typing your search above and press return to search.

వరల్డ్ వార్–3 ఫేజ్–1 స్ట్రాట్ అయ్యిందా?

రెండు ప్రపంచ యుద్ధాల చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి, శాంతిని కాపాడుకునేందుకు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు నేడు పరీక్షకు నిలుస్తున్నాయి.

By:  A.N.Kumar   |   9 March 2026 12:10 PM IST
వరల్డ్ వార్–3  ఫేజ్–1 స్ట్రాట్ అయ్యిందా?
X

రెండు ప్రపంచ యుద్ధాల చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి, శాంతిని కాపాడుకునేందుకు దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు నేడు పరీక్షకు నిలుస్తున్నాయి. గ్లోబల్ పవర్స్ మధ్య పెరుగుతున్న ఆర్థిక, భౌగోళిక ఆధిపత్య పోరు... ఇప్పుడు కేవలం ప్రాంతీయ ఘర్షణలకే పరిమితం కాకుండా, ఒక బహుముఖ ప్రపంచ యుద్ధంగా రూపాంతరం చెందుతాయా? ప్రస్తుత ఉద్రిక్తతలు ఒక సుదీర్ఘ పోరాటానికి నాంది పలుకుతున్నాయా? ప్రపంచం మళ్ళీ అగాధంలోకి అడుగుపెడుతోందా? రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నుంచి పశ్చిమాసియా రణరంగం వరకు... అంతర్జాతీయ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చూస్తుంటే మానవాళి 'మూడవ ప్రపంచ యుద్ధం' అనే పెను ప్రమాదానికి అతి సమీపంలో ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అణ్వాయుధాల నీడలో ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు ఒక అనిశ్చిత 'ఫేజ్-1' లోకి ప్రవేశించాయా? అన్న చర్చ సాగుతోంది.

ప్రపంచ రాజకీయాల్లో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు చూసి “వరల్డ్ వార్-3 ప్రారంభమైందా?” అనే ప్రశ్న అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. పశ్చిమాసియా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో పెరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా కొందరు విశ్లేషకులు “వరల్డ్ వార్-3 ఫేజ్-1” మొదలై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ప్రపంచ యుద్ధం ప్రకటించబడలేదు. గతంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలతో పోల్చితే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించడం అవసరం.

– వరల్డ్ వార్-1: 32 దేశాల పాల్గొనడం

1914 నుండి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. ఆస్ట్రియా ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యతో ప్రారంభమైన ఈ యుద్ధం త్వరగా విస్తరించింది. ఈ యుద్ధంలో సుమారు 32 దేశాలు పాల్గొన్నాయి. ప్రధానంగా రెండు కూటములు ఏర్పడ్డాయి.

ఒకవైపు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, తరువాత అమెరికా వంటి దేశాలు “అలైడ్ పవర్స్”గా పోరాడగా, మరోవైపు జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, ఒట్టోమన్ సామ్రాజ్యం వంటి దేశాలు “సెంట్రల్ పవర్స్”గా యుద్ధం చేశాయి. నాలుగేళ్లపాటు సాగిన ఈ యుద్ధంలో సుమారు 1.6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి జర్మనీ ఓటమితో 1918లో యుద్ధం ముగిసింది.

వరల్డ్ వార్-2.. 100కిపైగా దేశాల ప్రభావం

1939 నుంచి 1945 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధం మరింత విస్తృతమైంది. జర్మనీ పోలాండ్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ యుద్ధంలో 100కిపైగా దేశాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొన్నాయి.

అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్ వంటి దేశాలు “అలైడ్ ఫోర్సెస్”గా పోరాడగా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు “యాక్సిస్ పవర్స్”గా యుద్ధం చేశాయి. ఈ యుద్ధంలో సుమారు 7 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. చివరికి 1945లో జర్మనీ, జపాన్ ఓటమితో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.

ప్రస్తుత పరిస్థితులు.. వరల్డ్ వార్-3 ప్రారంభమైందా?

ప్రస్తుతం ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యూరప్‌లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు.. ఆసియా ప్రాంతంలో చైనా-తైవాన్ ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆందోళనలకు కారణమవుతున్నాయి. కొన్ని దేశాలు తమ మిత్రదేశాలకు మద్దతు ప్రకటించడం.. ఆయుధ సహాయం అందించడం వంటివి ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని గుర్తు చేస్తున్నాయి.

అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను “ప్రాంతీయ ఘర్షణలు”గా మాత్రమే చూడాలి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాల మాదిరిగా ఒకేసారి అనేక దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో దిగలేదు. అందువల్ల అధికారికంగా “వరల్డ్ వార్-3” ప్రారంభమైందని చెప్పడానికి ఇంకా పరిస్థితులు దారితీయలేదు.

భవిష్యత్తుపై ఆందోళనలు

అణ్వాయుధాలు ఉన్న ఈ కాలంలో ఒక పెద్ద యుద్ధం ప్రపంచానికి భారీ ప్రమాదం కావచ్చు. అందుకే ఐక్యరాజ్యసమితి సహా అనేక దేశాలు ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచ దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకుంటాయా లేదా ఘర్షణలు మరింత పెరుగుతాయా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.