Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే తొలిసారి.. డ్రోన్‌తో గాయపడిన సైనికుడిని ఎయిర్‌లిఫ్ట్ చేసిన ఉక్రెయిన్

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న పోరాటం రోజురోజుకూ నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రధాన వేదికగా మారుతోంది.

By:  A.N.Kumar   |   20 Oct 2026 10:44 PM IST
ప్రపంచంలోనే తొలిసారి.. డ్రోన్‌తో గాయపడిన సైనికుడిని ఎయిర్‌లిఫ్ట్ చేసిన ఉక్రెయిన్
X

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న పోరాటం రోజురోజుకూ నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రధాన వేదికగా మారుతోంది. ఇప్పటివరకు శత్రు దళాల లక్ష్యాలపై దాడులు చేయడానికి, నిఘా పెట్టడానికి మాత్రమే పరిమితమైన డ్రోన్లు.. ఇప్పుడు ప్రాణాలను కాపాడే ఆపద్బాంధవులుగా మారుతున్నాయి. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఒక సైనికుడిని ఉక్రెయిన్ బలగాలు భారీ డ్రోన్ సాయంతో సురక్షిత ప్రాంతానికి ఎయిర్‌లిఫ్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. సైనిక చరిత్రలోనే ఇటువంటి అత్యవసర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం బహుశా ఇదే తొలిసారి కావడంతో ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గాయపడిన సైనికులను ఆస్పత్రులకు తరలించడం సైన్యానికి అతిపెద్ద సవాలుగా మారింది. యుద్ధ క్షేత్రాల్లో ఎక్కడ చూసినా పేలుడు పదార్థాలు, మందుపాతరలు పరిచి ఉండటంతో రెస్క్యూ వాహనాలు వెళ్లడం అసాధ్యంగా మారింది. మరోవైపు మైదాన ప్రాంతాల్లో స్వల్ప కదలికలు ఉన్నా శత్రువుల డ్రోన్లు సులభంగా పసిగడుతున్నాయి. దీనివల్ల గాయపడిన సైనికులను కాపాడేందుకు వెళ్లే వైద్య బృందాలు , సహాయక సిబ్బంది కూడా దాడులకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పెరిగింది. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించిన ఉక్రెయిన్ సైన్యం, భూమార్గాన్ని విడిచిపెట్టి ఆకాశమార్గాన్ని ఎంచుకుంది.

సాధారణంగా యుద్ధ రంగం నుంచి గాయపడిన వారిని తరలించేందుకు హెలికాప్టర్లు లేదా ప్రత్యేక అంబులెన్సులను వాడతారు. అయితే తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో హెలికాప్టర్లను పంపితే శత్రువులు వాటిని క్షిపణులతో కూల్చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ బలగాలు ఒక భారీ పేలోడ్ మోయగల డ్రోన్‌ను రెస్క్యూ కోసం రంగంలోకి దించాయి. గాయపడిన సైనికుడిని సురక్షితంగా డ్రోన్‌కు అనుసంధానించి.. గగనతలం ద్వారా శత్రువుల కంటపడకుండా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి చేర్చి అత్యవసర వైద్య చికిత్స అందించారు. అయితే ఈ ఆపరేషన్‌లో ఉపయోగించిన డ్రోన్ మోడల్, ప్రయాణించిన దూరం, ఈ ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం వంటి వివరాలను సైన్యం గోప్యంగా ఉంచింది.

ఈ వినూత్న ప్రయోగం ఆధునిక యుద్ధ తంత్రంలో రాబోయే పెద్ద మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. దీనివల్ల రెస్క్యూ సిబ్బంది నేరుగా ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బాధితులను కాపాడవచ్చు. అలాగే 'గోల్డెన్ అవర్' అని పిలిచే క్లిష్ట సమయంలో సైనికుడికి అత్యంత వేగంగా వైద్యం అందే అవకాశం లభిస్తుంది. భవిష్యత్తులో ప్రాణరక్షణతో పాటు అత్యవసర మందులు, రక్తం, ఇతర వైద్య పరికరాలను వేగంగా యుద్ధ క్షేత్రానికి చేరవేయడంలో కూడా ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది.

ఐతే ఈ సాంకేతికత మరింత విస్తరించాలంటే భారీ మానవ బరువును మోసే సామర్థ్యం, బ్యాటరీ రన్‌టైమ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు... శత్రువుల జామింగ్ సాంకేతికతల నుంచి ఈ డ్రోన్లను రక్షించుకోవడం వంటి ప్రధాన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.

ప్రత్యర్థి దళాలపై బాంబుల వర్షం కురిపించడానికే కాకుండా ప్రాణాపాయంలో ఉన్న తమ సైనికుల ప్రాణాలను కాపాడేందుకు కూడా డ్రోన్లను సమర్థంగా వినియోగించవచ్చని ఉక్రెయిన్ నిరూపించింది. సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుతాలు సృష్టించవచ్చని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.