Begin typing your search above and press return to search.

కాలదన్నినోడినే అమెరికా బతిమిలాడాల్సిన దుస్థితి..కాలం కలిసి రావడం అంటే ఇదే!

అంతర్జాతీయ రాజకీయాల్లో పరిస్థితులు, అధికారం, దేశాల మధ్య పరస్పర ఆధారిత సంబంధాలు ఎంత వేగంగా మారుతాయో చెప్పడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా మధ్య మారుతున్న సమీకరణాలే నిదర్శనం.

By:  A.N.Kumar   |   10 March 2026 8:32 PM IST
కాలదన్నినోడినే అమెరికా బతిమిలాడాల్సిన దుస్థితి..కాలం కలిసి రావడం అంటే ఇదే!
X

అంతర్జాతీయ రాజకీయాల్లో పరిస్థితులు, అధికారం, దేశాల మధ్య పరస్పర ఆధారిత సంబంధాలు ఎంత వేగంగా మారుతాయో చెప్పడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా మధ్య మారుతున్న సమీకరణాలే నిదర్శనం. ఒకప్పుడు కేవలం అమెరికా, పాశ్చాత్య దేశాల సహాయం కోసం నిరంతరం అభ్యర్థించే స్థితిలో ఉన్న ఉక్రెయిన్.. నేడు అదే అమెరికాకు ఒక అనివార్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా ఎదగడం గ్లోబల్ జియోపాలిటిక్స్‌లో ఒక అద్భుతమైన మలుపు.

కొద్ది నెలల క్రితం వరకు ఉక్రెయిన్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. రష్యా దాడులతో అల్లాడుతున్న ఉక్రెయిన్ తన మనుగడ కోసం అమెరికా నుంచి ఆయుధాలు, నిధుల కోసం వేడుకోవాల్సిన పరిస్థితి. అమెరికా రాజకీయాల్లో కూడా ఉక్రెయిన్‌కు సహాయంపై తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉండేవి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్.. ఆయన మద్దతుదారులు ఉక్రెయిన్‌కు వెళ్తున్న భారీ సహాయాన్ని బహిరంగంగానే విమర్శించారు. అప్పట్లో జెలెన్‌స్కీని ఉద్దేశించి ఎగతాళి వ్యాఖ్యలు చేసిన వారు కూడా లేకపోలేదు. కానీ పరిస్థితులు చక్రం తిప్పాయి.

సాంకేతిక నైపుణ్యం: యుద్ధం నేర్పిన పాఠం

రష్యాతో సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం కేవలం ధైర్య సాహసాలనే కాకుండా ఆధునిక యుద్ధతంత్రంలో అసాధారణమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ సృష్టించిన కొత్త రక్షణ వ్యూహాలు, ఆటోమేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. క్షేత్రస్థాయిలో రష్యన్ డ్రోన్లను ఎలా కూల్చాలి, వాటిని ఎలా జామ్ చేయాలి అన్న విషయంలో ఉక్రెయిన్ దళాలకు ఇప్పుడున్న అనుభవం మరే ఇతర దేశానికీ లేదు.

అమెరికా అవసరాలు.. జెలెన్‌స్కీ వ్యూహం

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రయోగిస్తున్న అధునాతన డ్రోన్లు అమెరికా సైనిక స్థావరాలకు, ఆ దేశ మిత్రదేశాలకు పెద్ద సవాలుగా పరిణమించాయి. అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నప్పటికీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతున్న 'లో-కాస్ట్, హై-ఎఫెక్టివ్' డ్రోన్ టెక్నాలజీని ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ గడించిన అనుభవం ఇప్పుడు అమెరికాకు అత్యంత ఆవశ్యకమైంది.

దీనితో ఒకప్పుడు అమెరికా నుంచి మిస్సైళ్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవ్వాలని జెలెన్‌స్కీ వేడుకోగా.. ఇప్పుడు అదే అమెరికా తన రక్షణ అవసరాల కోసం ముఖ్యంగా యాంటీ-డ్రోన్ టెక్నాలజీ కోసం జెలెన్‌స్కీ వైపు చూస్తోంది. ఇది నిజంగానే "ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి" అన్న సామెతను గుర్తుచేస్తోంది.

భౌగోళిక రాజకీయాల్లో కొత్త సంకేతాలు

ఈ పరిణామం ప్రపంచ దేశాలకు ఒక బలమైన సంకేతాన్ని పంపుతోంది. కేవలం వైశాల్యం, ఆర్థిక వనరులే దేశం యొక్క శక్తిని నిర్ణయించవు.. యుద్ధరంగంలో వారు ప్రదర్శించే సాంకేతిక నైపుణ్యం.. వ్యూహాత్మక ఆలోచనలు కూడా అంతర్జాతీయ వేదికపై దేశాన్ని శక్తివంతమైన భాగస్వామిగా మారుస్తాయి. ఉక్రెయిన్ ఇప్పుడు కేవలం యుద్ధం చేస్తున్న దేశం మాత్రమే కాదు.. సైనిక సాంకేతికతలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగింది.

రాజకీయం అనేది నిరంతర ప్రవాహం. ఒకప్పుడు సహాయం కోసం అమెరికా తలుపు తట్టిన జెలెన్‌స్కీ ఇప్పుడు అదే అమెరికాకు తన సాంకేతిక పరిజ్ఞానంతో బాసటగా నిలుస్తున్న తీరు.. ప్రపంచ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. కాలం ఎవరికైనా సమానమైన అవకాశాలను ఇస్తుందనడానికి.. పరిస్థితులు ఎంత వేగంగా అనుకూలించగలవో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ.