Begin typing your search above and press return to search.

యూకేలో వీసాలపై కఠిన నిబంధనలు.. ఇంగ్లీష్ ‘పరీక్ష’

దేశంలోకి వలసదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) ప్రభుత్వం వీసా దరఖాస్తుదారులపై కొత్త, కఠిన నిబంధనలను అమలు చేయబోతోంది.

By:  A.N.Kumar   |   15 Oct 2025 12:22 PM IST
యూకేలో వీసాలపై కఠిన నిబంధనలు.. ఇంగ్లీష్ ‘పరీక్ష’
X

దేశంలోకి వలసదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) ప్రభుత్వం వీసా దరఖాస్తుదారులపై కొత్త, కఠిన నిబంధనలను అమలు చేయబోతోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా భారత్‌తో సహా అన్ని దేశాల అభ్యర్థులకు ఇంగ్లీష్ భాషా పరీక్షను తప్పనిసరి చేశారు. దీనితో పాటు, విద్యార్థుల వీసాలు, ఆర్థిక అర్హతలు, కంపెనీలపై పన్నులు వంటి అంశాలలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

*భాషా నైపుణ్యాలకు ప్రాధాన్యత (SELT)

వలస వచ్చిన వారు యూకే సమాజంలో పూర్తిగా కలిసిపోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే, 2026 జనవరి 8 నుండి కొత్త ఇంగ్లీష్ పరీక్ష విధానం అమలులోకి రానుంది. సెక్యూర్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ (SELT). పేరుతో పరీక్షను హోమ్‌ ఆఫీస్‌ ఆమోదించిన సంస్థల ద్వారా మాత్రమే నిర్వహిస్తారు. అభ్యర్థులు మాట్లాడటం, వినడం, చదవడం, రాయడం అనే నాలుగు నైపుణ్యాలలో B2 స్థాయి (సుమారు A-లెవల్‌ లేదా ఇంటర్‌ స్థాయి) పట్టు చూపించాలి. హోమ్‌ సెక్రటరీ షబానా మహ్మూద్ మాట్లాడుతూ, "యూకేకు వచ్చే వారు మా భాష నేర్చుకుని, సమాజంలో భాగం కావాలి. భాష నేర్చుకోకుండా ఉండిపోవడం ఆమోదయోగ్యం కాదు," అని స్పష్టం చేశారు.

* విద్యార్థులకు, గ్రాడ్యుయేట్‌లకు కీలక మార్పులు

యూకేలోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ప్రధాన మార్పులు చేశారు. గ్రాడ్యుయేట్‌ రూట్‌ వీసా కాలం తగ్గించారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం గరిష్ఠంగా ఉండే కాలం 2 ఏళ్ల నుంచి 18 నెలలకు తగ్గించబడింది. పిహెచ్‌డీ విద్యార్థులకు యథావిధిగా 3 సంవత్సరాలు అనుమతి ఉంటుంది. గ్రాడ్యుయేట్‌ వీసా పొందుతున్న బహుళ విద్యార్థులు గ్రాడ్యుయేట్‌ స్థాయి ఉద్యోగాల్లోకి మారడం లేదనే డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోమ్‌ ఆఫీస్‌ మంత్రి మైక్ టాప్‌ తెలిపారు. ఈ మార్పులు యూకే ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

* ఆర్థిక అర్హతల పెంపు

2025-26 విద్యా సంవత్సరానికి విద్యార్థులు చూపించాల్సిన ఆర్థిక అర్హతలు (ఫైనాన్స్‌ రిక్వైర్‌మెంట్‌) కూడా పెరిగాయి. లండన్‌లో ఉండే విద్యార్థులు గతంలో£1,483 చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు £1,529 చెల్లించాలి. యూకే ఇతర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు గతంలో £1,136 చెల్లించగా.. ఈసారి £1,171కు పెంచారు.

*కంపెనీలపై ఇమ్మిగ్రేషన్‌ స్కిల్స్‌ చార్జ్‌ పెంపు

విదేశీ నిపుణులను నియమించుకునే యూకే సంస్థలపై విధించే ఇమ్మిగ్రేషన్‌ స్కిల్స్‌ చార్జ్‌ (ISC) ను ఏకంగా 32% పెంచారు. ఒక్కో ఉద్యోగికి ప్రతి సంవత్సరం £480 (గతంలో £364). పెద్ద సంస్థలు ఒక్కో ఉద్యోగికి ప్రతి సంవత్సరం £1,320 (గతంలో £1,000). ఈ అదనపు నిధులను బ్రిటిష్‌ ఉద్యోగుల శిక్షణ కోసం వినియోగించనున్నట్లు హోమ్‌ ఆఫీస్‌ తెలిపింది.

* ఉన్నత ప్రతిభావంతులకు ప్రత్యేక అవకాశాలు

ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక వీసా మార్గాలను ప్రభుత్వం సులభతరం చేసింది. హై పొటెన్షియల్‌ ఇండివిడ్యువల్‌ (HPI) రూట్‌ గా దీని కింద వీసా పొందేందుకు అర్హత ఉన్న అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సంఖ్యను రెట్టింపు చేయనున్నారు. ఏటా గరిష్ఠంగా 8,000 మందికి ఈ వీసా లభిస్తుంది. ఇన్నోవేటర్‌ ఫౌండర్‌ రూట్‌ లో భాగంగా యూకేలో చదివిన ప్రతిభావంతులు తమ చదువు పూర్తయ్యాక సొంత వ్యాపారం ప్రారంభించేందుకు ఈ మార్గం ద్వారా సులభంగా వీసా మార్పు చేసుకోవచ్చు. వీసా దుర్వినియోగం జరుగుతోందనే ఆరోపణలతో, బోట్స్వానా దేశ పౌరులు కూడా ఇకపై యూకేకు రావాలంటే ముందుగా వీసా తీసుకోవడం తప్పనిసరి చేశారు.

మొత్తంగా, యూకే ప్రభుత్వం తమ వలస విధానాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ, కేవలం భాషా నైపుణ్యాలు, ఆర్థిక సామర్థ్యం, ఉన్నత ప్రతిభ కలిగిన వలసదారులను మాత్రమే స్వాగతించే దిశగా ఈ కీలక మార్పులు చేసింది.