బ్రిటన్ వీసా ఫీజుల్లో మార్పులు.. భారం పడనుందా?
బ్రిటన్ వెళ్లాలనే కల సాకారం చేసుకోవడం ఇకపై మరింత ఖరీదైన వ్యవహారం కానుంది.
By: Madhu Reddy | 20 March 2026 3:17 PM ISTబ్రిటన్ వెళ్లాలనే కల సాకారం చేసుకోవడం ఇకపై మరింత ఖరీదైన వ్యవహారం కానుంది. స్టూడెంట్, విజిటర్ మరియు వర్క్ వీసాలతో సహా అన్ని రకాల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఏప్రిల్ 8, 2026 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త ఛార్జీల వల్ల భారత్ నుండి వెళ్లే విద్యార్థులు, పర్యాటకులపై భారీగా ఆర్థిక భారం పడనుంది. సుమారు 6 నుండి 7 శాతం మేర పెరిగిన ఈ ధరల వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..
ఏప్రిల్ 8 నుండి కొత్త ధరలు:
బ్రిటన్ హోమ్ ఆఫీస్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, వీసా ఫీజుల పెంపు నిర్ణయం ఏప్రిల్ 8 నుండి అమల్లోకి రానుంది. ఈ మార్పు కేవలం పర్యాటకులకు మాత్రమే కాకుండా, సెటిల్మెంట్ వీసాలు మరియు స్పాన్సర్ లైసెన్స్ ఫీజులకు కూడా వర్తిస్తుంది. ఇక గత కొంతకాలంగా పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్ వెళ్లే ప్లాన్‌లో ఉన్నవారు ఈ తేదీ కంటే ముందే అప్లై చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
విద్యార్థులకు తప్పని భారం:
ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లే భారతీయ విద్యార్థులపై ఈ పెంపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 524 పౌండ్లుగా ఉన్న స్టూడెంట్ వీసా రుసుము ఇప్పుడు 558 పౌండ్లకు (సుమారు రూ. 69,814) పెరిగింది. విదేశీ విద్య ఇప్పటికే భారంగా మారిన తరుణంలో, ఈ అదనపు ఫీజులు మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారాయి. ఇక కేవలం వీసా ఫీజులే కాకుండా, బ్రిటన్‌లో జీవన వ్యయం కూడా పెరుగుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
వర్క్ వీసాలు ఇంకా ఖరీదు:
ఉద్యోగాల కోసం వెళ్లే వారిపై కూడా బ్రిటన్ ప్రభుత్వం కనికరం చూపలేదు. మూడేళ్ల స్కిల్డ్ వర్కర్ వీసా ధర 769 పౌండ్ల నుండి 819 పౌండ్లకు (రూ. 1,02,470) పెరిగింది. ఒకవేళ మూడేళ్లకు పైబడి ఉండాలనుకుంటే, ఆ రుసుము ఏకంగా 1618 పౌండ్లకు (రూ. 2,02,437) చేరుకుంది. అలాగే సాధారణ పర్యాటకులు తీసుకునే ఆరు నెలల విజిటర్ వీసా ఛార్జీ కూడా 127 నుండి 135 పౌండ్లకు (రూ. 16,890) పెరిగింది.ఇక ఈ పెరుగుదల వల్ల సామాన్యులు బ్రిటన్ పర్యటనకు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్పాన్సర్ లైసెన్స్ ఛార్జీల సవరణ:
వీసాలతో పాటు కంపెనీలు విదేశీయులను నియమించుకోవడానికి అవసరమైన 'స్పాన్సర్ లైసెన్స్' మరియు ఈటీఏ ఛార్జీలను కూడా ప్రభుత్వం సవరించింది. అంటే బ్రిటన్ కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నా ఇకపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఇది పరోక్షంగా భారతీయులకు లభించే ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. మొత్తానికి బ్రిటన్ వీసా ప్రక్రియ ఇప్పుడు సామాన్యులకు మరింత భారంగా మారిందనే చెప్పాలి.
