ఆధార్ తరహా ఐడీలపై బ్రిటన్ కీలక నిర్ణయం!
బ్రిటన్ పౌరులు, నివాసితులు దేశంలో పనిచేయాలంటే డిజిటల్ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని ప్రధాని కీర్ స్టార్మర్ గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 15 Jan 2026 11:00 AM ISTబ్రిటన్ పౌరులు, నివాసితులు దేశంలో పనిచేయాలంటే డిజిటల్ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని ప్రధాని కీర్ స్టార్మర్ గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అక్రమ వలసలను నియంత్రించడంలో ఈ తరహా ఆలోచన ఎంతో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో.. ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం, చిన్నారుల రక్షణతోపాటు ప్రభుత్వ సర్వీసులను ఈ డిజిటల్ ఐడీ వ్యవస్థ మరింత సులభతరం చేస్తుందని అన్నారు. ఈ సమయంలో యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అవును... దేశంలో వలసలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు డిజిటల్ ఐడీలు దోహదపడతాయని బలంగా నమ్మిన బ్రిటన్ ప్రధాని.. తాజాగా ఈ ప్రణాళికపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో.. దేశంలో ఉద్యోగం పొందడానికి డిజిటల్ ఐడీ కార్డు తప్పనిసరి కాదని పేర్కొంది. ఈ విధానంపై ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం నుంచీ విమర్శలు రావడంతో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్ లో ప్రకటించిన పాలసీలోని కీలక అంశాన్ని పక్కనపెడుతూ.. బ్రిటన్ లో ఉద్యోగం పొందడానికి పౌరులు, నివాసితులు డిజిటల్ ఐడి కార్డు చూపించడం తప్పనిసరి కాదని అధికారులు ధృవీకరించారు. ఈ మేరకు రవాణా కార్యదర్శి హైడీ అలెగ్జాండర్ తెలిపారు. డిజిటల్ ఐడీ కార్డుల కోసం వివరణాత్మక ప్రణాళికలు త్వరలో ప్రారంభించబడే పూర్తి ప్రజా సంప్రదింపుల తర్వాత రూపొందించబడతాయని ప్రభుత్వం తెలిపింది.
వాస్తవానికి బ్రిటన్ ప్రధాని స్టార్మర్.. గత ఏడాదీ సెప్టెంబర్ లో 'మీకు డిజిటల్ ఐడీ లేకపోతే మీరు యునైటెడ్ కింగ్ డమ్ లో పని చేయలేరు' అని ప్రకటించారు. ఇదే సమయంలో ఈ ఐడీ.. ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం, పిల్లల సంరక్షణ, ఇతర ప్రజా సేవలను ప్రజలు పొందడాన్ని సులభతరం చేస్తుందని కూడా ఆయన అన్నారు. ఈ క్రమంలో భారత్ లోని 'ఆధార్' వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు స్టార్మర్ ఆసక్తి చూపారని అంటారు.
ఈ తాజా విధాన మార్పు తర్వాత.. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్ కెవిన్ హోలిన్ రేక్ మాట్లాడుతూ.. లేబర్ పార్టీ ఏకైక స్థిరమైన విధానం తిరోగమనం అని అన్నారు. లిబరల్ డెమొక్రాట్ ప్రతినిధి లిసా స్మార్ట్ మాట్లాడుతూ.. స్టార్మర్ కార్యాలయం వారి అన్ని యు-టర్న్ లను తట్టుకోవడానికి ఈ రేటుతో మోషన్ సిక్ నెస్ టాబ్లెట్ లను బల్క్ ఆర్డర్ చేయాలని ఎద్దేవా చేశారు. వీరు ఈ నిర్ణయాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా... గతంలో ఈ తరహా ఐడీ వ్యవస్థను మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు.. ఉగ్రవాదంపై పోరు, మోసాలను నియంత్రించడానికి ఇదో మార్గమని అప్పట్లో ఆయన చెప్పారు. అయితే.. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడంతోపాటు వారి సమాచారానికి ముప్పు ఏర్పడుతుందని పౌర హక్కుల కార్యకర్తల వాదనతో నాడు ప్రభుత్వం వెనకడుగువేసింది!
