Begin typing your search above and press return to search.

యుకేలో సిక్కు మహిళపై దారుణం.. నిందితుడికి జీవిత ఖైదు

యుకేలో ఒక సిక్కు మహిళపై జరిగిన దారుణ ఘటనకు సంబంధించి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.

By:  A.N.Kumar   |   25 April 2026 11:01 AM IST
యుకేలో సిక్కు మహిళపై దారుణం.. నిందితుడికి జీవిత ఖైదు
X

యుకేలో ఒక సిక్కు మహిళపై జరిగిన దారుణ ఘటనకు సంబంధించి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడైన జాన్ ఆష్బీ (32)కి బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కనీసం 14 సంవత్సరాలు జైలులో గడపాల్సిందిగా ఆదేశించింది. ఈ తీర్పుతో బాధితురాలు కొంతమేర ఉపశమనం పొందుతూ తన జీవితాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లాలనే ఆశను వ్యక్తం చేసింది.

ఈ ఘటన యూకేలోని వాల్సాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు.. నిందితుడు ఒకే బస్సులో ప్రయాణించి దిగిన తర్వాత ఆమెను ముస్లిం మహిళగా భావించిన ఆష్బీ.. ఆమెను గమనిస్తూ ఇంటి వరకు వెంబడించాడు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిన తర్వాత కూడా అతడు వెనుదిరగకుండా ఇంట్లోకి చొరబడి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సమాజాన్ని కలవరపరిచేలా చేసింది.

కోర్టులో బాధితురాలి తరఫున విక్టిమ్ ఇంపాక్ట్ స్టేట్‌మెంట్‌లో ఆమె ఎదుర్కొన్న మానసిక వేదనను వివరించారు. ఘటనకు ముందు తన జీవితం ఎంతో ఆనందంగా సాగుతుందని.. మంచి ఉద్యోగం, భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు ఉన్నాయని ఆమె తెలిపింది. తన భాగస్వామితో కలిసి భారత్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని.. అయితే ఈ దారుణం ఆ కలలన్నింటినీ ఛిన్నాభిన్నం చేసిందని బాధతో వెల్లడించింది.

ఈ ఘటన అనంతరం ఆమె తన ఇంటిని వదిలి మరోచోటికి వెళ్లాల్సి వచ్చింది. తీవ్రమైన మానసిక ఆవేదన కారణంగా ఉద్యోగాన్ని కూడా కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే కోర్టు తీర్పు అనంతరం తనలో ఒక కొత్త ధైర్యం పుట్టిందని ఆమె చెప్పింది.

“ఇప్పటి నుంచి ఈ సంఘటన నా జీవితాన్ని నియంత్రించనివ్వను. నన్ను బాధించిన వ్యక్తిని ఎదుర్కొని.. అతని కళ్లలోకి చూసి నిలబడాలనుకున్నాను. అతడు తన తప్పును అంగీకరించినప్పుడు నాకు ఒక భావోద్వేగ క్షణం వచ్చింది. ఇక నేను బంధించబడిన భావనలో లేను. నా భాగస్వామితో నా భవిష్యత్తును మళ్లీ నిర్మించుకోవాలని ఆశిస్తున్నాను ” అని ఆమె ధైర్యంగా పేర్కొంది.

ఈ కేసు సమయంలో మొదట అన్ని ఆరోపణలను తిరస్కరించిన ఆష్బీ, తరువాత తన తప్పును ఒప్పుకున్నాడు. అత్యాచారం.. ఉద్దేశపూర్వకంగా గొంతు నులిమివేయడం, దోపిడీ, మతపరమైన ద్వేషంతో దాడి వంటి పలు నేరాలను అతడు అంగీకరించాడు. బాధితురాలి నగలు, మొబైల్ ఫోన్ కూడా దోచుకున్నట్లు వెల్లడైంది.

సేవా సంస్థలకు చెందిన సుఖ్‌విందర్ కౌర్ మాట్లాడుతూ ఈ ఘటన ఒక వ్యక్తిని మాత్రమే కాదు.. మొత్తం సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని తెలిపారు. మహిళల భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ఈ తీర్పు ద్వారా బాధితురాలికి న్యాయం జరిగినప్పటికీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం స్పష్టమవుతోంది.