బ్రిటన్ విడిపోతే భారత్ కు ఎందుకు సమస్య?
ఈ పరిణామాలు భారత్-యూకేల నడుమ కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
By: A.N.Kumar | 17 Sept 2026 12:00 AM ISTబ్రెగ్జిట్ ఉపసంహరణ తర్వాత తీవ్ర రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో ఇప్పుడు విభజన గాలులు వీస్తున్నాయి. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌ల కలయికగా ఉన్న ఈ యూనియన్‌లో ప్రాంతీయ స్వయంప్రతిపత్తి పోరాటం తీవ్రరూపం దాలుస్తోంది. ఇటీవల వేల్స్ రాజధాని కార్డిఫ్‌లో స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్లు నిర్వహించిన ఉమ్మడి సమావేశం "వెస్ట్‌మినిస్టర్ కాలం చెల్లింది" అనే బలమైన సంకేతాన్ని ఇచ్చింది. ఈ పరిణామాలు భారత్-యూకేల నడుమ కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సెప్టెంబర్ 14న వేల్స్ రాజధాని కార్డిఫ్‌లో జరిగిన సమావేశంలో స్కాటిష్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ, వేల్స్ ఫస్ట్ మినిస్టర్ రున్ ఆప్ ఐయోర్త్‌వెర్త్, నార్తర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్ మిషెల్ ఓ నీల్ సమావేశమయ్యారు. తమ ప్రాంతాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు ఉండాలని కోరుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా “వెస్ట్‌మినిస్టర్ సమయం ముగిసే దశకు చేరుకుంది” అనే సందేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే దీనిని బ్రిటన్ విడిపోవడానికి తీసుకున్న నిర్ణయంగా చూడటం మాత్రం తొందరపాటు అవుతుంది. ప్రస్తుతం ఈ మూడు ప్రాంతాలూ యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే కొనసాగుతున్నాయి.
స్కాట్లాండ్.. మళ్లీ స్వాతంత్ర్య చర్చ ఎందుకు?
బ్రిటన్ యూనియన్‌కు సంబంధించిన చర్చలో స్కాట్లాండ్‌ది అత్యంత కీలకమైన అంశం. 2014లో స్కాట్లాండ్‌లో జరిగిన స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణలో 55.3 శాతం మంది యూకేలోనే కొనసాగాలని అంటే.. 44.7 శాతం మంది స్వాతంత్ర్యానికి మద్దతు ఇచ్చారు. 84.6 శాతం పోలింగ్ నమోదైన ఆ ఓటింగ్ తర్వాత ఈ అంశం కొంతకాలం పక్కకు వెళ్లింది. కానీ 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం ఫలితాలు పరిస్థితిని మార్చాయి. స్కాట్లాండ్‌లో 62 శాతం మంది యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడానికి ఓటు వేశారు. అయినప్పటికీ మొత్తం యూకే ఫలితం ఆధారంగా బ్రిటన్ ఈయూలో నుంచి బయటకు వచ్చింది. ఇదే అంశాన్ని స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్.పీ) ప్రధానంగా ప్రస్తావిస్తోంది. 2014లో ప్రజలు యూకేలో ఉండేందుకు ఓటు వేసినప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయని పార్టీ వాదిస్తోంది. అయితే మరో రిఫరెండం నిర్వహించడం అంత సులభం కాదు. 2022లో యూకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వెస్ట్‌మినిస్టర్ అనుమతి లేకుండా స్కాటిష్ పార్లమెంట్ స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణకు చట్టం చేయలేదని స్పష్టం చేసింది.
వేల్స్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు
వేల్స్ విషయంలో పరిస్థితి స్కాట్లాండ్‌కు భిన్నంగా ఉంది. అక్కడ స్వాతంత్ర్యానికి ఇప్పటికీ మెజారిటీ మద్దతు కనిపించడం లేదు. అయితే 2026 ఎన్నికల తర్వాత రాజకీయ చర్చలో మార్పు వచ్చింది. ప్లెయిడ్ సిమ్రూ పార్టీ వేల్స్ పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి చెందిన రున్ ఆప్ ఐయోర్త్‌వెర్త్ ఫస్ట్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రస్తుత పదవీకాలం 2030 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ కాలంలో స్వాతంత్ర్య రిఫరెండం నిర్వహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వేల్స్ స్వాతంత్ర్యానికి 32 శాతం మద్దతు మాత్రమే నమోదైంది. అంటే వేల్స్‌లో స్వాతంత్ర్య చర్చ బలపడుతున్నప్పటికీ.. అది వెంటనే విడిపోవాలనే స్థాయికి చేరలేదనే చెప్పాలి.
నార్తర్న్ ఐర్లాండ్‌లో మాత్రం మరో మార్గం
నార్తర్న్ ఐర్లాండ్ పరిస్థితి మిగతా రెండు ప్రాంతాల కంటే భిన్నమైనది. అక్కడ బ్రిటన్ నుంచి విడిపోయి ఐర్లాండ్ రిపబ్లిక్‌తో కలిసే అవకాశం గుడ్ ఫ్రైడే ఒప్పందంలోనే ఉంది. నార్తర్న్ ఐర్లాండ్ ప్రజలు ఐర్లాండ్‌తో పునరేకీకరణకు మెజారిటీగా ఓటు వేసే అవకాశం ఉందని బ్రిటిష్ ప్రభుత్వం భావిస్తే ‘బోర్డర్ పోల్’ నిర్వహించవచ్చు. ప్రస్తుతం ఐక్య ఐర్లాండ్‌కు మద్దతు సుమారు 36 శాతం మద్దతు ఉన్నట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి. అంటే రిఫరెండం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పడానికి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారం లేదు. అయితే సిన్ ఫెయిన్ మాత్రం సుమారు 2030 నాటికి బోర్డర్ పోల్ నిర్వహించాలని ప్రచారం చేస్తోంది.
ట్రంప్ వ్యాఖ్యలు ఎందుకు చర్చకు వచ్చాయి?
ఈ పరిణామాలకు అంతర్జాతీయ కోణాన్ని జోడించిన అంశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐర్లాండ్ లో పర్యటించిన చేసిన వ్యాఖ్యలే చిచ్చుపెట్టాయి. ఐర్లాండ్ పర్యటన సందర్భంగా ట్రంప్.. ఐర్లాండ్ ఐక్యంగా మారితే తాను “సంతోషిస్తాను” అనే భావన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సిన్ ఫెయిన్ వంటి ఐక్య ఐర్లాండ్‌కు మద్దతు ఇచ్చే వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ప్రత్యక్ష రాజ్యాంగపరమైన ప్రభావం లేదు. నార్తర్న్ ఐర్లాండ్‌లో బోర్డర్ పోల్‌ను పిలిచే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ప్రస్తుతం అలాంటి ఓటింగ్‌కు అవసరమైన పరిస్థితులు ఏర్పడలేదనే అభిప్రాయంలో ఉంది.
మరి భారత్ ఎందుకు ఆందోళన చెందాలి?
ఇక్కడే ఈ బ్రిటిష్ రాజకీయ పరిణామానికి భారతదేశంతో సంబంధం ఏర్పడుతోంది. భారత్-బ్రిటన్ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈటీఏ) జూలై 15, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో దాదాపు 99 శాతం టారిఫ్ లైన్లకు ప్రాధాన్య ప్రవేశం కల్పించేలా ఏర్పాట్లు జరిగాయి. 2025లో భారత్-యూకే ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 48 బిలియన్ పౌండ్లకు చేరింది. ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత ఏడాదికి దాదాపు 25.5 బిలియన్ పౌండ్ల మేర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే అవకాశం ఉందని బ్రిటన్ అంచనా వేసింది. అందుకే బ్రిటన్‌లో భవిష్యత్ రాజ్యాంగ మార్పులు భారత వ్యాపార వర్గాలకు కూడా ప్రాధాన్యం కలిగిస్తాయి.
స్కాట్లాండ్ విడిపోతే భారత్-బ్రిటన్ అగ్రిమెంట్ పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం సీఈటీఏ యునైటెడ్ కింగ్‌డమ్‌తో చేసుకున్న ఒప్పందం. యూకే ఒకే దేశంగా ఉన్నంత వరకు భారత కంపెనీలకు పెద్దగా సమస్య ఉండదు. కానీ భవిష్యత్తులో స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా మారితే పరిస్థితి మారవచ్చు. అప్పుడు భారత్-యూకే వాణిజ్య ఒప్పందం స్కాట్లాండ్‌కు యథాతథంగా వర్తిస్తుందా?
స్కాట్లాండ్‌కు భారత్‌తో ప్రత్యేక వాణిజ్య ఒప్పందం అవసరమవుతుందా? దిగుమతులు, ఎగుమతులపై కొత్త టారిఫ్ నిబంధనలు వస్తాయా? ‘రూల్స్ ఆఫ్ ఆరిజిన్’లో మార్పులు వస్తాయా? భారత కంపెనీలకు కొత్త కస్టమ్స్, రెగ్యులేటరీ నిబంధనలు ఏర్పడతాయా? ఇవన్నీ ఇప్పుడే తలెత్తిన సమస్యలు కావు. కానీ బ్రిటన్ రాజ్యాంగ నిర్మాణంలో వాస్తవ మార్పు జరిగితే చర్చించాల్సిన అంశాలుగా మారే అవకాశం ఉంది.
నార్తర్న్ ఐర్లాండ్ విషయంలో మరింత క్లిష్టత
నార్తర్న్ ఐర్లాండ్ భవిష్యత్తులో ఐర్లాండ్ రిపబ్లిక్‌తో కలిసే పరిస్థితి ఏర్పడితే భారత వ్యాపారాలకు మరో రకమైన మార్పు ఎదురవుతుంది. ఎందుకంటే ఐర్లాండ్ యూరోపియన్ యూనియన్‌లో భాగం. నార్తర్న్ ఐర్లాండ్ కూడా ఆ వ్యవస్థలోకి వెళితే అక్కడి వాణిజ్య, కస్టమ్స్, నియంత్రణ వ్యవస్థలు ప్రస్తుతం ఉన్న యూకే వ్యవస్థకు భిన్నంగా మారవచ్చు. అంటే ప్రస్తుతం ఒకే యూకే మార్కెట్‌గా కనిపిస్తున్న ప్రాంతంలో భవిష్యత్తులో వేర్వేరు వాణిజ్య నియమాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇప్పుడే బ్రిటన్ విడిపోతుందా?
ప్రస్తుతం యూకే ఇప్పటికిప్పుడు విడిపోయేలా పరిస్థితులు లేవు. స్కాట్లాండ్‌లో మరో స్వాతంత్ర్య రిఫరెండం కూడా జరగలేదు. వేల్స్‌లో స్వాతంత్ర్యానికి మెజారిటీ మద్దతు కనిపించడం లేదు. నార్తర్న్ ఐర్లాండ్‌లోనూ ఐర్లాండ్‌తో పునరేకీకరణకు అవసరమైన రాజకీయ పరిస్థితి ఏర్పడిందని బ్రిటిష్ ప్రభుత్వం భావించడం లేదు. అందువల్ల సెప్టెంబర్ 14న కార్డిఫ్‌లో జరిగిన సమావేశాన్ని “యూకే విడిపోవడం ప్రారంభమైంది” అని చెప్పడం కంటే.. బ్రిటన్ యూనియన్ భవిష్యత్తుపై ప్రాంతీయ జాతీయవాద శక్తులు కలిసి ఒత్తిడి పెంచుతున్న పరిణామంగా చూడటం సరైనది.
భారత్‌కు అసలు సందేశం ఇదే..
బ్రిటన్ రాజకీయంగా ఇప్పటికైతే ఒకటిగానే ఉంది. కానీ ఆ దేశ భౌగోళిక, రాజ్యాంగ నిర్మాణంలో భవిష్యత్తులో మార్పులు వస్తే దాని ప్రభావం వాణిజ్యంపైనా పడవచ్చు. ముఖ్యంగా కొత్తగా అమల్లోకి వచ్చిన భారత్-యూకే సీఈటీఏ నేపథ్యంలో స్కాట్లాండ్ లేదా నార్తర్న్ ఐర్లాండ్ భవిష్యత్‌పై జరిగే ప్రతి కీలక పరిణామాన్ని భారత వ్యాపార రంగం గమనించాల్సి ఉంటుంది. అందుకే ఇది కేవలం బ్రిటన్ అంతర్గత రాజకీయ కథ కాదు. బ్రిటన్‌లో యూనియన్ భవిష్యత్తుపై మొదలైన చర్చ.. రేపటి రోజుల్లో భారత్-యూకే వాణిజ్య సంబంధాలపై కూడా ప్రశ్నలను లేవనెత్తే అవకాశం ఉన్న అంశం.
