Begin typing your search above and press return to search.

బ్రిటీష్ రాజకీయాల్లో ‘ఇండియా’ మోడల్.. అట్లుంటదీ మనోతోని..

భారతదేశం రూపొందించిన ఆధార్ మోడల్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రేరణగా మారింది. తాజాగా బ్రిటన్ రాజకీయాల్లోనూ అదే మోడల్ చర్చనీయాంశమైంది.

By:  A.N.Kumar   |   10 Oct 2025 1:27 PM IST
బ్రిటీష్ రాజకీయాల్లో ‘ఇండియా’ మోడల్.. అట్లుంటదీ మనోతోని..
X

భారతదేశం రూపొందించిన ఆధార్ మోడల్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ప్రేరణగా మారింది. తాజాగా బ్రిటన్ రాజకీయాల్లోనూ అదే మోడల్ చర్చనీయాంశమైంది. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన దేశంలో డిజిటల్ ఐడీ వ్యవస్థను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఇటీవల భారత్ పర్యటన సందర్భంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనితో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రత్యేక ఆసక్తికరంగా మారింది.

* భారత ఆధార్ మోడల్‌కు ప్రేరణగా యూకే

భారతదేశంలో ఆధార్ వ్యవస్థ ద్వారా ప్రతీ పౌరుడి గుర్తింపు ఒక్క నంబర్ ద్వారా సాధ్యమైంది. ఈ సిస్టమ్‌ వల్ల ప్రజా సేవలు, సబ్సిడీలు, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలు అన్నీ మరింత సులభతరం అయ్యాయి. ఈ మోడల్‌ను స్టడీ చేసిన స్టార్మర్, “ఇండియాలో ఇది హిట్ అయింది కాబట్టి, బ్రిటన్‌కూ ఇది ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.

* డిజిటల్ ఐడీ కార్డులపై సీరియస్ ప్లాన్

స్టార్మర్ ప్రభుత్వం ప్రతీ పౌరుడికి డిజిటల్ ఐడీ కార్డు తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈ కార్డు లేకుండా ఎవరూ పని చేయలేరని ఆయన ఇప్పటికే ప్రకటించారు. దేశంలో అక్రమంగా పనిచేసేవారిని అరికట్టడమే కాకుండా, అండర్‌గ్రౌండ్ ఎకానమీని కంట్రోల్ చేయడంలో ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా హెల్త్‌కేర్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలను సులభంగా అందించడంలో ఇది కీలకమని చెప్పారు.

* పౌర హక్కుల సంఘాల వ్యతిరేకత

అయితే బ్రిటన్‌లో ఈ ఆలోచనపై భారీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ పౌరులకు తప్పనిసరి ఐడీ కార్డులు లేవు. ఇప్పుడు వాటిని మళ్లీ తీసుకురావడం వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నారు. పౌర హక్కుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఇది ప్రైవసీకి ముప్పు అని తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

గతంలో మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా బయోమెట్రిక్ ఐడీ కార్డులు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ ప్రజల వ్యతిరేకతతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే స్టార్మర్ మాత్రం ఈసారి తన ప్లాన్ తప్పక సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు.

* బయోమెట్రిక్ డేటా లేకుండానే ప్లాన్

ప్రస్తుతానికి యూకే ప్రభుత్వం బయోమెట్రిక్ వివరాలు (వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు) వాడే ఆలోచనలో లేదని అధికార ప్రతినిధులు తెలిపారు. అంటే ఆధార్ లాంటి పూర్తి బయోమెట్రిక్ సిస్టమ్ కాకుండా, సాధారణ డిజిటల్ ఐడీ కార్డు రూపంలో వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నారు.

* “ఇండియా మోడల్” విజయాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం

యూరోప్‌తో పోలిస్తే బ్రిటన్‌లో వ్యక్తిగత గోప్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అయినా కూడా ప్రస్తుత కాలంలో ప్రతి రంగంలో ఐడీ అవసరం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ ఐడీ అనేది సౌలభ్యాన్ని, సమర్థతను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశం చూపించిన మార్గంలో యూకే అడుగులు వేస్తోంది. అయితే స్టార్మర్‌ ఆధార్‌ తరహా ప్లాన్‌ తన దేశ ప్రజల ఆమోదం పొందుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.