ఆ పని చేయకపోతే 6 నెలల్లో ప్రాణనష్టం తప్పదు.. రంగం భవిష్యవాణి హెచ్చరిక
అయితే ఈసారి భవిష్యవాణిలో ఆమె పలికిన మాటలు.. జారీ చేసిన హెచ్చరికలు భక్తులను, ఆలయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.
By: A.N.Kumar | 3 Aug 2026 1:13 PM ISTహైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన.. విశిష్టమైన ‘రంగం’ కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత ఘనంగా ముగిసింది. సంప్రదాయం ప్రకారం పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. అయితే ఈసారి భవిష్యవాణిలో ఆమె పలికిన మాటలు.. జారీ చేసిన హెచ్చరికలు భక్తులను, ఆలయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ఈసారి తాను సంతోషంగా రాలేదని, తీవ్ర క్రోధంతో వచ్చానని స్వర్ణలత వ్యాఖ్యానించారు. తాను గతంలో కోరిన విగ్రహ ప్రతిష్ఠను ఇప్పటికీ పూర్తి చేయకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. దోసెడంత ఇస్తున్నా తనకు గోరంత పని కూడా చేయడం లేదని మండిపడ్డారు. ఎవరు అడ్డొచ్చినా సరే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిపించుకుని తీరుతానని స్పష్టం చేస్తూ రాబోయే ఆరు నెలల కాలంలోగా విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కాకపోతే వాడవాడలా తీవ్ర ప్రాణనష్టం సంభవించే పరిస్థితులు ఎదురవుతాయని స్పష్టమైన హెచ్చరిక చేశారు. అమ్మవారి మాటను ఆచరించి ప్రతిష్ఠ పూర్తి చేస్తే ప్రజల కోరికలు నెరవేర్చి అందరినీ కాపాడుతానని పేర్కొన్నారు.
దీంతో పాటు ఈ ఏడాది రాష్ట్రంలో వాతావరణం, ప్రజల జీవనంపై కూడా భవిష్యవాణిలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈసారి రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని.. భారీ వర్షాల వల్ల వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. కొన్నిచోట్ల ఈ వరదల కారణంగా ప్రాణనష్టం జరిగే ప్రమాదం కూడా ఉందని, అలాగే అగ్నిప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు, అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో రోజురోజుకూ మానవ విలువలు తగ్గిపోతున్నాయని.. వావివరసలు లేకుండా ప్రవర్తించే దుస్థితి కనిపిస్తోందని భవిష్యవాణిలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రంగం కార్యక్రమం ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భవిష్యవాణి ద్వారా వెల్లడైందని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచే ఈ బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని.. భక్తుల రద్దీని తగిన విధంగా నిర్వహించామని తెలిపారు. జోగినీలు తమకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్‌లో వారికి ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేసే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. అమ్మవారికి సేవలు అందించే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని చెప్పారు.
మరోవైపు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 200 ఏళ్లకు పైగా గొప్ప చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించారని తెలిపారు. వేలాది మంది మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారని.. రంగం కార్యక్రమంతో లష్కర్ బోనాలు దిగ్విజయంగా ముగిశాయని పేర్కొన్నారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని అన్నారు.
