Begin typing your search above and press return to search.

15 ఏళ్లలో 38 మంది బలి.. నరమాంసం తిన్న సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఉగాండా చరిత్రలోనే అత్యంత క్రూరుడైన, భయంకరమైన నరరూప రాక్షసుడి లీలలు వెలుగులోకి వచ్చాయి.

By:  A.N.Kumar   |   27 Oct 2026 7:30 PM IST
15 ఏళ్లలో 38 మంది బలి.. నరమాంసం తిన్న సీరియల్ కిల్లర్ అరెస్ట్
X

ఉగాండా చరిత్రలోనే అత్యంత క్రూరుడైన, భయంకరమైన నరరూప రాక్షసుడి లీలలు వెలుగులోకి వచ్చాయి. గత 15 ఏళ్లుగా దేశాన్ని అంధకారంలోకి నెట్టి.. 38 మందికి పైగా అమాయకులను పొట్టనబెట్టుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీరియల్ కిల్లర్ ముజురిజి మోజెస్ ఎట్టకేలకు భద్రతా దళాల చిక్కాడు. రాత్రి వేళల్లో నిశ్శబ్దాన్ని ఆసరాగా చేసుకుని ఇళ్లలోకి చొరబడటం.. గొడ్డళ్లు.. కత్తులతో దారుణంగా నరికి చంపడం.. ఆపై నరమాంస భక్షణకు పాల్పడటం వంటి సంచలన నిజాలు బయటకు రావడంతో ఇటు ప్రజలు, అటు అధికారులు షాక్‌కు గురవుతున్నారు.

15 ఏళ్ల రక్తాక్షరాల ప్రయాణం

2010 నుంచి 2025 వరకు ఉగాండాలోని మసాకా, ఇబాండా, కజో ప్రాంతాల్లో జరిగిన అనేక అదృశ్యాలు, మిస్టరీ హత్యల వెనుక మోజెస్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కేవలం దాడులే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రేమ పేరుతో బాధితులను నమ్మించి వలలో వేసుకుని మరీ అత్యంత కిరాతకంగా అంతమొందించాడని కథనాలు పేర్కొంటున్నాయి. గతంలో పెంతెకోస్టల్ పాస్టర్ స్టీవెన్ ముగాంబే ఇంట్లో జరిగిన భయంకరమైన మారణకాండలోనూ మోజెస్ ప్రధాన సూత్రధారి అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

రాత్రి వేళల్లో మృత్యు క్రీడ

ఈ కిల్లర్ పనిచేసే శైలి అత్యంత వికృతంగా ఉండేది. నిద్రిస్తున్న కుటుంబాలపై గొడ్డళ్లతో విరుచుకుపడటం.. ఆధారాలు దొరకకుండా శవాలను చిధ్రం చేయడం అతడి నైజం. గతంలో కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడినప్పటికీ వివాదాస్పద పరిస్థితులలో బయటపడి మళ్లీ తన మృత్యుక్రీడను కొనసాగించాడనే వార్తలు వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతున్నాయి.

రహస్య నివాసంలో లభించిన క్లూస్

మోజెస్ అరెస్టు అనంతరం అతడి నివాసంలో జరిపిన సోదాల్లో లభించిన ఆధారాలు దర్యాప్తు అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసాయి. ఫోరెన్సిక్ బృందాలు అక్కడ లభించిన భౌతిక ఆధారాలను స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు తరలించాయి. గత 15 ఏళ్లలో నమోదైన మిస్సింగ్ కేసులు.. పరిష్కారం కాని క్రూరమైన హత్యల రికార్డులను అధికారులు మళ్లీ తోడుతున్నారు.

చట్టం ముందుకు 'నరరూప రాక్షసుడు'

ఈ దారుణ ఘటనపై ఉగాండా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ జనరల్ ముహూజీ కైనెరుగాబా స్పందిస్తూ.. మోజెస్‌పై బహిరంగ విచారణ జరిపి కఠినమైన మరణశిక్ష పడేలా చేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే 38 హత్యల ఆరోపణలు, నరమాంస భక్షణ అంశాలు శాస్త్రీయంగా.. న్యాయస్థానంలో నిరూపితం కావాల్సి ఉంది. 15 ఏళ్ల చిక్కుముడి వీడటంతో దర్యాప్తు సంస్థలకు ఇది ఒక పెద్ద సవాలుగా.. ఉగాండా ప్రజలకు తీవ్ర కలకలంగా మారింది.