డీఎన్ ఏ పరీక్షల కోసం ఎగబడుతోన్న ఉగాండ పురుషులు
ప్రాశ్చాత్య దేశాలకు సంబంధించిన పలు విషయాలు తరచూ మన వార్తల్లో చోటు దక్కించుకుంటాయి.
By: Garuda Media | 24 Nov 2025 10:02 AM ISTప్రాశ్చాత్య దేశాలకు సంబంధించిన పలు విషయాలు తరచూ మన వార్తల్లో చోటు దక్కించుకుంటాయి. ఎంతో పెద్ద విషయం అయితే తప్పించి ఆఫ్రికా దేశాలకు చెందిన వార్తలు మన మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ కనిపించవు. అయితే.. ఇప్పుడో అంశం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలోని మగాళ్లకు ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడింది. అనుమాన భూతం వారిని ఆవహించింది. దీంతో.. ఇప్పుడా దేశంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది.
చాలాకాలం పాటు అంతర్యుద్ధంతో సతమతమైన ఉగాండాలో ఇటీవల వెలుగు చూసిన ఉదంతం.. మిగిలిన పురుషుల్లో కొత్త అభద్రతా భావాన్ని తీసుకొచ్చింది. చివరకు మతగురువులు సైతం పెద్ద ఎత్తున రంగంలోకి దిగి.. పురుషుల్ని సముదాయిస్తున్నా.. వారు వినే పరిస్థితి కనిపించట్లేదు. తమ సంతానం తమకే పుట్టారా? లేదా? అన్న సందేహంతో డీఎన్ ఏ పరీక్షలు ఇటీవల కాలంలో పెరిగాయి. దీనికి తగ్గట్లు డీఎన్ఏ పరీక్షలకువెల్లిన పురుషల్లో 98 శాతానికి పైగా వారి పిల్లలు వారికి పుట్టలేదన్న చేదునిజం బయటకు రావటంతో.. మరింత మంది పురుషులు ఇప్పుడు కొత్త అభద్రతాభావానికి గురై.. వారు సైతం డీఎన్ఏ సెంటర్లకు క్యూ కడుతున్న పరిస్థితి.
చివరకు పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. మీరు స్ట్రాంగ్ అనుకుంటే తప్పించి డీఎన్ఏ పరీక్షల జోలికి వెళ్లకండని సూచన చేస్తున్నారు. కొత్తగా తెర మీదకు వచ్చిన డీఎన్ఏ పరీక్షలతో కుటుంబాల్లో గొడవలు అతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందని చెబుతున్నారు. అయితే.. ఈ రచ్చ మొత్తం ఎలా మొదలైందన్న విషయంలోకి వెళితే.. ఉగాండా రాజధాని కంపాలలోని ఒక సంపన్న విద్యావేత్తకు ముగ్గురు పిల్లలు. అయితే.. ముగ్గురిలో ఒకరు తన కారణంగా పుట్టలేదన్న విషయాన్ని గుర్తించారు. కోర్టు కేసులో భాగంగా బయటకు వచ్చిన ఈ అంశం అక్కడి మీడియా పెద్ద ఎత్తున కవర్ చేసింది.
దీంతో.. చాలామందికి తమ సంతానం మీద కొత్త సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆఫ్రికా సంప్రదాయం ప్రకారం మహిళ తన భర్తకు సంతానాన్ని కని ఇవ్వకపోతే విడాకులు ఇవ్వటం లేదంటే ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేస్తుంటారు. చాలా కేసుల్లో పురుషుల్లో సంతాన సమస్యలున్నా.. శిక్ష మాత్రం మహిళలకు పడుతుండటంతో.. చాలామంది మహిళలు ఇతరులతో కలిసి పిల్లల్ని కంటున్నారు. అది అటుతిరిగి ఇటు తిరిగి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ దేశంలో డీఎన్ఏ పరీక్షా కేంద్రాలకు వెళుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది.
దీంతో ఉగాండా మొత్తం డీఎన్ఏ పరీక్షా కేంద్రాలు వెలిశాయి. చివరకు క్యాబ్ లలోనూ దీనికి సంబందించిన ప్రకటనలతో నిండిపోతున్నాయి. పట్టణాల్లోని పురుషులు ఇప్పుడు డీఎన్ఏ పరీక్షలకు వెళ్లటం.. వీటి ఖర్చు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారు తమ మత గురువులు.. పాస్టర్ల వద్దకు వెళ్లి సలహాలు కోరుతున్నారు. దీంతో వారు ఈ ఇష్యూకు ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. తమ వద్దకు వచ్చే వారికి.. ‘‘పిల్లలు ఎలా పుట్టినా వారు మీ ఇంటికి చెందిన వారే. వారిని తిరస్కరించటం పాపం. ఇదే సంప్రదాయం ఒకప్పుడు కుటుంబాలను నిలిపింది. దాన్నే ఫాలో కావాలంటూ వారు నచ్చజెబుతున్నారు. ఆ దేశంలోని చర్చిలు సైతం డీఎన్ఏ పరీక్షల కోసం మనసు పెట్టొద్దని చెబుతున్నాయి. కానీ.. వారి మాటల్ని చాలామంది పట్టించుకోకుండా పరీక్షలకు వెళుతున్నారు’’ అని అక్కడి మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు సుమి.
