Begin typing your search above and press return to search.

యుద్ధంలోకి ఉగాండా.. ఇజ్రాయెల్ కు మద్దతుగా బరిలోకి..

ఆఫ్రికా ఖండంలో కీలక దేశమైన ఉగాండా నుంచి వచ్చిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

By:  A.N.Kumar   |   27 March 2026 10:49 AM IST
యుద్ధంలోకి ఉగాండా.. ఇజ్రాయెల్ కు మద్దతుగా బరిలోకి..
X

ఆఫ్రికా ఖండంలో కీలక దేశమైన ఉగాండా నుంచి వచ్చిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉగాండా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహూజీ కైనెరూగాబా చేసిన వ్యాఖ్యలు మధ్యప్రాచ్య పరిస్థితులపై కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ యుద్ధంలో ఓటమి అంచున నిలిస్తే తాము కూడా యుద్ధంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.

ఇటీవల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉగాండా నుంచి వచ్చిన ఈ ప్రకటన అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగాండా జనరల్ ముహూజీ మాట్లాడుతూ తమ సైన్యం శక్తి, సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందని అవసరమైతే ఇరాన్‌పై దాడి చేయడానికి తమ బ్రిగేడ్ సరిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇరాన్ నుంచి ఎటువంటి మిస్సైల్ దాడులు జరిగినా వాటికి తగిన సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు. తమ దేశ భద్రత, మిత్రదేశాల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్‌కు ప్రత్యక్ష హెచ్చరికగా భావించబడుతున్నాయి.

ఇదిలా ఉండగా గతంలో ఇజ్రాయెల్ ఉగాండాకు అందించిన సహాయాన్ని కూడా ముహూజీ గుర్తుచేశారు. ముఖ్యంగా 1980, 1990 దశకాల్లో ఉగాండా ఆర్థికంగా, రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఇజ్రాయెల్ తమకు అండగా నిలిచిందని ఆయన చెప్పారు. ఆ సహాయాన్ని మరవలేమని, కృతజ్ఞతగా అవసరమైన సమయంలో మిత్రదేశానికి తోడుగా నిలబడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

అయితే ఈ ప్రకటనపై అంతర్జాతీయ సమాజం మిశ్రమంగా స్పందిస్తోంది. కొందరు విశ్లేషకులు దీనిని మిత్రదేశానికి మద్దతుగా చేసిన రాజకీయ ప్రకటనగా భావిస్తుండగా మరికొందరు ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఈ రకం ప్రకటనలు గ్లోబల్ జియోపాలిటిక్స్‌లో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఉగాండా ఈ విధంగా ముందుకు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది. భవిష్యత్తులో ఈ ప్రకటనలు ఎటువంటి ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉంది. మొత్తం మీద ఉగాండా సైన్యాధ్యక్షుడి వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై కొత్త చర్చలకు తెరలేపాయి.