'ఉదయగిరి'లో పొలిటికల్ వేడి.. ఏం జరుగుతోంది.. ?
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రాజకీయ సెగ ఎందుకు పుట్టింది? ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎవరిని ఉద్దేశించి.. తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు?
By: Garuda Media | 22 Dec 2025 10:30 AM ISTఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రాజకీయ సెగ ఎందుకు పుట్టింది? ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎవరిని ఉద్దేశించి.. తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు? ఇదీ.. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. వాస్తవానికి నెల్లూరు జిల్లాలోని ఒకటి రెండు నియోజకవర్గాలు మాత్రమే తరచుగా తెరమీదికి వస్తాయి. నెల్లూరు సిటీ, కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి వంటి నియోజకవర్గాలలోనే రాజకీయ వివాదాలు ఉన్నాయి.
అవి కూడా ప్రత్యర్థుల మధ్యే కావడం గమనార్హం. కానీ.. ఇప్పటి వరకు ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ రగడ పెద్దగా లేదు. ఎవరు గెలిచినా.. ప్రశాంతంగా పనిచేసుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో కలిసి కూడా పనిచేస్తున్న ఘటనలు కనిపించాయి. అలాంటి ప్రశాంతమైన నియోజకవర్గంలో అనూహ్యం గా రాజకీయ సెగ ప్రారంభమైంది. అభివృద్ధిని అడ్డుకుంటే.. తాటతీస్తా! అంటూ.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేరు చెప్పకుండా.. వార్నింగులు ఇచ్చారు.
దీనికి కారణం.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డేనని స్థానికంగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల సమయంలో మేకపాటిని వైసీపీ అధినేత తప్పించారు. దీంతో ఆయన అలిగి టీడీపీ పంచన చేరారు. అయితే.. అప్పటికే ఆయనకు టికెట్ దక్కింది లేదు. ఫలితంగా నామినేటెడ్ పదవి అయినా.. ఇవ్వాలని కోరారు. అది కూడా దక్కలేదు. దీనికి కారణం.. ఎమ్మెల్యేనన్నది మేకపాటి వర్గం చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వర్సెస్ మేకపాటి మధ్య అప్రకటిత రాజకీయ సమరం కొనసాగుతోంది.
తాజాగా ఉదయగిరి నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం చేపట్టారు. అయితే.. కాంట్రాక్టర్ల విషయంలో మరో వివాదం తెరమీదికివచ్చింది. మేకపాటి వర్గానికి చెందిన వారికి పనులు ఇచ్చేది లేదని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది. దీంతో పొరుగు ప్రాంతాలకు చెందిన వారిని తెచ్చి కాంట్రాక్టు పనులు అప్పగించారు. వీరిని మేకపాటి వర్గంబెదిరింపులకు గురిచేసిందన్నదిటీడీపీ ఆరోపణ. ఇద్దరు నాయకులు టీడీపీలోనే ఉన్నా.. అంతర్గత కుమ్ములాటలు పెరగడంతోనే.. ఎమ్మెల్యే సురేష్ బహిరంగ వార్నింగులు ఇచ్చారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. మరి ఇదిసర్దుమణుగుతుందా? లేదా? అనేది చూడాలి.
