ఉదయ్ కృష్ణారెడ్డి.. అందరినీ ఇరికించేస్తున్నాడే!
ప్రస్తుతం ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులపై గుండుగుత్తగా ఆయన కేసులు పెట్టేందుకు రెడీ కావడం పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసింది
By: Garuda Media | 8 Aug 2026 3:08 PM ISTశిక్షణలో ఉన్న ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం.. కీలక మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులపై గుండుగుత్తగా ఆయన కేసులు పెట్టేందుకు రెడీ కావడం పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు కావడం.. ఆయనను అత్తాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించడం తెలిసిందే.
అయితే.. విచారణ అనంతరం.. కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం.. కంటతడి పెట్టిన తీరు వంటివి పోలీసులను ఇరకాటంలోకి నెట్టాయి. ఆయన ఏకంగా సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సీపీ తన కుటుంబ సభ్యులను ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించాడంటూ ఫిర్యాదు చేశారు. కస్టడీ సమయంలో విచారణ చేసిన ప్రతి పోలీసుపై ఫిర్యాదు చేయడం మరో కొసమెరుపు.
నిబంధనలకు విరుద్ధంగా అత్తాపూర్ పోలీసులు వ్యవహరించారని, తనపై అనుచితంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని ఉప్పర్‌పల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లాడు. ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించేందుకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సీపీ సజ్జనార్.. అభ్యంతరకర మాటలు మాట్లాడారని ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, సీపీ సజ్జనార్‌తో పాటు విచారణ చేసిన పోలీసులకు నోటీసులు ఇవ్వాలని మేజిస్ట్రేట్‌కు విన్నవించాడు.
అంతేకాదు, సీసీటీవీ కెమెరాలు లేని చోట విచారణ చేసినట్లు ఆరోపించడం గమనార్హం. అదే సమయంలో రిటైర్డ్ ఏసీపీ పూర్ణచందర్ రావు విచారణలో ఎలా పాల్గొన్నాడని తెలిపారు. అడ్వకేట్లను కూడా చంపేస్తామని బెదిరించినట్లు ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్‌కు తీసుకెళ్లి టార్చర్ చేసి, కొట్టారని చెప్పారు. ఈ నేపథ్యంలో అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతేకాదు, సీసీటీవీ కెమెరాలు లేని చోట ఎలా విచారణ చేశారని ప్రశ్నించింది. రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ పరిణామాలతో పోలీసుల చుట్టూ ఉచ్చుబిగిసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
