తెలుగమ్మాయి పెళ్లికి భారత్ కు వచ్చిన ట్రంప్ కొడుకు
దేశంలో సెలబ్రిటీల పెళ్లిళ్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది ఉదయ్ పూర్. లేక్ సిటీగా పేరున్న ఈ అందమైన నగరం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది.
By: Garuda Media | 22 Nov 2025 9:28 AM ISTదేశంలో సెలబ్రిటీల పెళ్లిళ్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది ఉదయ్ పూర్. లేక్ సిటీగా పేరున్న ఈ అందమైన నగరం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఈ పట్టణంలో ఇప్పటివరకు ఎన్నో సెలబ్రిటీలు.. ప్రముఖుల పెళ్లిళ్లు జరిగినప్పటికి.. అందుకు భిన్నంగా యావత్ ప్రపంచం చూపు ఈ పెళ్లి మీద పడే ఒక విశేషం చోటు చేసుకుంది. ఈ పెళ్లి విషయంలో మరో విశేషం ఉంది. ఇంతకూ పెళ్లి కుమార్తె ఒక తెలుగమ్మాయి. మరో ఆసక్తికర అంశం ఏమంటే..ఈ పెళ్లికి ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ హాజరవుతున్నారు.
అంతేనా.. హాలీవుడ్ ప్రముఖులు జెన్నిఫర్ లోపెజ్.. స్టిన్ బీబర్ కూడా హాజరవుతున్నారు. పలువురు సినీ.. రాజకీయ.. వ్యాపార రంగ ప్రముఖులు అతిధులుగా హాజరవుతున్న ఈ పెళ్లి ఐకానిక్ ప్యాలెస్ లో జరగనుంది. ఇంతకూ ఈ పెళ్లి ఎవరిది? పెళ్లి కుమార్తె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. అమెరికన్ బిలియనీర్ కం వ్యాపారవేత్త రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన. పెళ్లికొడుకు అమెరికాకు చెందిన తెలుగు మూలాలు ఉన్న వంశీ గదిరాజు. ఈ పెళ్లికి దాదాపు 40 దేశాల నుంచి 126 మంది ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు.
రెండు రోజుల పాటు (నవంబరు 21-22) తేదీల్లో ఉదయపూర్ లోని ప్యాలెస్ లో జరగనున్న ఈ వివాహానికి హాలీవుడ్.. బాలీవుడ్ ప్రముఖులతో పాటు.. పలువురు రాజకీయ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇంతకూ పెళ్లి కుమార్తె తండ్రి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే.. భారత సంతతికి చెందిన రామరాజు మంతెన. అమెరికాలో వీరి వ్యాపార ప్రధానకేంద్రం ఉంది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్ అండ్ సీఈవో ఐకోర్ హెల్త్ కేర్.. ఇంటర్నేషనల్ ఆంకాలజీ నెట్ వర్క్.. ఆన్యోస్క్రిప్ట్ ల వ్యవస్థాపకుడిగా మంతెనకు అమెరికా ఆరోగ్య సంరక్షణ రంగంలో మంచి పేరుంది.
ఆయనకు అమెరికాతో పాటు స్విట్జర్లాండ్.. భారత్ తో పాటు పలు దేశాల్లో వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి. ఫార్మా రంగంలో ఆయనో లెజెండ్ గా అభివర్ణిస్తుంటారు. నేత్ర మంతెన తన ప్రొఫైల్ ను చాలా ప్రైవేటుగా ఉంచుతారు. పెళ్లి కొడుకు విషయానికి వస్తే.. వంశీ గాదిరాజు. అతనో టెక్కీ. సూపర్ ఆర్డర్ సహవ్యవస్థాపకుడు.. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. కొలంబియా వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో పట్టా పొందారు. ఇతని కంపెనీ ఉత్పత్తిగా సూపర్ ఆర్డర్ యాప్. 2024లో ఫోర్బ్స్ 30 అండర్ 30 ఫుండ్ అండ్ డ్రింక్ కేటగిరిలో చోటు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సూపర్ ఆర్డర్ యాప్ విలువ 18 నుంచి 25 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ గా ఈ పెళ్లిని అభివర్ణిస్తున్నారు. ట్రంప్ కొడుకే ప్రత్యేకంగా ఈ పెళ్లి కోసం భారత్ కు వస్తున్నాడంటేనే.. ఈ పెళ్లి ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన అవసరం లేదు.
