చేతిలో సిగరెట్, కారులో మ్యూజిక్, స్పీడ్ 140... షాకింగ్ వీడియో!
వివరాళ్లోకి వెళ్తే... జనవరి 17 తెల్లవారుజామున ఉదయపూర్ లోని సవినా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కార్లు ఢీకొన్నాయి.
By: Raja Ch | 21 Jan 2026 9:01 AM ISTరోజూ ఏదో మూల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలు నడపడం ఒక ప్రమాదం కారణమని పోలీసులు చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ట్రాఫిక్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. వాహనాలతో రోడ్లపైకి వచ్చిన వారు తిరిగి క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని అధికారులు కోరుకుంటున్నారు. అయినప్పటికీ పెడ చెవిన పెట్టేవారు పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇలానే చేసినవారి బ్రతుకులు అర్ధాంతరంగా దారుణంగా తెల్లారిపోయాయి!
అవును... తాగి వాహనాలు నడపడం ఏమాత్రం క్షేమకరం కాదని.. దయచేసి ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు నిత్యం చెబుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ తాజాగా ఓ బ్యాచ్ ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్నట్లుంది. పుట్టిన రోజు థ్రిల్ రైడ్ పేరు చెప్పి జరిగిన ఈ ప్రయాణంలో కారు స్పీడ్ గంటకు 140 కి.మీ.ల తాకిన సమయంలో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టడం.. పెద్ద శబ్ధం రావడం జరిగిపోయాయి. నలుగురి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి!
వివరాళ్లోకి వెళ్తే... జనవరి 17 తెల్లవారుజామున ఉదయపూర్ లోని సవినా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు స్నేహితులు కారులో ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్నవారు దాదాపు 10 నిమిషాల పాటు సహాయం కోసం వేడుకున్నారని చెబుతున్నారు.
ఈ ప్రమాదానికి ముందు రికార్డ్ చేయబడిన వీడియో తాజాగా బయటపడింది! ఇందులో షేర్ మహ్మద్ అనే వ్యక్తి కారును గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో నడుపుతూ.. అనంతరం గంటకు 140 కి.మీ వేగంతో దూసుకెళ్తున్నట్లు చూపబడింది. ఈ సమయంలో... వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి డ్రైవర్ ను 140 కి.మీ వేగంతో నడపవద్దని పదే పదే అడుగుతున్నట్లు కనిపిస్తుంది! అయితే.. ఈ రికార్డింగ్ ప్రారంభమైన 1 నిమిషం 10 సెకన్ల తర్వాత కారు ప్రమాదానికి గురైనట్లు వీడియో చూపిస్తుంది.
ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతిలో సిగరెట్ ఉండగా.. ఇక కారులో మ్యూజిక్ కి బాక్సులు బద్దలైపోతున్న పరిస్థితి అని చెబుతున్నారు! ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో కారు బోల్తాపడింది. ఈ సమయంలో జనం సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి.. నలుగురు స్నేహితులు చనిపోయి కనిపించగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడి కారు లోపల నొప్పితో విలవిలలాడుతూ కనిపించారని అంటున్నారు. దీంతో.. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఇలా విషాదంగా ముగిసింది!
ఈ సందర్భంగా మృతులను.. మహ్మద్ అయాన్ (17), ఆదిల్ ఖురేషి (14), షేర్ మహ్మద్ (19), గులాం ఖ్వాజా (17) అని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో ఇద్దరు స్నేహితులు వసీం (20), మహ్మద్ కైఫ్ (19) ఆసుపత్రికి తరలించబడ్డారని వెల్లడించారు. మరో వాహనంలోని ప్రయాణికులు కూడా ఈ ప్రమాదంలో గాయపడగా.. వారిని మహిపాల్ జాట్ (48), రాజ్ బాలా (45), రాజేష్ (26), కర్మవీర్ సింగ్ (24)గా గుర్తించారు.
