కొత్త మాట... ఎన్డీయేకు ప్రత్యామ్నాయంపై పీకే పార్టీ వెర్షన్ ఇదే?
ఈ ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 16 Nov 2025 5:00 AM ISTఈ ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 243 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో 202 సీట్లు గెలుచుకుని స్ట్రాంగ్ పొజిషన్ లో నిలబడింది.. మరోవైపు మహాగఠ్ బంధన్ ను పూర్తిగా తుడిచిపెట్టింది. ఫైనల్ ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో బీజేపి 89 సీట్లు గెలుచుకుని, బీహార్ లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఇదే సమయంలో ఎన్డీయేలో భాగస్వామి అయిన జేడీ(యూ) 85 సీట్లు గెలుచుకుంది. ఈ రెండు పార్టీలూ తలో 101 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష ఆర్జేడీ 25 సీట్లకు పరిమితం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలతో సరిపెట్టుకున్న పరిస్థితి. ఇక ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్.. ఖాతా తెరవలేకపోయింది. ఈ సమయంలో ఆ పార్టీ నేత ఎన్డీయే విజయానికి కారణాలు చెబుతూ.. సరికొత్త చర్చకు తెరలేపారు.
అవును... బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించగా.. మహాగఠ్ బంధన్ చతికిలబడగా.. సున్నా స్థానాల్లో విజయం సాధించిన జన్ సూరజ్ నుంచి ఈ ఎన్నికలపై విశ్లేషణ తెరపైకి వచ్చింది. బీహార్ తాజా ఫలితాలపై ఆ పార్టీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఎన్డీయే గెలుపుకు తేజస్వీ యాదవ్ తండ్రి పాలన జ్ఞాపకాలు కారణమని అన్నారు.
'జంగిల్ రాజ్' భయంతోనే...!:
ఈ సందర్భంగా స్పందించిన ఉదయ్ సింగ్... జంగిల్ రాజ్ భయంతోనే బీహార్ ఓటర్లంతా ఎన్డీయే కూటమికి ఓట్లు వేశారని.. ఆర్జేడీకి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ ఆనాటి జంగిల్ రాజ్ పాలన తీసుకొస్తారేమోనన్న భయమే ఈ ఫలితాలకు కారణమని తెలిపారు. ఓటర్లలో నిండుగా ఉన్న ఆ భయమే ఎన్డీయే గెలుపుకూ, ఆర్జేడీ ఓటమికి కారణమని అన్నారు.
జన్ సూరజ్ అనుకున్న ప్రజలే...!:
ఇదే క్రమంలో ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందకపోవడంపైనా ఉదయ్ సింగ్ స్పందించారు. ఇందులో భాగంగా... ప్రజలు ఎవరైతే జన్ సూరజ్ పార్టీని ఎన్నుకోవాలని అని అనుకున్నారో.. వారంతా ఓటింగ్ సమయానికి ఎన్డీయే వైపుకు షిఫ్ట్ అయ్యారని చెప్పుకొచ్చారు. దానికి కూడా జంగిల్ రాజ్ తో భయమే కారణమని.. ఆ భయంతోనే తమకు ఛాన్స్ ఇవ్వాలనుకున్న ప్రజలు.. ఫైనల్ గా ఎన్డీయే వైపు వెళ్లారని చెప్పుకొచ్చారు.
సమస్య ఆర్జేడీ.. కాంగ్రెస్ కాదు!:
ఈ సందర్భంగా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు ఉదయ్ సింగ్. ఇందులో భాగంగా... ఈ ఎన్నికల్లో మహాగఠ్ బంధన్ ఘోర ఓటమికి ఆర్జేడీనే కారణమని, ఆ పార్టీతోనే ప్రజలకు సమస్య ఉండని.. కాంగ్రెస్ పార్టీతో మహాగఠ్ బంధన్ కూటమికి ఎలాంటి సమస్యా లేదని అన్నారు. దీంతో... బీహార్ లో జేడీయూకి ప్రత్యామ్నాయం ఆర్జేడీ కాదు, జన్ సూరజ్ అని చెప్పాలనుకోవడంతోపాటు.. జన్ సూరజ్ ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టాలని భావిస్తోందా అనే చర్చ తెరపైకి వచ్చింది.
