ఏడారి దేశంలో వరదలు.. భారీ వర్షాలు.. పలు నగరాలు జలమయం
అవును.. వర్షమే తక్కువగా పడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By: Garuda Media | 20 Dec 2025 11:31 AM ISTప్రకృతి కన్నెర్ర చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానికి నిదర్శనంగా ఏడారి దేశంలో తాజా పరిణామాల్ని చెబుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఏడారి దేశంలో రేర్ సీన్లు ఆవిష్క్రతమవుతున్నాయి. అవును.. తెలుగు ప్రజలకు సుపరిచితమైన భారీ వర్షాలు.. వరదలు.. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం.. రోడ్ల మీద భారీగా వరద నీరు నిలిచిపోవటం.. రోడ్లు జలమయమై ట్రాఫిక్ కు అంతరాయం కలగటం లాంటివి ఇప్పుడు ఏడారి దేశంలో కనిపిస్తున్నాయి.
అవును.. వర్షమే తక్కువగా పడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అబుదాబీ.. దుబాయ్ తో సహా కొన్ని గంటల పాటు కురిసిన భారీ వర్షం.. అక్కడి జన జీవనం ఒక్కసారి స్తంభించిపోయేలా చేసింది. భారీ వర్షాల కారణంగా శుక్రవారం పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దీంతో.. హాలీడే సీజన్ వేళ కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.
దుబాయ్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని.. అవసరమైతేనే బయటకు రావాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని అడ్వైజరీ జారీ చేశారు. వరద తీవ్రత తక్కువ అంచనా వేయొద్దని.. ప్రమాదకరంగా ఉండొచ్చని షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ సూచన చేసింది.
ఈ తరహా పరిస్థితి దోహా.. ఖతార్ లోనూ కనిపించటం గమనార్హం. తాజా పరిణామాలతో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్కులు.. పర్యాటక ప్రదేశాలు..బీచ్ లను తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షాల కారణంగా పలు నగరాల్లో ట్రాఫిక్ జాంలు నెలకొన్నాయి. ఇంతకూ ఏడారి దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు? మౌలిక సదుపాయాలు పక్కాగా ఉంటాయన్న పేరున్న వేళ.. అందుకు భిన్నమైన సీన్లు ఎందుకు కనిపిస్తున్నాయంటే.. దానికి కారణాల్ని విశ్లేషిస్తున్నారు.
తక్కువ సమయంలో భారీగా కురిసే వర్షాలకు తగినట్లుగా అక్కడి వ్యవస్థల్ని డిజైన్ చేయలేదని చెబుతున్నారు. భారీ వర్షాలకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ.. అండర్ పాస్ నిర్మాణాలు లేని కారణంగా వరద తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు. తాజాగా ఎదురవుతున్న పరిణామాలకు అనుగుణంగా ఏడారి దేశంలో రాబోయే రోజుల్లో తనను తాను సిద్ధం చేసుకునే వీలుందంటున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం భారీ వర్షాల కారణంగా ఏడారి దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు.
