Begin typing your search above and press return to search.

ఇండియాలో మాదిరే చేశారు.. యూఏఈలో 19 మంది అరెస్టు

ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి తగ్గట్లు వ్యవహరించాలి.అంతే తప్పించి.. మన దేశంలో వ్యవహరించినట్లే.. పరాయి దేశంలో వ్యవహరిస్తే తిప్పలు తప్పవు.

By:  Garuda Media   |   16 March 2026 7:46 PM IST
ఇండియాలో మాదిరే చేశారు.. యూఏఈలో 19 మంది అరెస్టు
X

ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి తగ్గట్లు వ్యవహరించాలి.అంతే తప్పించి.. మన దేశంలో వ్యవహరించినట్లే.. పరాయి దేశంలో వ్యవహరిస్తే తిప్పలు తప్పవు. కొన్ని సందర్భాల్లో చట్టబద్ధమైన సమస్యలు ఎదురవుతాయి. అదే.. యుద్ధం లాంటి సున్నిత సందర్భాల్లో విదేశాల్లోని చట్టాలు మరింత పదునెక్కుతాయి. అందునా యూఏఈ లాంటి దేశాల్లో పరిస్థితి మరింత కఠినంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించే విషయంలో జరిగిన తప్పులకు మనోళ్లు పలువురు జైలుపాలయ్యారు. ఇంతకూ వారు చేసిన దారుణ నేరం మరేమిటో కాదు.. వాట్సాప్ లో తమకు వచ్చిన సందేశాల్ని ఫార్వర్డ్ చేయటమే.

సోషల్ మీడియా విస్త్రతి పెరిగిన తర్వాత.. అందుబాటులోకి వచ్చిన ఏఐ సాంకేతికతతో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్న వారు కొందరైతే.. తప్పుడు సమాచారంతో పోస్టులు తయారు చేసి వాటిని వైరల్ చేస్తుండేవారు మరికొందరు. ఇలాంటి వారి పోస్టులకు ప్రభావితమై అడ్డంగా బుక్ అవుతుంటారు కొందరు అమాయకులు. ఇప్పుడు అలాంటి నేరంలో చిక్కుకున్నారు మనోళ్లు. తమకు తెలిసిన విషయాన్ని నలుగురికి షేర్ చేసే గుణం మనోళ్లలో కాస్త ఎక్కువ. దీన్నే అందంగా గాసిప్ అనేస్తుంటారు. వ్యక్తులకు సంబంధించిన గాసిప్ లతో జరిగే నష్టం ఒకలా ఉంటే.. వ్యవస్థలకు సంబంధించిన గాసిప్ లతో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక.. యుద్ధ సమయాల్లో జరిగే తప్పుడు ప్రచారాల్ని పలు దేశాలు సీరియస్ గా తీసుకుంటాయి.

మరికొన్ని దేశాల్లో తమకు ప్రతికూలంగా మారే వాస్తవాల్ని సైతం సీరియస్ గా తీసుకుంటాయి. తాజాగా జరుగుతున్న యుద్ధంలో ఎలాంటి సంబంధం లేని యూఏఈ తీవ్రంగా ఇబ్బందులకు గురవుతోంది. నిజానికి ఈ యుద్ధం కాణంగా ఎమిరేట్స్ కు భారీ నష్టం వాటిల్లింది. ఇలాంటి సందర్భాల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పినా.. జరిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే.. ఫిల్టర్ చేసిన సమాచారాన్ని మాత్రమే బయటకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ.. మనోళ్లు కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారానని..కల్పిత ద్రశ్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలను చేపట్టింది.

అక్కడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 35 మందిని గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో 19 మంది భారతీయులు ఉండటం గమనార్హం. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. క్షిపణి దాడులు.. రక్షణ వ్యవస్థల ఆపరేషన్లను చిత్రీకరించొద్దని గతంలోనే యూఏఈ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. వాటిని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో తమకు అందిన తప్పుడు సమాచారాన్ని పోస్టు చేశారు. గడిచిన వారంలో మొత్ం 35 మందిని అరెస్టు చేస్తే.. అందులో 19 మంది మనోళ్లు. క్షిపణులు వీడియోలు.. ఏఐ ఫేక్ ద్రశ్యాలు.. శత్రు దేశాలకు మద్దతుగా పోస్టులు పెడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు ఒక ఏడాది జైలు శిక్షతో పాటు.. లక్ష దిర్హమ్ (ఒక్క దిర్హమ్ విలువ మన రూపాయిల్లో రూ.25పైనే ఉంటుంది. లెక్క తేలిక కోసం రూ.25 లక్షలు అవుతుంది) జరిమానా విధించే వీలుంది. తాజా పరిణామాల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. అత్యుత్సాహంతో తమకు అందిన పోస్టుల్ని ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటం తక్షణావసరం. అలాంటి అలవాట్లు ఉన్నోళ్లు బీకేర్ ఫుల్.