Begin typing your search above and press return to search.

'అతి' చేసి.. కొంప ముంచిన మ‌హిళా మంత్రులు..!

ఇద్దరు మహిళా మంత్రులు చేసిన `అతి` కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

By:  Garuda Media   |   22 Sept 2025 6:00 AM IST
అతి చేసి.. కొంప ముంచిన మ‌హిళా మంత్రులు..!
X

ఇద్దరు మహిళా మంత్రులు చేసిన `అతి` కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సహజంగా వైసిపిని వ్యతిరేకించాలి.. లేకపోతే వైసిపి చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు చెబుతున్నారు. అదేవిధంగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో రైతుల విషయం నుంచి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వరకు కూడా గతంలో వైసిపి లేవనెత్తిన అనేక అంశాలకు ఇటు సోషల్ మీడియాలోను, అటు బహిరంగంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ మంత్రులు నాయకులు కూడా వ్యతిరేకించారు.

`మాటకు మాట` అన్న విధంగా వైసీపీపై ఎదురుదాడి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదు. పైగా కొన్ని కొన్ని విషయాల్లో టిడిపి పైచేయి సాధించిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ, ఇటీవల వైద్య కళాశాలలు ప్రైవేటీకరిస్తున్నారనే విషయంపై వైసీపీ చేసిన ప్రచారాన్ని టార్గెట్ చేస్తూ ఇద్దరు మహిళా మంత్రులు చేసిన విమర్శలు.. క్షేత్రస్థాయిలో వారు నిర్వహించిన కార్యక్రమాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసాయి. పెనుకొండ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గంలో నిర్మించిన వైద్య కళాశాల అసలు పునాదులు కూడా దాటలేదంటూ మీడియా ముందు ప్రదర్శించారు.

క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడ మీడియాకు వివరించారు. ఇది తీవ్ర స్థాయిలో భూమరాంగ్ అయింది. వైసిపి నాయకులు అదే ప్రాంతానికి వెళ్లి అక్కడ జరిగిన నిర్మాణాలను, పక్కనే ఉన్న కట్టడాలను చూపిస్తూ మంత్రి సవిత కళ్ళు మూసుకుని వ్యవహరించారంటూ మాట్లాడారు. ఆయా నిర్మాణాలకు సంబంధించిన వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి వంగలపూడి అనిత కూడా రాజమండ్రిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు జగన్ తీసుకువచ్చిన కాలేజీల్లో ఒక్కటి కూడా నిర్మాణం కాలేదని ఆమె చెప్పారు.

మరీ ముఖ్యంగా `రాజమండ్రిలో ఏం కట్టారు` అంటూ ఆమె నిల‌దీశారు. మొత్తంగా 17 కాలేజీల విషయంలో కేవలం ఒకటి రెండు కాలేజీలు కూడా సరిగా పూర్తి కాలేదు అన్నది మహిళా మంత్రులు చేసిన ప్రచారం. దీనిని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ నాయకులు క్షేత్రస్థాయిలో 17 కాలేజీల దగ్గరకు వెళ్లడంతో పాటు మీడియాను కూడా తీసుకుని వెళ్లారు. అక్కడ జరిగిన నిర్మాణాలు, అదేవిధంగా ఐదు కళాశాలలో జరుగుతున్న తరగతులను మీడియాకు చూపించారు. సుదీర్ఘంగా వివరించారు. ఫలితంగా అప్పటివరకు అసలు ప్రజల్లో చర్చ కూడా పెద్దగా లేని ఈ విషయం తర్వాత కాలంలో చర్చ‌కు వచ్చింది.

`ప్రభుత్వం ఎందుకిలా చేస్తుంది` అన్నది సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయేలాగా మారిపోయింది. దీనిపై సీఎం చంద్రబాబు తాజాగా చర్చించారు. ఇకపై విమర్శలు చేసే ముందు ఆలోచన చేసుకోవాలని ఎలా పడితే అలా విమర్శలు చేయొద్దని మంత్రివర్గానికి మొత్తంగా ఆయన సూచించడం విశేషం. ఏదేమైనా సీఎం చెప్పారు కాబట్టి విమర్శిస్తున్నామన్న ధరణిలో నాయకులు వ్యవహరిస్తున్నారు. తప్ప.. క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకొని మనసుపెట్టి గనుక స్పందిస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నది సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పిన మాట. మరి ఇక నుంచి అయినా వారు మారతారా లేదా అనేది చూడాలి.