ఎస్.. వారిద్దరికీ ప్రమోషన్ ఖాయం..!
ఇక, పార్టీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి.. రాయలసీమకు చెందిన మహిళా ఎమ్మెల్యేకు చంద్రబాబు మంచి మార్కులు వేస్తున్నారు.
By: Garuda Media | 28 Aug 2025 9:07 AM ISTకూటమి ప్రభుత్వంలో ఇద్దరు కీలక నాయకులకు ప్రమోషన్ ఇవ్వడం ఖాయమా? త్వరలోనే జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో వారికి మినిస్టర్లుగా చంద్రబాబు అవకాశం ఇవ్వనున్నారా? అంటే.. ఔననే సమాధా నమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరిలో ఒకరుమహిళ కాగా.. మరొకరు ఉత్తరాంధ్రకు చెందిన కీలక నాయకుడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి వారి పేర్లు బయటకు రాకపోయినా.. ఇద్దరి పనితీరుపై చంద్రబాబు సంతోషంగా ఉన్నారని.. వారికి పదవులు ఇచ్చి.. మరింత ప్రోత్సహించాలని భావిస్తున్నారు.
ఆ ఇద్దరేనా.. ?
ఇక, పార్టీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి.. రాయలసీమకు చెందిన మహిళా ఎమ్మెల్యేకు చంద్రబాబు మంచి మార్కులు వేస్తున్నారు. పైగా ఎస్సీ కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఈ యువ మహిళా ఎమ్మెల్యే పనితీరుకు చంద్రబాబు మార్కులు బాగానే వేస్తున్నారని చర్చ సాగుతోంది. ఈ మెకు పదవి ఇవ్వడం ద్వారా సీమలో మరింత పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఆమెకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది.
ఇక, ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక బీసీ నాయకుడు.. ప్రస్తుతం ముఖ్య పదవిలో ఉన్నారు. అయితే.. ఆయనను ఆ పదవి నుంచి తీసి.. మంత్రి వర్గంలోకి చేర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వినయం, విధేయతలకు, సీఎం చంద్రబాబు అంటే ఇచ్చే గౌరవానికి తోడు.. కీలక సామాజిక వర్గం కావడంతో ఆయన కు మంత్రి పదవి ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన టీడీపీకి కీలక రోల్ పోషిస్తున్నారు . పార్టీని గౌరవంగా.. ఉన్నతంగా కూడా ముందుకు తీసుకువెళ్తున్నారని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఎప్పుడు మార్పులు చేసినా.. ఆ ఇద్దరు నాయకులకు అవకాశం ఖాయమన్న చర్చ సాగుతోంది. అయితే.. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో మాత్రమే జరుగుతున్న చర్చ.. ప్రకారం.. పార్టీకి విధేయులుగా ఉన్నవారికి.. అధినేత చెప్పినట్టు వినేవారికి మాత్రమే పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారి పేర్లు జోరుగా తెరమీదికి వచ్చాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
