పైలట్ కావాలనే కల.. కెనడా గగనతలంలోనే గాల్లో కలిసింది..
కమర్షియల్ పైలట్‌గా కెరీర్‌ను నిర్మించుకోవాలనుకున్న ఇద్దరు భారతీయ విద్యార్థుల కల కెనడాలో జరిగిన విమాన ప్రమాదంతో విషాదాంతమైంది.
By: A.N.Kumar | 21 Sept 2026 4:51 PM ISTకమర్షియల్ పైలట్‌గా కెరీర్‌ను నిర్మించుకోవాలనుకున్న ఇద్దరు భారతీయ విద్యార్థుల కల కెనడాలో జరిగిన విమాన ప్రమాదంతో విషాదాంతమైంది. తమిళనాడుకు చెందిన మనోజ్ శివకుమార్, పుదుచ్చేరికి చెందిన శ్రీశరణ్ శిక్షణలో భాగంగా విమానాన్ని నడుపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన భారతీయ ప్రవాస సమాజంలో విషాదాన్ని నింపింది.
విమాన శిక్షణ కోసం కెనడాకు..
విదేశాల్లో చదువుకుంటూ తమకు నచ్చిన రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలని ఎంతోమంది భారతీయ విద్యార్థులు కలలు కంటుంటారు. మనోజ్ శివకుమార్, శ్రీశరణ్ కూడా అలాంటి లక్ష్యంతోనే కెనడాలో ఫ్లైట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించేందుకు అవసరమైన ఫ్లైట్ అవర్స్‌ను పూర్తి చేసుకునే క్రమంలో ఇద్దరూ చిన్న విమానాన్ని అద్దెకు తీసుకున్నారు.
ఇద్దరికీ ఇప్పటికే పైలట్ లైసెన్స్ ఉన్నట్లు సమాచారం. మరిన్ని విమాన ప్రయాణ గంటలను నమోదు చేసుకుని కమర్షియల్ పైలట్ లైసెన్స్ దిశగా ముందుకు వెళ్లేందుకు వారు ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు.
గమ్యానికి చేరకుండానే..
కెనడాలోని సస్కాచెవాన్ ప్రావిన్స్‌లో కిస్బీ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొన్ని గంటల తర్వాత విమానం గమ్యస్థానానికి చేరుకోలేదు. దీంతో విమానం ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు కెనడా మిలిటరీకి చెందిన రెస్క్యూ బృందం సాయంత్రం సమయంలో విమానం కూలిపోయిన ప్రాంతాన్ని గుర్తించింది. అయితే అప్పటికే విమానంలో ఉన్న ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు.
కుటుంబాలకు అండగా భారత అధికారులు
ఈ విషాద ఘటనపై వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ స్పందించింది. మనోజ్, శ్రీశరణ్ కుటుంబాలకు సంతాపం తెలిపింది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. మృతదేహాలను భారత్‌కు తరలించే ప్రక్రియలో కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు భారత అధికారులు తెలిపారు.
ఒకే లక్ష్యం.. విషాద ముగింపు
వేల కిలోమీటర్ల దూరంలోని కెనడాలో తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని బయలుదేరిన ఇద్దరు యువకులు.. పైలట్‌గా ఆకాశంలో ఎగరాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్నారు. కానీ అదే విమాన శిక్షణ వారి జీవితాల్లో చివరి ప్రయాణంగా మారడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వారి మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు, భారతీయ ప్రవాస సమాజం విషాదంలో మునిగిపోయింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు.. విమానం ఎందుకు కూలిపోయిందనే అంశాలపై స్థానిక అధికారులు దర్యాప్తు కొనసాగించాల్సి ఉంది.
