విధి ప్లాన్ ఇదేనా? చిన్ననాటి స్నేహం… తర్వాత సిస్టర్స్‌గా రివీల్!
టీనేజ్ వయసులో నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో మీనా, మినల్ అనుకోకుండా కలుసుకున్నారు.
By: Madhu Reddy | 14 Aug 2026 3:07 PM ISTసినిమా కథల్లో మాత్రమే చూసే అద్భుతమైన విచిత్రాలు ఒక్కోసారి నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. చిన్నతనంలో విడిపోయి, వేర్వేరు ప్రాంతాల్లో పెరిగిన ఇద్దరు అమ్మాయిలు టీనేజ్ వయసులో కలుసుకుని ప్రాణస్నేహితులుగా మారారు. ఆ తర్వాత 15 ఏళ్ల పాటు అసలు సంబంధమే లేకుండా పోయారు. కానీ తీరా ఏళ్ల తర్వాత డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే తాము స్నేహితులు కాదు, సొంత అక్కాచెల్లెళ్లమని తెలిసి షాక్ అయ్యారు. నెదర్లాండ్స్‌లో వెలుగు చూసిన ఈ నిజ జీవిత భావోద్వేగ కథ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
భారత్ నుంచి నెదర్లాండ్స్‌కు దత్తత:
భారత్‌కు చెందిన మీనా (43), మినల్ (44) అనే ఇద్దరు చిన్నతనంలోనే అనాథలుగా మారి వేర్వేరు కుటుంబాలకు దత్తతగా వెళ్లారు. నెదర్లాండ్స్‌లోని రెండు వేర్వేరు కుటుంబాలు వీరిని పెంచుకున్నాయి. ఇక చిన్నతనంలో తమకు ఒకరి గురించి ఒకరికి ఎలాంటి సమాచారం లేదు. ఇక విధి ఆడిన విచిత్రమైన నాటకంలో భాగంగా, వీరిద్దరూ ఒకే దేశంలో వేర్వేరు ప్రదేశాల్లో తమ కొత్త కుటుంబాలతో కలిసి పెరిగి పెద్దయ్యారు.
ఈవెంట్‌లో ఫ్రెండ్స్.. ఆపై కాంటాక్ట్ కట్:
టీనేజ్ వయసులో నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో మీనా, మినల్ అనుకోకుండా కలుసుకున్నారు. ఇక ఒకరి ఆలోచనలు, మనస్తత్వాలు ఒకరికి నచ్చడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఇక కొన్నాళ్ల పాటు ఎంతో ఆప్యాయంగా స్నేహితులుగా మెలిగిన వీరిద్దరూ, కాలక్రమేణా ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారిపోయారు. అలా దాదాపు 15 ఏళ్ల పాటు ఒకరికొకరు కాంటాక్ట్‌లో లేకుండా దూరంగా ఉండిపోయారు.
డీఎన్ఏ టెస్ట్‌తో వెలుగులోకి అసలు నిజం:
పదిహేనేళ్ల విరామం తర్వాత, తమ మూలాల గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఇద్దరూ విడివిడిగా డీఎన్ఏ (DNA) పరీక్షలు చేయించుకున్నారు. ఇక ఆ టెస్ట్ రిపోర్టులు చూసిన అధికారులు, వారిద్దరూ సాధారణ స్నేహితులు కాదు.. ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత అక్కాచెల్లెళ్లని తేల్చి చెప్పారు. ఈ విషయం తెలిసి మీనా, మినల్‌తో పాటు వారిని పెంచిన కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
విధి రాసిన విచిత్రమైన కథనానికి ఈ అక్కాచెల్లెళ్ల అనుబంధమే ఒక పెద్ద నిదర్శనం. ఎంత దూరంలో పెరిగినా, పదిహేనేళ్లు ఒకరికొకరు కాంటాక్ట్‌లో లేకపోయినా రక్తం పంచుకు పుట్టిన బంధం చివరికి వారిని మళ్లీ ఒకే గొడుగు కిందకి చేర్చింది. ఇక పకడ్బందీ సినిమా కథను తలపించే ఈ హృదయపూర్వకమైన ఘటన సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
