హైదరాబాద్ లో పేలిన ఏసీ.. కవలలు మృతి
విన్నంతనే విస్మయానికి గురి చేసే ఉదంతం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇలా కూడా జరుగుతుందా? అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. కాచిగూడలోని సుందర్ నగర్ లో ఒక ఇంట్లో ఏసీ పేలింది.
By: Garuda Media | 27 Dec 2025 11:18 AM ISTవిన్నంతనే విస్మయానికి గురి చేసే ఉదంతం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇలా కూడా జరుగుతుందా? అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. కాచిగూడలోని సుందర్ నగర్ లో ఒక ఇంట్లో ఏసీ పేలింది. ఏసీ పేలటమా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఏసీలో చోటు చేసుకున్న షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కవలలు మరణించారు.
ఏసీ పేలినంతనే ఒక చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. సుందర్ నగర్ లోని అంజుమన్ మసీదు ప్రాంగణంలోని ఇంట్లో సయ్యద్ సైపుద్దీన్ ఖాద్రీ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ మసీదు ప్రాంగణంలో ఉన్న అంజుమన్ ఖాదీమల్ ముస్లీమిన్ విద్యా సంస్థలకు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. వారిలో మూడేళ్ల రహీం.. రెహమాన్ ఇద్దరు కవలలు.
శుక్రవారం ఇంట్లోని వారంతా బయట ఉండగా.. కవలలైన ఇద్దరు చిన్నారులు ఇంట్లో నిద్రపోతున్నారు. సాయంత్రం వేళలో ఏసీ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో మంటలు ఇల్లంతా వ్యాపించటంతో లోపల ఉన్న కవల పిల్లలు బయటకు రాలేకపోయారు. ఇంట్లోనే చిక్కుకుపోయారు. ఈ దారుణ ప్రమాదంలో చిన్నారి రహీం ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు మంటల్ని ఆర్పారు. కొందరు సాహసించి పిల్లల్ని కాపాడేందుకు ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే రహీం ఖాద్రీ మరణించగా.. రహ్మన్ ఖాద్రీ శరీరం 95 శాతం కాలిపోయింది. చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న అతను చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఉదంతం స్థానికంగా షాకింగ్ గా మారింది. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
