విజయ్ విజిల్ వేయిస్తారా ?
ఇదిలా ఉంటే విజయ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ కూడా విజిల్. ఆ మూవీతో కమర్షియల్ గా గ్రాండ్ సక్సెస్ కొట్టిన విజయ్ కి ఇపుడు అదే గుర్తు రావడంతో పార్టీ నేతలు దానిని సానుకూల సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు.
By: Satya P | 23 Jan 2026 8:56 AM ISTతమిళనాడులో కొత్త పార్టీకి క్రేజ్ ఉంది. దాని అధినాయకుడు వెండి తెర వేలుపు. ఆయనే దళపతి విజయ్. తమిళ సూపర్ స్టార్ గా దశాబ్దాల స్టార్ డం ని ఆస్వాదిస్తూ తన రాజకీయ జాతకాన్ని పరీక్షించుకోవడానికి ప్రజా సేవ కోసం కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకోవడానికి విజయ్ టీవీకే పేరుతో పార్టీ పెట్టారు. ఆ పార్టీ నెమ్మదిగా బాలారిష్టాలు దాటుకుంటూ ముందుకు వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ పార్టీకి కామన్ సింబల్ గా విజిల్ గుర్తుని ఇచ్చింది దాంతో ఇక విజయ్ పార్టీ క్యాడర్ నేతలు అంతా సంబరాలు చేసుకుంటున్నారు.
సూపర్ హిట్ మూవీ అది :
ఇదిలా ఉంటే విజయ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ కూడా విజిల్. ఆ మూవీతో కమర్షియల్ గా గ్రాండ్ సక్సెస్ కొట్టిన విజయ్ కి ఇపుడు అదే గుర్తు రావడంతో పార్టీ నేతలు దానిని సానుకూల సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. సినిమా హిట్ అయినట్లుగానే తమ పార్టీ కూడా బంపర్ హిట్ అవుతుందని వారు విశ్వాసంతో ఉన్నారు. ఇక మీదట తాము విజిల్ గుర్తుని జనంలో ఉంచుతూ మంచి ప్రచారం చేస్తామని కూడా చెబుతున్నారు.
ఈజీగా జనంలోకి :
విజయ్ పార్టీ మూడు ఆప్షన్లు ఇచ్చింది. అందులో ఆటోతో పాటు విజిల్ కూడా ఉంది అయితే విజిల్ గుర్తుని ఇవ్వడంతో టీవీకే పార్టీ ఫుల్ హ్యాపీ అవుతోంది. విజిల్ ఊదుతూ జనంలోకి వెళ్ళిపోవచ్చని ప్రతీ వారికీ అర్ధం అయ్యే గుర్తు ఇదే అని అంటోంది. తమ సభలకు వచ్చే వారంతా విజిల్స్ ఊదుతూ వస్తే చాలు అని దానంతట అదే పబ్లిసిటీ అవుతుందని అంటోంది.
టైం కలసి వచ్చేలా :
మే నెలలో తమిళనాడులో ఎన్నికలు అంటే ఇంకా నాలుగు నెలల సమయం ఉందని దాంతో చాలా సులభంగా గుర్తుని జనంలోకి పంపించగలమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా కామన్ సింబల్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొందరగా రావడం శుభ శకునంగా వారు అభిప్రాయపడుతున్నారు. చాలా కొత్త పార్టీలకు చివరి నిముషంలో కానీ ఎన్నికల గుర్తులు రావని దాంతో ప్రజాదారణ ఉన్నా గుర్తు తెలియక ఇబ్బందులు వస్తాయని వారు అంటున్నారు అయితే టీవీకే పార్టీ ప్రధాన అడ్డంకి దాటేసింది కాబట్టి ఇక చూసుకో మా తడాఖా అంటూ ఆ పార్టీ నేతలు తెగ జోష్ చేస్తున్నారు.
అతి పెద్ద పరీక్ష :
డీఎంకే పార్టీని ఢీ కొట్టేది ధీటైన పార్టీ తమదే అని జనాల్లో కూడా కొత్త పార్టీ పట్ల ఉన్న మోజుకు తోడు మంచి గుర్తు తోడు కావడంతో వచ్చే ఎన్నికల్లో గెలిచి తమ నాయకుడు సీఎం కావడం ఖాయమని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి విజయ్ జనాల చేత ఏ మేరకు విజిల్స్ వేయిస్తారు అన్నది చూడాల్సి ఉంది . వెండి తెర మీద తనదైన నటనతో విజిల్స్ వేయించుకున్న ఈ మాస్ హీరో జనంలోకి వస్తే క్రౌడ్ పుల్లరే, అందులో ఏ రకమైన డౌటూ లేదు, కానీ సినీ జనాభిమానం రాజకీయ అభిమానంగా మారడమే అతి పెద్ద పరీక్ష. అందులో కనుక విజయ్ పాస్ అయితే తమిళనాడు సరికొత్త చరిత్రను రాసినట్లే అని అంటున్నారు.
