టీవీకే మేనిఫెస్టో లీక్ ఇచ్చిన విజయ్.. ఇవి తాజా సంచలనం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నుంచి ఐదు నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.
By: Raja Ch | 23 Nov 2025 3:14 PM ISTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నుంచి ఐదు నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ విషయంలో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్.. కరూర్ ఘటన అనంతరం జనాల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా తన పార్టీ మేనిఫెస్టోలోని అంశాల్లో కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఇవి చర్చనీయాంశంగా మారాయి.
అవును... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఆ వేడిని మరింత పెంచే క్రమంలో అన్నట్లుగా టీవీకే పార్టీని స్థాపించిన సినీ నటుడు విజయ్.. సరికొత్త హామీలతో తెరపైకి వచ్చారు. తాజాగా ఓ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ముందుగా ఎంపిక చేసిన కార్యకర్తలు, ప్రజలతో విజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఆశయాలు, లక్ష్యాలను వివరించారు!
తాజాగా జరిగిన సమావేశంలో మైకందుకున్న విజయ్... అధికార డీఎంకే తనపై చేస్తోన్న విమర్శలపై స్పందించారు. టీవీకేకూ స్పష్టమైన రాజకీయ ప్రణాళిక లేదని చేసిన విమర్శపై స్పందిస్తూ.. ప్రజలను దోచుకుంటున్న డీఎంకేకు టీవీకే ఆదర్శాలను ప్రశ్నించే హక్కు లేదని.. సమానత్వం అనే ఆదర్శంతోనే టీవీకే ఏర్పడిందని విజయ్ తెలిపారు.
ఇదే సమయంలో.. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుంచి విద్యను రాష్ట్ర జాబితాకు మార్చాలనే కీలక డిమాండ్ ను తెరపైకి తెచ్చిన విజయ్... త్వరలో వివరణాత్మక మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. ఈ విధంగా తన మ్యానిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలను మాత్రం ప్రజలకు వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతీ ఇంటికీ బైక్ అనే అంశాలను తెరపైకి తెచ్చారు.
ఈ సందర్భంగా... ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతీ ఇంటికీ బైక్, కారు ఉండేలా చూస్తానని.. అదే సమయంలో శాంతిభద్రతలను కఠినతరం చేస్తానని చెప్పిన విజయ్... ఈ హామీలపై వివరణాత్మక నివేదికను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా ప్రతీ కుటుంబానికి బైక్, కారు అందించడమే టీవీకే లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా... ప్రతీ ఇంట్లో ఒక పట్టభద్రుడికి భరోసా కల్పిస్తామని అన్నారు.
అదేవిధంగా... విద్యారంగంలోనూ పలు సంస్కరణలు తీసుకొస్తామని విజయ్ ప్రకటించారు. మత్య్సకారులు, కార్మికులు, నేత కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సంప్రదించి అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేస్తామని.. విపత్తులను నివారించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని విజయ్ ప్రకటించారు.
కాగా.. కరూర్ లో జరిగిన తొక్కిసలాట విషాదం తర్వాత ఆగిపోయిన తన ఎన్నికల ప్రచార కార్యకలాపాలను విజయ్ తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా... టీవీకే కార్యకర్తలు, తన మద్దతుదారులతో కాంచీపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2000 మంది హాజరయ్యారు.
