Begin typing your search above and press return to search.

త‌మిళ రాజ‌కీయం: పొత్తులు క‌లుపుతున్న `తొక్కిస‌లాట‌`

రాజ‌కీయాల్లో పొత్తులు.. చిత్తులు కామ‌న్‌. ఏ రెండు పార్టీల మ‌ధ్యైనా.. పొత్తులు ఎప్పుడు కుదురుతాయో చెప్ప‌డం క‌ష్టం.

By:  Garuda Media   |   8 Oct 2025 4:00 AM IST
త‌మిళ రాజ‌కీయం:  పొత్తులు క‌లుపుతున్న `తొక్కిస‌లాట‌`
X

రాజ‌కీయాల్లో పొత్తులు.. చిత్తులు కామ‌న్‌. ఏ రెండు పార్టీల మ‌ధ్యైనా.. పొత్తులు ఎప్పుడు కుదురుతాయో చెప్ప‌డం క‌ష్టం. అలానే.. ఎప్పుడు చిత్త‌వుతాయో.. కూడా చెప్ప‌లేం. ఇలానే.. త‌మిళ‌నాడు రాజ‌కీయాలు కూడా.. సాగుతున్నాయి. గత నెల 27న జ‌రిగిన క‌రూర్ తొక్కిస‌లాట అనంత‌రం.. రాష్ట్రంలో రాజ‌కీయాలు మారుతున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి.. కొన్నాళ్లుగా బ‌ల‌మైన నేప‌థ్యం ఉన్న‌వారి కోసం ఎదురు చూస్తున్న బీజేపీ.. ఇప్పుడు తొక్కిస‌లాట‌లో బాధిత పార్టీగా ఉన్న త‌మిళ‌గ వెట్రిక‌ళ‌గం(టీవీకే)తో పొత్తుకు చేతులు చాపింది.

ఇక‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీజేపీపై నిప్పులు చెరిగిన‌.. టీవీకే అధినేత విజ‌య్ కూడా..త‌న చుట్టూ కేసు ముసురుకుంటున్న స‌మ‌యంలో దిగివ‌చ్చిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం బీజేపీ నేత‌లు.. త‌మిళ‌నాడుకే చెందిన ఎంపీ హేమ‌మాలిని.. టీవీకేతో పొత్తుల విష‌యంపై అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్న‌ట్టు తెలిసింది. దీనిపై మీడియా క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు అంటూ.. రంగంలోకి దిగిన హేమ మాలిని క‌మిటీ.. స‌హ‌జంగానే టీవీకే త‌ప్పులేద‌ని.. వాదిస్తోంది.

ఇది విజ‌య్‌కుక‌లిసి వ‌చ్చే ప‌రిణామం. గ‌తంలోనూ బీజేపీతో క‌లిసిన అనేక మంది నాయ‌కుల‌పై కేసులు ప‌క్క‌దారి ప‌ట్టాయి. ఇప్పుడు విజ‌య్ వంతు వ‌చ్చింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నాలుగు కాదు.. 40 మెట్లు దిగివ‌చ్చి.. బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించేందుకు రెడీ అయిన‌ట్టు స‌మాచారం. దీనిలో భాగంగానే ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులే కాదు.. ప‌ద‌వుల విష‌యంపై కూడా బీజేపీకి స‌మాచారం ఇచ్చార‌ని అంటున్నారు. పొత్తు పెట్టుకుని అధికారంలోకి వ‌స్తే.. సీఎం పీఠం మిన‌హా.. ఇత‌ర ప‌ద‌వుల్లో ఫిఫ్టీ-ఫిఫ్టీ ఇచ్చేందుకు సుముఖ‌మేన‌న్న‌ది టీవీకే వ‌ర్గాలు చెబుతున్న మాట‌.

ఇక‌, కొన్ని ద‌శాబ్దాలుగా ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా.. త‌మిళ‌నాట పాగా వేయ‌లేక పోతున్న క‌మ‌ల నాథుల‌కు ఇది అందివ‌చ్చిన అవ‌కాశం. సీఎం పీఠం పోయినా.. డిప్యూటీ సీఎం.. హోం స‌హా.. ఇత‌ర శాఖ‌ల‌ను కైవ సం చేసుకుంటే.. ఇది త‌మ‌కు మున్ముందు దోహ‌ద‌ప‌డుతుందనే భావ‌న‌తో క‌మ‌ల నాథులు ఉన్నారు. ఇదే రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణ‌న్‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తి చేసిన త‌ర్వాత కూడా.. ఇక్క‌డ పుంజుకోక‌పోతే.. దేశానికి బ్యాడ్ సంకేతాలు వ‌స్తున్నాయ‌ని భావిస్తున్న క‌మలం పార్టీ నాయ‌కులు విజ‌య్ ష‌ర‌తుల‌కు అంగీక‌రించే అవ‌కాశం ఉంద‌ని త‌మిళ మీడియా చెబుతోంది. ఏదేమైనా.. తొక్కిస‌లాట మృతులు, బాధితుల సంగ‌తి ప‌క్క‌న పెట్టి.. రామాయ‌ణంలో పిడ‌క‌ల వేట మాదిరిగా.. పొత్తుల రాజ‌కీయాల‌కు తెర‌దీయడంపై త‌మిళ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌న్న‌ది మ‌రో మాట‌.