Begin typing your search above and press return to search.

విజయ్ నామినేషన్ పై సస్పెన్స్... ఈసీ బిగ్ షాక్ ఇవ్వబోతుందా?!

పెరంబూర్ లో నామినేషన్ వేసిన విజయ్ తనపై ఎలాంటి కేసులు లేవని, బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   4 April 2026 12:18 AM IST
విజయ్ నామినేషన్ పై సస్పెన్స్... ఈసీ బిగ్ షాక్ ఇవ్వబోతుందా?!
X

తమిళనాడులో కొత్త రాజకీయ సంచలనంగా మారిన సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నామినేషన్ చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న అంశం హాట్ టాపిక్ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్న విజయ్.. పరస్పర విరుద్ధమైన సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చారనే కారణంగా ఆయన నామినేషన్ ను ఎన్నికల కమిషన్ తిరస్కరించే అవకాశం ఉందనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. అదే జరిగితే విజయ్ పార్టీకి భారీ షాక్ తగిలినట్లే అంటున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది తీవ్ర ఉత్కంఠకు కారణమవుతోంది.

తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీకి ఆయన ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 23న అసెంబ్లీకి పోలింగ్ జరుగుతుంది. గత నెల 30న పెరంబూర్ లో, ఈ నెల 2వ తేదీన తిరుచ్చి ఈస్ట్ లో వేలాది అభిమానుల సమక్షంలో విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో విజయ్ నామినేషన్లతోపాటు రెండు చోట్ల సమర్పించిన ఎన్నికల ప్రమాణ పత్రం (అఫిడవిట్)లో పరస్పర విరుద్ధ సమాచారం ఉన్నట్లు బయటకు వచ్చింది.

ఈ పరిణామం తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసే అభ్యర్థి విధిగా ప్రమాణపత్రం సమర్పించాల్సివుంటుంది. ఇందులో అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర వంటి వివరాలు సమగ్రంగా, స్పష్టంగా ఇవ్వాల్సివుంటుంది. ఈ సమాచారంలో ఏమైనా తప్పు ఉంటే అతడు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో ప్రత్యర్థులు ఈ విషయమై ప్రశ్నిస్తే ఆ నామినేషన్ ను ఎన్నికల కమిషన్ తిరస్కరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ప్రచారంతో విజయ్ పార్టీలో తీవ్ర గందరగోళం చెలరేగింది.

పెరంబూర్ లో నామినేషన్ వేసిన విజయ్ తనపై ఎలాంటి కేసులు లేవని, బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక తిరుచ్చి ఈస్ట్ లో సమర్పించిన నామినేషన్, అఫిడవిట్ లో రెండు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని స్వయంగా వెల్లడించడమే కాకుండా పెండింగ్ కేసులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారని చెబుతున్నారు. ఇలా ఎన్నికల అఫిడవిట్ లో వాస్తవాలను దాచిపెట్టడం లేదా తప్పుగా పేర్కొనడం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కిందకే వస్తోందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇవ్వడంపై జరుగుతున్న ప్రచారంతో విజయ్ నామినేషన్ చెల్లుబాటు అవుతుందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. తమిళనాడు ఎన్నికలకు మరో రెండు రోజుల వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఈ లోగా అఫిడవిట్ ను సరిచేసుకోవచ్చా? లేదా? అనేది పరిశీలించాల్సిందిగా న్యాయనిపుణులను విజయ్ పార్టీ వర్గాలు కోరినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ 6 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ రోజు విజయ్ నామినేషన్ పై ఈసీ నిర్ణయం వెలువడుతుంది. ఈలోగా ఏమైనా మార్పు చేసుకునే అవకాశం ఉంటేనే విజయ్ ఎన్నికల్లో పోటీకి అర్హత సాధిస్తారని లేదంటే ఆయన పోటీ నుంచి గల్లంతవడం ఖాయమని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం రాజకీయంగా కాకరేపుతోంది. మొత్తానికి ఎన్నికల్లో పెను సంచలనం సృష్టిస్తారని అనుకుంటే, అంతకు ముందు నామినేషన్ల దశలోనే విజయ్ అఫిడవిట్లలో తప్పులతో గందరగోళానికి కారణమయ్యారని అంటున్నారు.