Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. టీడీపీకి ఏం నేర్పుతున్నాయి.. ?

తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసిన టీవీకే పార్టీ విజయం సాధించింది.

By:  Garuda Media   |   10 May 2026 5:00 PM IST
త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. టీడీపీకి ఏం నేర్పుతున్నాయి.. ?
X

తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసిన టీవీకే పార్టీ విజయం సాధించింది. అధికారంలోకి కూడా వచ్చింది. ఈ క్రమంలో అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు, అనేక వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ చివరాఖరికి టీవీకే పార్టీ అధికారాన్ని దక్కించుకోగలిగింది. అయితే ఈ ఎన్నికలను గమనిస్తే అనేక విషయాలు స్పష్టమవుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ డిఎంకె చిత్తుగా ఓడిపోవడం, మరో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కూడా బలమైన ప్రభావాన్ని చూపించలేకపోవడం వంటివి స్పష్టమైనది.

ఇదే సమయంలో ఒంటరి పోరాటం చేయడంతో పాటు కూటములకు దూరంగా ఉన్న విజయ్ గెలుపు గుర్రం ఎక్కారు. ఈ పరిణామాలతో పాటు రాష్ట్రంలో రూపాయి కూడా పంచకుండా విజయ్ గెలిచారు అని వాదన మరోవైపు వినిపిస్తోంది. ఇక అధికార పార్టీ ఓడిపోవడానికి ముఖ్యంగా 15 మంది మంత్రులు ఓడిపోవడానికి గల కారణాలను గమనిస్తే అనేక విషయాలు తెలుస్తున్నాయి. ప్రధానంగా అవినీతి, క్షేత్రస్థాయిలో పనితీరు, కార్యకర్తలు- నాయకులతో కలిసి లేకపోవడం వంటివి అధికార పార్టీని గద్దె దింపాయి.

అంతేకాదు సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించడంలోనూ డీఎంకే విఫలమైంది. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి కూపాలుగా మారిపోయాయి అన్న కాగ్ నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. వాస్తవానికి తమిళనాడులో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం చేరువ అవుతోంది. అయినప్పటికీ ప్రజలు అధికార పార్టీని పట్టించుకోలేదు. ఇదే సమయంలో రాజకీయంగా కూడా డిఎంకె విఫలమైంది.

వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద అంశాల్లో మంత్రులు జోక్యం చేసుకోవడం, ఎమ్మెల్యేలు వేలు పెట్టడం వంటివి కూడా ప్రజలు హర్షించలేకపోయారు. ఫలితంగానే తాజా ఎన్నికల్లో డిఎంకె కూటమికట్టి ఎన్నికలకు వెళ్ళినప్పటికీ ప్రజలు దూరం పెట్టారు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే ప్రజలకు దూరం కావడం, ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో వెనుకంజ వేసిన నేపథ్యంలో ఆ పార్టీ కూడా పూర్తిగా విఫలమైంది.

ఇక ఒంటరి పోరాటం చేసినప్పటికీ విజయ్ గెలుపు గుర్రం ఎక్కడానికి ప్రధాన కారణం.. అతనిపై ఉన్న నమ్మకం. ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత.. విపక్షంపై ఉన్న అక్కసు కారణమనేది స్పష్టమవుతుంది. మొత్తంగా చూస్తే ఈ ఫలితాలు ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాలను కూడా మార్చుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకుల మ‌ధ్య‌ కలివిడి లేకపోయినా మంత్రులు... ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నా.. ఇదే తరహా ఫలితం ఏపీలో వచ్చిన ఆశ్చర్యం లేదు అని పరిశీలకులు చెబుతున్నారు.