Begin typing your search above and press return to search.

బిగ్ ఇష్యూ... బీజేపీతో పొత్తుపై విజయ్ టీవీకే ఫుల్ క్లారిటీ!

అవును... విజయ్ "జన నాయగన్" సినిమా జాప్యం తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   14 Jan 2026 1:55 PM IST
బిగ్ ఇష్యూ... బీజేపీతో పొత్తుపై విజయ్ టీవీకే ఫుల్ క్లారిటీ!
X

తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాజకీయ పరిణామాలు తీవ్ర ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా గత మూడు నాలుగు రోజులుగా.. టీవీకే అధినేత విజయ్ "జన నాయగన్" సినిమా విడుదల జాప్యంపై జరుగుతున్న రాజకీయ చర్చలు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. దీనిపై ఇప్పటికే రాహుల్ గాంధీ.. విజయ్ కు తన మద్దతు తెలుపుతూ, మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై టీవీకే నుంచి ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

అవును... విజయ్ "జన నాయగన్" సినిమా జాప్యం తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిని టీవీకే స్వాగతించింది. దీన్ని తమ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న స్నేహపూర్వక మద్దతుగా భావిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు టీవీకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీయే కూటమిలో టీవీకే పార్టీ చేరికపైనా ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు.. ఆ ఛాన్స్ లేదన్నారు!

వాస్తవానికి... విజయ్‌ పార్టీని బ్లాక్ మెయిల్ చేసి అయినా, ఎన్డీయేలోకి బలవంతంగా చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని.. అందులో భాగంగానే ఆయన నటించిన జన నాయగన్ సినిమాకు సకాలంలో సెన్సార్ సర్టిఫికెట్ లభించకుండా కేంద్రం అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) స్పందించింది. ఇందులో భాగంగా... తమను రాజకీయంగా అడ్డుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము ఎన్డీయేతో జత కట్టే ప్రసక్తే లేదని నిర్మల్ కుమార్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... టీవీకే ను కూల్చడానికి ఎన్ని కుట్రలు పన్నినా తమ పార్టీ సిద్ధాంత వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా... టీవీకే పార్టీకి భారతీయ జనతా పార్టీ సిద్ధాంత శత్రువు అయితే, డీఎంకే రాజకీయ శత్రువని స్పష్టం చేశారు. అయితే తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను స్వాగతిస్తూ... కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై తమ పార్టీ అధినేత విజయ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని నిర్మల్ కుమార్ వెల్లడించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి.

కాగా... గతేడాది సెప్టెంబరు 27న కరూర్ లోని విజయ్‌ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41మంది మరణించిన ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 12న ఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు విజయ్‌ హాజరు కాగా.. ఆరు గంటల పాటు విచారించింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి సమన్లు జారీ చేసి.. జనవరి 19న మరోసారి విచారణకు రావాలని సూచించింది. అయితే.. ఇదంతా ఆయనపై బీజేపీ తెస్తున్న ఒత్తిడే అనే విమర్శలు వినిపిస్తున్నాయి!