Begin typing your search above and press return to search.

విజయ్ సభలో మరణ మృదంగం

వెండి తెర వేలుపుగా విజయ్ కి ఉన్న అభిమాన గణాన్ని లెక్క వేయడం కష్టం. ఆయన గత మూడు దశాబ్దాలుగా ప్రజల గుండెలలో గూడు కట్టుకున్నారు.

By:  Satya P   |   28 Sept 2025 9:06 AM IST
విజయ్ సభలో మరణ మృదంగం
X

తమిళనాడులో కొత్త పార్టీగా జనం ముందుకు వచ్చిన టీవీకే వరసగా సభలను ప్రతీ జిల్లాలో నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా శనివారం నిర్వహించిన కరూర్ సభలో ఏకంగా మరణ మృదంగమే మోగింది. కడపటి వార్తలు అందే సమయానికి ఏకంగా 39 మంది దాకా మరణించారు అని అంటున్నారు. అందులో చిన్న పిల్లలు మహిళలు ఎక్కువ మంది ఉండడం విషాదం. ఈ రాజకీయ సభలో పెద్ద ఎత్తున ప్రజలు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఒక రాజకీయ సభకు వచ్చి ఇంత మంది జనాలు మృత్యు వాత పడడం ఇదే తొలిసారి. గతంలో కూడా చనిపోయిన సంఘటనలు జరిగినా మృతుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగినదిగా తెలుస్తోంది. మరింత బాధాకరమైన అంశం ఏమిటి అంటే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉండడం.

కన్నీటి కడలిగా :

వెండి తెర వేలుపుగా విజయ్ కి ఉన్న అభిమాన గణాన్ని లెక్క వేయడం కష్టం. ఆయన గత మూడు దశాబ్దాలుగా ప్రజల గుండెలలో గూడు కట్టుకున్నారు. దాంతో ఆయన రాజకీయాల్లోకి వస్తూ జనానికి నేరుగా పలకరించేందుకు రావడంతో అది అతి పెద్ద ఎక్సైట్మెంట్ గానే ఉంది. అయితే అదే సమయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన టీవీకే నాయకత్వం ఫెయిల్ కావడంతో ఇంతటి దారుణం చోటు చేసుకుంది అని అంటున్నారు. ఇక కరూర్ లో జరిగిన విజయ్ సభా ప్రాంగణం చాలా చిన్నదిగా ఉంది. అతి తక్కువ మందితో సభ జరుపుతామని చెప్పి అనుమతి తీసుకుని నిర్వహించిన ఈ సభకు అత్యధికంగా జనాలు తరలి రావడంతో ఊపిరాడకపోవడం తోపులాట జరిగి అత్యధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతే కాదు ఎటు చూసినా హాహాకారాలతో కరూర్ ప్రాంగణం ఉంది. ఆస్పత్రికి తరలించే లోపే ఎంతో మంది ప్రాణాలు విడిచారు. సభ కాస్తా కన్నీటి కడలిగా మారడం మాత్రం అత్యంత విషాదంగా భావిస్తున్నారుఇ.

కారణాలు ఇవేనా :

కేవలం పది వేల మందితో సభ నిర్వహిస్తామని చెప్పి అనుమతి తీసుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ర్యాలీగా విజయ్ తరలి వచ్చి అనంతరం సభ కావడంతో జనాలు పోటెత్తారు. ఇక సభా ప్రాంగణం ఇరుకుగా ఉన్నా ఏకంగా రెండు లక్షల మంది దాకా జనాలు రావడంతో ఒక్కసారిగా కిక్కిరిసిపోయి ఒకరి మీద ఒకరు పడడంతో చిన్నారులు మహిళలు బలి అయ్యారని అంటున్నారు. ఇక సభా నియమాలను పద్ధతులను పాటించడంలో టీవీకే విఫలం అయింది అని అంటున్నారు. విజయ్ మధ్యాహ్నం పన్నెండు వస్తారని ప్రచారం చేస్తే ఆ సమయానికే జనాలు తరలి వచ్చారు. కానీ ఆయన ఆయిదారు గంటలు ఆలస్యంగా వచ్చారు. ఈ సమయం అంతా అక్కడ ఉన్న వారు అంతా ఆకలికి దప్పికకు తట్టుకోలేకపోయారు దాంతో ఉన్న వారు బయటకు వెళ్ళాలనుకోవడం అలాగే లోపలికి రావాలనుకునే వారు ఎగబడడం కూడా భారీ తోపులాటకు కారణం అయింది అని అంటున్నారు.

ప్రధాని సంతాపం :

ఈ ఘోర కలి మీద ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు తగిన చికిత్స అందించాలని ఆయన కోరారు. మరో వైపు చూస్తే కనుక ఈ దారుణం మీద తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన బాధితులకు నష్ట పరిహారం ప్రకటించారు. ఆదివారం నాటికి ప్రాధమిక నివేదిక తయారు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఇంకో వైపు కరూర్ సభ కోసం అనుమతులు కోరిన టీవీకే నాయకులను ఇప్పటికే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.