Begin typing your search above and press return to search.

బలం చేకూరింది.. విజయ్‌కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. సీఎంగా రేపే ప్రమాణ స్వీకారం

తమిళనాడు రాజకీయ యవనికపై గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠభరిత ఘట్టానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది.

By:  A.N.Kumar   |   8 May 2026 9:23 PM IST
బలం చేకూరింది.. విజయ్‌కి గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. సీఎంగా రేపే ప్రమాణ స్వీకారం
X

తమిళనాడు రాజకీయ యవనికపై గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠభరిత ఘట్టానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధినేత, కోలీవుడ్ సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని పటాపంచలు చేస్తూ విజయ్ సారథ్యంలోని టీవీకే కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాజ్ భవన్‌లో రాజకీయ చలనం

మెజార్టీకి కావాల్సిన మద్దతు లేఖలను సిద్ధం చేసుకున్న విజయ్.. శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ను కలిశారు. తన వెనుక ఉన్న ఎమ్మెల్యేల బలాన్ని, కూటమి మద్దతును వివరించిన అనంతరం గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ విజయ్‌ను అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు తమిళనాడు నలుమూలల నుండి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో చెన్నై నగరం ఇప్పటికే పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

అంకెలాటలో టీవీకే విజయం

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేజిక్ ఫిగర్‌కు కొద్దిపాటి దూరంలో నిలిచిపోయింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో మెజార్టీ సాధించడంపై మొదట్లో సందిగ్ధత నెలకొంది. ఒకానొక దశలో దశాబ్దాల రాజకీయ ప్రత్యర్థులు డీఎంకే-అన్నాడీఎంకే ఒక్కటవుతాయన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే అనూహ్య మలుపులతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.

టీవీకే బలం 107 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ మద్దతు 5 ఎమ్మెల్యేలు.. వామపక్షాలు (సీపీఏ, సీపీఎం) చెరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. వీసీకే 2 ఎమ్మెల్యేలు, ఐఎంయూఎల్ 2 ఎమ్మెల్యేలు కలుపుకొని మొత్తంగా 120 మంది ఎమ్మెల్యేల బలంతో విజయ్ సేఫ్ జోన్‌లోకి చేరుకున్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ లౌకికవాద శక్తులన్నీ విజయ్ వెనుక నిలబడటం విశేషం.

వామపక్షాల వ్యూహాత్మక మద్దతు

ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వామపక్షాలు ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి బయటి నుండి మాత్రమే మద్దతు ఇస్తామని, మంత్రివర్గంలో చేరబోమని స్పష్టం చేశాయి. సిపిఎం నేత యు. వాసుకి మాట్లాడుతూ "రాష్ట్ర హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తాం" అని ప్రకటించారు. మద్దతు తెలిపినందుకు విజయ్ స్వయంగా సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు వెళ్లి నేతలకు కృతజ్ఞతలు తెలపడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కొత్త శకం ప్రారంభం

సినీ గ్లామర్ నుండి రాజకీయాల్లోకి వచ్చి కేవలం అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్న విజయ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల వారసత్వాన్ని విజయ్ ఏ మేరకు కొనసాగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం. సోమవారం లేదా మంగళవారం నాడు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి తమిళనాడు వ్యాప్తంగా "తలైవా" నినాదాలు మిన్నంటుతున్నాయి. విజయ్ పట్టాభిషేకం ద్వారా తమిళనాట సరికొత్త రాజకీయ అధ్యాయం లిఖించబడబోతోంది.