Begin typing your search above and press return to search.

విజయ్ మాస్టర్ స్ట్రోక్ : ఆ పార్టీలు కరివేపాకు లేనా ?

తమిళనాడులో దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ఒక నాలుగు చిన్న పార్టీలు కీలకం అయ్యాయి.

By:  Satya P   |   12 May 2026 11:11 PM IST
విజయ్ మాస్టర్ స్ట్రోక్ : ఆ పార్టీలు కరివేపాకు లేనా ?
X

తమిళనాడులో దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ఒక నాలుగు చిన్న పార్టీలు కీలకం అయ్యాయి. ఉభయ వామపక్షాలు, ఐయూఎంఎల్, వీసీకే ల నుంచి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్ సీఎం కావడానికి ప్రాణప్రదం అయ్యాయి. వారి మద్దతు లేఖలను చూసే 112 వద్దఉన్న విజయ్ బలాన్ని 120 దాకా పెరిగిన నంబర్ ని గుర్తించి గవర్నర్ సీఎం గా ప్రమాణం చేయించారు. ఇక విజయ్ అయితే తొమ్మిది మంది మంత్రులతో ప్రమాణం చేశారు. అయితే వారంతా టీవీకేకి చెందిన వారే కావడం గమనార్హం. మిత్రులకు ఆయన ఎక్కడా తొలి విడతలో అవకాశం ఇవ్వలేదు. అందులో వామపక్షాలు తమకు మంత్రివర్గంలో చోటు వద్దని చెప్పేశాయి. వీసీకే అయితే తమకు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలతోనే ఉప ముఖ్యమంత్రి పదవి కోసం అడిగినట్లుగా ప్రచారం సాగింది. మరో పార్టీ ఐయూఎంఎల్ కి మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు.

అన్నా డీఎంకే చీలికతో :

ఇపుడు విజయ్ కి అనుకోని వరంగా అన్నా డీఎంకే చీలిక వర్గం నుంచి పూర్తి సపోర్ట్ లభిస్తోంది. 2026 ఎన్నికల్లో అన్నా డీఎంకే మొత్తం 47 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. అందులో మూడింట రెండు వంతుల మంది కనుక వేరు పడితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఆ మ్యాజిక్ నంబర్ 31 గా ఉంది. ఇపుడు చీలిక వర్గంలో 30కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా నంబర్ పెరుగుతుందని అంటున్నారు అన్నా డీఎంకే నామమాత్రం అయి మొత్తానికి మొత్తం టీవీకే వైపుగా వస్తారని అంటున్నారు.

విలీనం వ్యూహం :

ఇక అదే కనుక జరిగి టీవీకేలో విలీనం అయిపోతే ఆ పార్టీ బలం 107 ప్లస్ 31 అంటే 138 దాకా ఉంటుంది అన్న మాట. ఎటూ కాంగ్రెస్ కి చెందిన 5 గురు ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది. అంటే 143 మందితో సుస్థిరమైన ప్రభుత్వమే టీవీకే ఏర్పాటు చేస్తుంది. అపుడు ఈ నాలుగు పార్టీల ఎమ్మెల్యేల మద్దతు అన్నది అంతగా అక్కరకు రాదని అంటున్నారు. వీరు కూడా మద్దతు ఇస్తూ పోతే 151 దాకా పెరిగి టీవీకే ఇంకా పటిష్టం అవుతుంది.

మంత్రి పదవులు దక్కేనా :

ఇవన్నీ పక్కన పెడితే బల పరీక్ష తరువాత విజయ్ తన టీవీకే ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో విస్తరిస్తారు అని అంటున్నారు. తమిళనాడులో మొత్తం 35 మంది దాకా మంత్రులను తీసుకోవచ్చు. ఇప్పటికే తొమ్మిది మంది మంత్రులు ఉన్నారు అంటే ఇంకా పాతిక మంది దాకా కేబినెట్ లో చోటు ఉంటుంది అన్న మాట. అందులో కాంగ్రెస్ కి రెండు మంత్రి పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఆ మిగిలిన వాటిలో అన్నా డీఎంకే నుంచి వచ్చి చేరే వారికి ఒక అరడజన్ మంత్రి పదవులు ఇస్తారని చెబుతున్నారు. మరి ఈ లెక్కన ఐయూఎంఎల్ కి వీసీకే కు చెరి ఒక మంత్రి పదవి ఇస్తారా అన్నదే చర్చ. ఇప్పటికే ఈ పార్టీలు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి. తమిళ రాష్ట్ర గీతాన్ని ప్రమాణ స్వీకారం సమయంలో మూడవ ప్లేస్ లో ఉంచారని నిన్న ఆరోపిస్తే ఈ రోజున విజయ్ తన సలహాదారుగా ఒక జ్యోతిష్కుడిని నియమించుకున్నారు అని మండి పడుతున్నాయి. అయితే విజయ్ వైఖరిని బట్టి చూస్తే ఇలాంటి వాటిని పట్టించుకోరని చెబుతున్నారు ఇపుడు ఎటూ అన్నా డీఎంకే చీలిక వర్గం మద్దతు ఉండబోతోంది కాబట్టి ఈ పార్టీలు ఎంత సౌండ్ చేసినా టీవీకే తన ఆలోచనలను అమలు చేసుకుంటూ పోతుందని అంటున్నారు. మొత్తానికి సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఎంతగానో అక్కరకు వచ్చిన ఈ నాలుగు పార్టీలు రెండు రోజులు తిరిగేసరికి కరివేపాకులుగా మారిపోతున్నాయా అన్న చర్చకు తెర లేస్తోంది.