టీవీ సీరియల్ తెచ్చిన తంటా.. కుమారుడితో సహా గడ్డిమందు తాగిన భార్య!
ఇటీవల కాలంలో మనుషుల మనస్తత్వం ఎలా మారిపోయింది అంటే.. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు.
By: Madhu Reddy | 23 Aug 2025 1:23 PM ISTఇటీవల కాలంలో మనుషుల మనస్తత్వం ఎలా మారిపోయింది అంటే.. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను మొదలుకొని పెద్దవాళ్ల వరకు చిన్న చిన్న విషయాలకే ఫీల్ అయిపోతూ ఇతరులను చంపడానికి కూడా వెనకాడని రోజులు వచ్చేసాయి అనడంలో సందేహం లేదు అంటూ ఇప్పటికే పలువురు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక జంట ఏకంగా టీవీ సీరియల్ కోసం గొడవపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆ భార్య కుమారుడికి గడ్డి మందు ఇచ్చి, ఆమె కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది? సీరియల్ కారణంగా వీరు గొడవపడి.. ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లడానికి గల కారణం ఏమిటి? అసలేం జరిగింది? అనే విషయం ఎప్పుడు చూద్దాం.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.. ఓ గ్రామానికి చెందిన ఒక రైతు ఎప్పటిలాగే పొలం పనులు పూర్తిచేసుకుని గురువారం రోజు ఇంటికి వచ్చారు. టీవీ సీరియల్ చూస్తున్న భార్యతో అన్నం పెట్టమని కోరాడు. ఆ సమయంలో ఆమె సీరియల్ పూర్తయ్యాక అన్నం పెడతానని చెప్పడంతో.. ఇద్దరి మధ్య కాస్త గొడవ జరిగింది. ఇదే విషయమై శుక్రవారం ఉదయం మరొకసారి గొడవపడ్డారు. అనంతరం రైతు పొలం వద్దకు వెళ్ళగా.. మనస్థాపం చెందిన ఆ భార్య అతను ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి.. 8 సంవత్సరాల తన కుమారుడికి కూడా తాగించింది.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. స్థానికుల సహాయంతో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడగా.. బాలుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పట్టణంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కి తరలించి.. బాబుకి చికిత్సను అందిస్తున్నారు. ఇకపోతే ఈ విషయంపై ఎస్ఐ తిరుపతిని వివరణ ఇవ్వమని కోరగా.. ఆయన ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. టీవీ సీరియల్ తెచ్చిన తంటా క్షణికావేశంలో ఆ మహిళ చేసిన పనికి చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు.
పొలం పనులకు వెళ్లిన భర్తకు సమయానికి అన్నం పెట్టాల్సింది పోయి టీవీ సీరియల్ లో నిమగ్నం అవడం ఏంటి? అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. సీరియల్ అయిపోయాక అన్నం పెడతానన్నది కదా కాసేపు ఆగలేకపోయారని ఇలా ఎవరికివారు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక సీరియల్ తీసుకొచ్చిన తంటా ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవకు కారణం అవడమే కాకుండా బాలుడి పరిస్థితిని విషమంలోకి నెట్టేసిందని చెప్పవచ్చు. ఇక త్వరలోనే ఆ బాబు కోలుకోవాలని చాలామంది ఆకాంక్షిస్తున్నారు.
